నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచూ, ఈ రోజు మిమ్మును ఆహ్వానించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 125:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని యందు అటువంటి నమ్మకమును కలిగియుంటున్నారా? మీరు దేవుని యందు విశ్వాసముంచిన యెడల ఆయన ద్వారా ఆశీర్వాదములను పొందెదరు.

బైబిల్ నుండి నిర్గమకాండము 3:1వ వచనములో చూచినట్లయితే, మోషే భక్తుని గురించి మనము చదవగలము. ఆ వచనము, "మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను'' అని చెప్పబడినట్లుగానే, అంతకు ముందు మోషేకు సర్వశక్తిమంతుడైన దేవుని గురించి ఏమియు తెలియదు. అయితే, మోషే దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. మోషే హోరేబునకు వచ్చినప్పుడు ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. ఇశ్రాయేలీయుల ప్రజలందరు కూడా బానిసత్వములో ఉన్నారు. వారందరు కూడా బానిసత్వములో ఉన్నందున ఐగుప్తీయులు వారిని ఎంతగానో శ్రమపెడుతూ బాధించియున్నారు. అయితే, ప్రభువు వారందరిని విడిపించాలని అనుకున్నాడు. ఆ సమయములో ప్రభువు మోషేను మరియు ఆహరోనును పిలిచాడు. వారు దేవుని యందు నమ్మిక యుంచారు. గనుకనే, వారు ఉంచిన ఆ నమ్మకము ద్వారానే, ఇశ్రాయేలీయులందరిని బానిసత్వములో నుండి బయటకు నడిపించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ లోక బానిసత్వములో నుండి బయటకు రావడానికి ప్రభువును మనము హత్తుకొని ఉండాలి. అందుకే బైబిల్ నుండి యోవేలు గ్రంథము 3:17-18వ వచనములలో చూచినట్లయితే, " అన్యులిక మీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును'' అని చదువుచున్నాము. కనుకనే, ఆయనను మనము మన రక్షకునిగాను, దేవునిగాను అంగీకరింవలెను. అవును, నా ప్రియులారా, యేసయ్యను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మీరు కూడా ఈ దీవెనలన్నియు పొందుకుంటారు. మోషే మరియు ఆహరోనులు దేవుని తమ రక్షకునిగా అంగీకరించియున్నారు. అంతమాత్రమే కాదు, దేవుని చిత్తమునకు వారు లోబడియున్నారు. అందును బట్టి, ఐగుప్తీయుల యొక్క బానిసత్వములో నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు.

అందుకే బైబిల్ నుండి యోహాను సువార్త 4:14వ వచనములో చూచినట్లయితే, "నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను'' ప్రకారము ఆయన ఇచ్చు నీళ్లు త్రాగినప్పుడు వారు ఎప్పుడును దప్పిగొనరు అని చెప్పబడియున్నది. మోషే దేవుని యెదుట విధేయత చూపించినట్లుగానే, నా ప్రియులారా, మీరు కూడా దేవునిని గట్టిగా పట్టుకొని ఉండండి, ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. అప్పుడు మీ జీవితములో కూడా ఊరెడు నీటి బుగ్గలు మీలో నుండి ఉబుకుతాయి. ఉంటాయి. కనుకనే, మీ పూర్తి నమ్మకమును ప్రభువు మీద ఉంచినప్పుడు మీరు ఎప్పుడు కూడా కదిలించబడరు. ఇప్పుడే మీరు ప్రార్థించి, ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నిశ్చయముగా, మీరు సీయోను కొండవలె కదలకుండా ఉందురు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నేడు నీవు మా హృదయములను తాకుము. ప్రభువా, నీకు సమీపముగా తీసుకొని రమ్ము. ప్రభువా, మేము ఉన్న బానిసత్వము నుండి మమ్మును ఇప్పుడే నీ రక్తము ద్వారా విడిపించుము. యేసయ్యా, మేము నిన్ను మా స్వంత రక్షుకునిగా అంగీకరించి, మేము విడుదల పొందునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ మహిమార్థమై మమ్మును వాడుకొనుము. ప్రభువైన యేసయ్య, మేము నీయందు సంపూర్ణ నమ్మకముంచునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మేము నిన్ను హత్తుకొని, నీ వాక్యమునకు లోబడుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ లోకంలోని ప్రతి విధమైన బానిసత్వము మరియు బంధకము నుండి మమ్మును విడిపించుము. దేవా, మేము నిన్ను వెదకుచున్న మా హృదయములను తాకి మమ్మును నూతన సృష్టిగా మార్చుము. ప్రభువా, నిన్ను మా స్వంత ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ జీవజలము ఊటలను మా హృదయములోను, జీవితాలలో ప్రవహించి, నీ సన్నిధి, శాంతి మరియు బలముతో వారిని నింపుము. వారి జీవితాలను సీయోను పర్వతము వలె స్థిరముగాను, కదలనివిగాను చేయుము. దేవా, నీ చిత్తానుసారముగా మమ్మును నడిపించుము మరియు నీ మహిమ కొరకు వారిని ఉపయోగించుము. ప్రభువా, నీ ఆశీర్వాదములు మా ద్వారా పొంగిపొర్లి, నీ నామమునకు మహిమను కలుగజేయుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.