నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానమును మనము బైబిల్ నుండి యోబు 5:9వ వచనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మన పట్ల లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించాలని కోరుచున్నాడు. ఈ వాక్యమును మరల చదువుదాము, "ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు'' అని చెప్పబడియున్నది. నా ప్రియులారా, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నాము కదా. అందుకే బైబిల్ నుండి యోబు 42:2 వ వచనమును చూచినట్లయితే, "నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మన పట్ల సమస్త క్రియలను చేయగలడు. ఆయన మన పట్ల ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు చెప్పబడియున్నది. అవును, మన దేవుడు అద్భుతమైన దేవుడుగా ఉంటున్నాడు, కనుకనే, 'ఆయన అద్భుతకరుడు' అని యెషయా గ్రంథములో 9:6వ వచనములో మనము చదువగలము. మరియు బైబిల్ నుండి కీర్తనలు 136:4వ వచనములో చూచినట్లయితే, "ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును'' అని చెప్పబడిన ప్రకారము ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములను జరిగించు దేవుడుగా ఉన్నాడు. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియులారా, ఇంకను బైబిల్ నుండి యిర్మీయా 32:17,27వ వచనములలో మనము అదే విషయమును చదువుతాము. కనుకనే, ఆ వచనములలో మనము చూచినట్లయితే, "యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహా దేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు మరియు నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?'' అని చెప్పబడినట్లుగానే, దేవునికి అసాధ్యమైన కార్యము ఏదియు లేదు. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నాము కదా. ఈ రోజులలో అనేకమంది బిడ్డలు పరీక్షలు వ్రాయుచున్నారు. కొంతమంది బిడ్డలు ఇలాగున అంటూ ఉంటారు కదా! ' అయ్యో, నేను కష్టపడి చదువుకున్నాను, కానీ, ఆ సమయములో అన్నిటిని నేను మరచిపోవుచున్నాను.' ఇంకను చాలామంది పిల్లలు అన్నిటిని జ్ఞాపకము ఉంచుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే, మీరందరు కూడా ఈ అద్భుతమైన గొప్ప దేవుడైన అద్భుతకరుని చూడగలరు. ఆయన సన్నిధిలో మనము నిలువబడాలి, ఆయన వైపు మనము చూడాలి. 'ఓ దేవా, నీవే మాకు సహాయము ' అని చెప్పాలి.

అందుకే బైబిల్ నుండి, " యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని కీర్తనాకారుడైన దావీదు భక్తుడు తెలియజేయుచున్నాడు. నా ప్రియులారా, మీరు కూడా ప్రభువును గట్టిగా హత్తుకొనండి, ప్రభువు జ్ఞాపక శక్తిని మీకిస్తాడు. మీరు వ్రాయవలసినదంతయు ఆయన మీకు నేర్పిస్తాడు. మీరు ఎన్నో అధికమైన మార్కులను పొందుకుంటారు. మీరు అన్నిటిని జ్ఞాపకముంచుకొనకపోయినను సరే, మన దేవుడు సరైన సమయములో మీరు ఏమి వ్రాయాలో ఆయన మీకు తెలియజేస్తాడు. మన దేవుడు అద్భుతకరుడు, కాబట్టి ఆయనను గట్టిగా హత్తుకొనండి, ఆయన యెదుట, ఆయనకు ఇష్టకరమైన జీవితమును జీవించండి. అప్పుడు మీ జీవితములో మీకు అవసరమైనవాటన్నిటిని ఆయన అద్భుత విధంగా సమకూరుస్తాడు. కాబట్టి, రండి, మనలను మనము తగ్గించుకొని, ప్రభువు వైపు చూద్దాము. ఆయనకు మొఱ్ఱపెడదాము. 'ప్రభువా, నీవు మాత్రమే మాకు సహాయము' అని చెప్పినప్పుడు, నిశ్చయముగా ఆయన యొద్ద నుండి మీకు సహాయము వస్తుంది. కనుకనే, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రేమగల ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క ప్రేమను మరియు అప్యాయతను మరియు నీవు నడిపించు విధానమును మేము జ్ఞాపకము చేసుకొనుటకు నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు అద్భుతాలు చేయు దేవుడవు కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, లెక్కలేనన్ని గొప్ప మరియు అద్భుతమైన కార్యములను జరించుము. యేసయ్యా, మా ప్రార్థనను విన్నందుకు మరియు మా జీవితంలో అద్భుతాలు చేయబోవుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసుకుని మేము ఈ రోజు నీ వైపు చూచుచున్నాము. దేవా, మా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ మాకు సహాయం చేయుము. ప్రభువా, మా మనస్సులను తాకుము, మేము చేయుచున్న ప్రయత్నములన్నిటిని ఆశీర్వదించుము. ప్రభువా, మేము నీవైపు చూచుటకును, నీకు మొఱ్ఱపెట్టుటకును మరియు మా సమస్యల నుండి మేము బయటకు వచ్చుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, పరీక్షలు వ్రాయుచున్న మాకును మరియు మా ప్రియులగువారికిని నీ యొక్క జ్ఞానమును మరియు జ్ఞాపక శక్తిని, ఇంకను నీ ఆశీర్వాదములన్నిటిని మాకు దయచేయుము. యేసయ్యా, సరైన సమయంలో మాకు సరైన విషయాలను నేర్పుము మరియు నిన్ను హత్తుకొని, నీ యెదుట సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము. యేసుప్రభువా, నీ శాంతి సమాధానమును, విశ్వాసం మరియు బలంతో మమ్మును నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.