నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి రోజు ప్రభువు ఇచ్చిన గొప్ప వరము, నూతన కనికరము మరియు నూతన అవకాశాలతో నిండి ఉంటుంది. ప్రభువు తన పిల్లలను ఆశీర్వదించడంలో ఆనందించే గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆయన నుండి గొప్ప కార్యాలను ఎదురు చూడాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 11:40 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "...నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు...'' ఇది ఎంత శక్తివంతమైన వాగ్దానం! ఈ గొప్ప వరమును మనము విశ్వసించి పొందుకుందాము. బైబిల్ నుండి మార్త తన సహోదరుడు లాజరు అప్పటికే చనిపోయి సమాధి చేయబడినప్పుడు, ఆయన ఆమెతో ఈ మాటలు సెలవిచ్చియున్నాడు. ఆ సమయంలో ఆయన ఆమెతో కూడా కలిసి ఎంతో బాధ మరియు నిరాశతో ఉండెను. అయినప్పటికి, యేసు సమాధి యెదుట నిలువబడి, విశ్వాసం ఇప్పటికి దేవుని మహిమకు ద్వారాలను తెరవగలదని ప్రకటించాడు. నా ప్రియమైన స్నేహితులారా, అదేవిధంగా, మన జీవితాలలో: మన కలలు, సంబంధాలు, ఆరోగ్యం లేదా ఆర్థిక పరిస్థితులు - మృతమైనట్లు అనిపించినప్పుడు కూడా - యేసు మన ముందు నిలువబడి, మీరు నమ్మడం లేదా? అని మృధువుగా అడుగుతాడు.

నా ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా ఆలాగే ఉంటాము. మన జీవితములో మనకు ఇంకా మార్గం లేదు అని చెప్పు పరిస్థితికి వస్తాము. బహుశా! మీరు మీ అప్పు తిరిగి చెల్లించడానికి చివరి తేదీని ఎదుర్కొంటుండవచ్చును. మరియు అది ఎలా జరుగుతుందో మీకు తెలియదు. బహుశా! మీ ఆరోగ్యం క్షీణిస్తుండవచ్చును లేదా మీ కుటుంబం విడిపోవచ్చును. ఆ క్షణంలోనే, యేసు మీ దగ్గరకు వచ్చి, 'మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? అని ఆయన మిమ్మును అంటున్నాడు, "మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, మీరు పర్వతాలను కదిలించగలరు.'' ఆలాగునే, పక్షవాతముతో బాధపడుచున్న తన దాసుని కొరకు యేసు దగ్గరకు వచ్చిన శతాధిపతి ఇలాగున అన్నాడు, "ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాట మాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును మరియు నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.'' యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, "వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.'' నేడు, నా ప్రియులారా, ప్రభువు మనలను అటువంటి గొప్ప విశ్వాసమును కలిగి ఉండాలని మన పట్ల కోరుచున్నాడు. మన జీవితములో సమస్తమును మృతమైపోయినట్లు కనిపించినప్పటికి దేవుని నమ్మండి. భయం మన మీద అధికారము చేయకూడదని ఆయన మనపట్ల కోరుకుంటున్నాడు. ఆయన శక్తి ఇప్పటికి అద్భుతాలు చేయగలదని మనం విశ్వసించాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. సమస్తమును సరిచేయలేనిదిగా అనిపించినప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేయగలడని మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు.

ఒకసారి నేను ఒక విద్యార్థిని కలిశాను, అతను తన చివరి సంవత్సరంలో ఇరవై ఒక్క పేపర్లలో ఓటమి పాలు అయ్యాడు. అతను మా పరీక్షల కొరకైన విధ్యార్థుల ప్రార్థన కూటానికి పాల్గొన్నాడు. తన భవిష్యత్తు ముగిసిపోయిందని నమ్మకముతో ఆ కూటమునకు వచ్చాడు. కానీ అతను ప్రార్థించుచున్నప్పుడు, దేవుని సమాధానము అతని హృదయాన్ని నింపి అతని యొక్క భయాలన్నిటిని తన నుండి దూరం చేసినది. తద్వారా, అతనిలో విశ్వాసం పెరగడం ప్రారంభమైనది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు, ఒక నూతన ఉత్సాహంతో చదువుకున్నాడు మరియు ఒకే ప్రయత్నంలో ఇరవై ఒక్క పేపర్లను వ్రాసి, వాటన్నిటిని పూర్తి చేశాడు. అతడు అన్నిటిలోను సంపూర్ణంగా ఉత్తీర్ణతను పొందుకున్నాడు. అతను ఘనంగా పట్టభద్రుడయ్యాడు! ఇది ఎంత గొప్ప రూపాంతరము కదా! అది యేసును విశ్వసించడములో పొందుకున్న గొప్ప శక్తి. కనుకనే, నా ప్రియులారా, నేడు మీ చదువులలో విఫలమై చనిపోయినట్లు అనిపించినప్పుడు, దేవుడు వాటిని పునరుద్దరించగలడు. లేక మీరు మీ తండ్రిని కోల్పోయినప్పుడు, దేవుడే మీకు తండ్రిగా ఉంటాడు మరియు మిమ్మును ఆయన పైకి లేవనెత్తుతాడు. మీ జీవితం అంతము అయినట్లుగా అనిపించినప్పుడు, యేసు మిమ్మల్ని మరల సజీవముతో లేపుతాడు. ఆయనకు అసాధ్యమైనదియు ఏదియు లేదు. కాబట్టి, మన జీవితంలోని ప్రతి రంగంలోనూ - మన చదువులు, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తులో - దేవుని మహిమను చూడాలని మనం నమ్ముదాం. ఆయన ఒక అద్భుతాన్ని ఆజ్ఞాపిస్తాడు మరియు ఆయన మహిమ కొరకు ఆయన శక్తివంతమైన హస్తమును మీరు చూచెదరు. కనుకనే, నేడే ఆయన యందు విశ్వాసముంచండి, మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
విశ్వాసమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, విశ్వాసంతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మా బలం విఫలమైనప్పుడు కూడా, మేము నిన్ను నమ్మాలని ఎంచుకొనుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, నీవు మా జీవితములో ఒక్క మాటను మాత్రము పలికినట్లయితే, మాలో మృతమైనవన్నియు మరల సజీవముగా తిరిగి లేచునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబంలో, మా చదువులలో మరియు మా పనిలో అద్భుతాలను ఆజ్ఞాపించుము. దేవా, మాలోని ప్రతి బ్రద్ధలైన ప్రాంతంలో నీ పునరుత్థానపు శక్తి ప్రవహించునట్లుగా చేయుము. ఓ ప్రభువా, ఓడిపోయిన మరియు ఫలించని ప్రతి కలలను నీవు పునరుద్ధరించుము. యేసయ్యా, వ్యాధులతో పోరాడుచున్న మా శరీరాలను స్వస్థపరచుము మరియు మేము కోల్పోయిన మా ఆనందాన్ని మరల పునరుద్ధరించుము. యేసయ్యా, మా గృహములలోను మరియు జీవితాలలో నీ మహిమను చూచునట్లుగా మాకు నీ యందు విశ్వాసమును దయచేయుము. దేవా, మాలోని ప్రతి భయాన్ని తొలగించుకొనడానికి మమ్మును విశ్వాసములో బలముగా మార్చుమని ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.