ప్రియులారా, 2026వ సంవత్సరము, "లేచి, కట్టుకొను సంవత్సరము" గా దేవుని చేత నియమించబడెను. ఈ నూతన సంవత్సరమును ప్రభువే స్వయంగా ఆశీర్వదించుచున్నాడు, ఈ సంవత్సరములో విరిగినవి, ఆలస్యమైనవి, విడిచిపెట్టబడినవి లేక శిథిలావస్థలో ఉన్నవన్నియు పునరుద్ధరించబడి, తగిన కాలములోను మరియు క్రమముగాను ఎంతో చక్కగా  పునర్నిర్మించబడును. హెబ్రీయులకు 3:3లో, ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఆరు రోజుల్లో సమస్తమును సృష్టించిన అదే సర్వశక్తిమంతుడైన దేవుడు, 2026లో మన కోసం సమస్తమును పునర్నిర్మించును. ఆయన మన కుటుంబ జీవితములను, మన వ్యక్తిగత జీవితములను, మన పరిచర్యలను మరియు మన ఆధ్యాత్మిక పునాదులను పునర్నిర్మించును. యిర్మీయా 31:4లో ప్రభువు, “నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును” అని వాగ్దానం చేసిన ప్రకారము, ఒకప్పుడు దుఃఖములో ఉన్న మనలో ఆనందమును, ఆరాధనను మరియు వేడుకను పునరుద్ధరించే ప్రధాన నిర్మాణకుడైన దేవుడే మన ముందు నడుచుచున్నాడని తెలుసుకొని, విశ్వాసముతోను మరియు నిరీక్షణతోను మనము ఈ సంవత్సరములో ధైర్యముగా ప్రవేశించెదము.

ఈ పునర్నిర్మాణము, దైవీక ఘనత మరియు సమాధానముతో కలుగును. మత్తయి 21:42లో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను అని యేసు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. తిరస్కరించబడిన, విస్మరించబడిన లేక అనర్హులుగా ప్రకటించబడిన వారిని దేవుడు మూలకు తలరాయిగా ఉంచును. శత్రువులు పనికిరానిదిగా ప్రక్కనపెట్టిన వాటిని దేవుడు తన పనికి పునాదిగా ఉపయోగించుకొనును. ప్రభువే దీనిని స్వయంగా చేయుచున్నాడు మరియు అది మన దృష్టిలో అద్భుతముగా ఉండును. దేవుడు మన శత్రువుల హస్తముల నుండి మనలను విడిపించినప్పుడు, ఆయన మనకు సమాధానమును కలిగించును మరియు వ్యతిరేకత మధ్యలో సహితము కట్టబడునట్లు చేయును. 2 దినవృత్తాంతములు 14:7 ప్రకారం, దేవుని ప్రజలు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన వారి చుట్టు నెమ్మది కలుగజేసెను మరియు వారు పట్టణములను కట్టి వృద్ధినొందారు. 2026వ సంవత్సరమునకు ఇదే వాగ్దానం: ‘‘మనము కట్టుకొని, వృద్ధి పొందెదము’’. దేవుడు మన గృహములను, కుటుంబములను, పరిచర్యలను మరియు అంతర్గత జీవితములను కట్టును మరియు ఆయన మనలను నిర్మించేవారిగా చేసి, సమాధానముతో కట్టుటకును, సమాధానముతో సేవ చేయుటకును మరియు సమాధానముతో వృద్ధిపొందుటకును సహాయము చేయును.

2026వ సంవత్సరములో పునర్నిర్మాణము వ్యక్తిగతంగా మాత్రమే గాక, అంతకుమించి తరతరములకు మరియు దేశములకు విస్తరించును. పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను కట్టువారు, అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను మరల కట్టువారు మనలో నుండి వచ్చును అని యెషయా 58:12 సెలవిచ్చుచున్నది. తరతరములుగా విడిపోయినందువలన మరియు భయము, బెదిరింపులు, తిరస్కరణ, నిరాశ వలన నాశనము చేయబడిన స్థలములు పునరుద్ధరించబడును. దేవుడు తన ప్రజలను తన ఆత్మతో నింపును మరియు అనేక తరముల క్రిందటి పునాదులను పునర్నిర్మించుటకు వారికి శక్తినిచ్చును. విరుగబడినదానిని బాగుచేయువారమనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువారమనియు మనకు పేరు పెట్టబడును. మరో మాటలో చెప్పాలంటే, దేవుని ప్రజలు నగరములను కట్టుదురు మరియు సమాధానకరమైన సమాజములను స్థాపించెదరు. దేవుడు, పునాదులు వేయుట మాత్రమే కాకుండా, గోడలను పునర్నిర్మించుచున్నాడు, తన సంఘమును ఏకము చేయుచున్నాడు మరియు తన వాక్యము ద్వారా ప్రవచనాత్మక దర్శనములను బయల్పరచుచున్నాడు. దేవుడు ఒక అద్భుతము చేయబోవుచున్నాడు. దేవుడు తన ఆత్మను కుమ్మరించి, జ్ఞానము, సమగ్రత మరియు దైవీక అధికారము కలిగిన నాయకులైన యోసేపు మరియు దానియేలులను లేవనెత్తును గనుక ఇది చెన్నైలో ప్రారంభమై దేశమంతట మరియు ప్రపంచమంతట వ్యాపించును.

ఈ ప్రపంచము, పునర్నిర్మాణము, ప్రార్థన, ప్రవచనము మరియు దేవుని అంత్యకాల ఉద్దేశ్యములతో ముడిపడి ఉన్నది. ప్రకటన 6వ అధ్యాయము, మొదటి ఆరు ముద్రల గురించి మాట్లాడుచున్నది, అవి విజయం, యుద్ధం, కరువు, మృత్యువు, బలిదానం మరియు ప్రకృతి వైపరీత్యాలు. వీటిని మనం ఇప్పటికే చూశాము. ఇప్పుడు, ఏడవ ముద్ర తెరవబడుచున్నది, ఇది పరిశుద్ధుల ప్రార్థనలు ధూపము వలె పరలోకమునకు చేరుకొని, అగ్నివలె తిరిగి వచ్చును. 2026వ సంవత్సరము నుండి, ఇశ్రాయేలు, ఇండియా మరియు విదేశముల నుండి ప్రార్థనలు, విన్నపములుగా మాత్రమే కాకుండా దేవుని నిర్ణయములను భూమికి తీసుకొనివచ్చే మరియు క్రీస్తు రెండవ రాకడకు ప్రపంచమును సిద్ధము చేయు ప్రవచనాత్మక ధూపములా ఏకమై పరలోకమునకు చేరును. ప్రార్థన మరియు ప్రవచనము ఏకమై, ఉరుములు మరియు మెరుపులతో అగ్ని వలె తిరిగి వచ్చును, ఆటంకములను తొలగించును, అపవాదిని క్రింద పడవేయును మరియు సమాధానమును కలుగజేయును. ఈ సంవత్సరములో, దేవుడు తన ఆత్మను ప్రతిఒక్కరి మీద కుమ్మరించును; కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు, అద్భుతములు అధికముగా జరుగును మరియు జరుగబోయే కార్యములను గూర్చి ప్రవచనాత్మకముగా పలుకబడును. ఈ సమయములో దేవుడు మనలను ఆంతర్యములో పునర్నిర్మించుచున్నాడు మరియు కట్టువారిగా నుండునట్లు మనలను బాహ్యంగా బలపరచుచున్నాడు. 2026వ సంవత్సరములో భూమిపై తన చిత్తమును నెరవేర్చుటకు ప్రార్థించమనియు, ప్రవచించమనియు మరియు ఆయనతో భాగస్థులమై ఉండమనియు దేవుడు మనలను పిలుచుచున్నాడు.

ప్రార్థన:
ప్రభువా, ఈ 2026వ సంవత్సరములో నా జీవితమును పునర్నిర్మించుచున్నందుకై నీకు స్తోత్రములు. నీవే ప్రధాన నిర్మాణకుడవు గనుక నా జీవితములోని విరిగిన, ఆలస్యమైన మరియు విడువబడిన కార్యములను నీ చేతులకు సమర్పించుచున్నాను. నీ వాక్యము ప్రకారము, నీవు సమస్తమును కట్టువాడవు గనుక, నీవు నా కుటుంబమును, నా ఆత్మీయ జీవితమును, నా పిలుపును మరియు నా భవిష్యత్తును చక్కగాను, తగిన కాలములోను కట్టెదవని నేను విశ్వసించుచున్నాను. ఒకప్పుడు తిరస్కరించబడిన మూలరాయివైన యేసయ్యా, నేను తిరస్కరించబడిన లేక తక్కువగా చూడబడిన స్థలములోనే నన్ను ఘనపరచమని ప్రార్థించుచున్నాను. నేను నీ కృపచేత అన్నివైపుల కట్టబడి, వృద్ధిపొందుటకు నీ సమాధానము నన్ను చుట్టియుండును గాక. దయతో నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము, నా జీవితములో నీ ప్రవచనాత్మక ప్రత్యక్షతలను బయల్పరచుము మరియు నా ప్రార్థనలు నీ చిత్తానుసారముగా ఉండుటకు సహాయము చేయుము. నా జీవితములో నుండి ధూపము పైకి చేరుకొనగా, నీ పరిశుద్ధ అగ్ని క్రిందికి దిగివచ్చును గాక మరియు ఆటంకములను తొలగించి, అపవాదిని ఓడించి, నా జీవితము ద్వారా నీ రాజ్యమును స్థాపించమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.