నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు బలమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. ప్రభువు నేడు మీతో మాట్లాడి మిమ్మును ఆశీర్వదించును గాక. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 10:9వ వచనము ఇవ్వబడియున్నది. ఆ వచనము, "యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించు ను. కుటిలవర్తనుడు బయలుపడును'' అని చెప్పబడినట్లుగానే, ప్రియ స్నేహితులారా, ఈ లోకములో మనము యథార్థంగా నడుచుకోవాలి. అంతమాత్రమే కాదు, మనము యథార్థతతో ప్రవర్తించాలి మరియు నడుచుకోవాలి. పాతనిబంధన కాలములో అనేకమంది భక్తులు దేవుని మార్గములలో నడిచియున్నారు. వారిలో నోవహు, అబ్రాహాము, యాకోబు, యోసేపు మరియు ఇంకా ఎంతో మంది యథార్ధముగా దేవుని మార్గములో నడిచారు. వారు రాజీకి బదులుగా నీతిని ఎంచుకున్నందువలన, వారి జీవితములు దేవుని విశ్వసనీయతకు సాక్షులుగా నిలిచిపోయినవి.
బైబిల్ నుండి కీర్తనలు 15:2,5వ వచనములలో మనము చూచినట్లయితే, యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే మరియు తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు'' అని చెప్పబడినట్లుగానే, యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించి నడుచుకున్నప్పుడు, నిశ్చయముగా, మీరు ఎన్నటికిని కదల్చబడరు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనము ఏ విధముగా నడుచుకొనుచున్నాము. మన జీవితములో నీతి ఉన్నదా? మనము దేవుని యెదుట ఆయనకు ఇష్టమైన జీవితమును జీవించుచున్నామా? అయితే, బైబిల్ నుండి సామెతలు 20:7వ వచనములో చూచినట్లయితే, " యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీ యొక్క నీతి మరియు యథార్థతను బట్టి, మీ పిల్లలు వారి యొక్క తదనంతరము ధన్యులుగా ఉంటారు. కనుకనే, నా ప్రియులారా, మీ జీవితములో మీరు నడుచు మార్గములు ఏ విధముగా ఉన్నవి? అని ప్రతి విషయములోను, మీ జీవితములో మిమ్మును మీరు పరీక్షించుకొనవలెను. యథార్థమైన జీవితమును మనము జీవించుచున్నామా? మన జీవితములో ఏదైనా అవినీతి ఉన్నదా? అని పరీక్షించుకొనవలెను. అయితే, దేవుని యెదుట మన జీవితములను సరిచేసుకొని, దేవుని యెదుట మిమ్మును మీరు తగ్గించుకొని, ఆయనకు మొఱ్ఱపెట్టండి, "తండ్రీ, నీవలె నడవగలిగే కృపనిమ్ము. నీతిగల జీవితమును మాకు దయచేయుము. నిన్ను ఇష్టపెట్టు జీవితమును మాకు అనుగ్రహించుము' అని ప్రార్థించండి. నిశ్చయముగా, దేవుడు మీరు ఎన్నటికిని కదల్చబడకుండా చేస్తాడు.
అందుకే బైబిల్ నుండి సామెతలు 28:18వ వచనమును చూచినట్లయితే, "యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తనగలవాడు హఠాత్తుగా పడిపోవును'' అని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే, మీరు రక్షింపబడినవారైనట్లయితే, మీరు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవారుగా ఉంటారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 84:11వ వచనములో చూచినట్లయితే, "దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు'' అని చెప్పబడినట్లుగానే, యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. కనుకనే, మీరు మీ జీవితమును పరీక్షించుకొనండి. ప్రభువు యెదుట యథార్థమైన జీవితమును జీవించండి. లేనట్లయితే, మిమ్మును మీరు దేవుని యెదుట తగ్గించుకొనండి. దేవుని యొక్క ప్రశస్తమైన రక్తముతో కడగమని అడిగినట్లయితే, మీరు నూతన వ్యక్తులుగా మార్చబడతారు. అటువంటి నీతిగల జీవితమును జీవించే కృపను ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి జీవితము మీకిచ్చి, దేవుడు మిమ్మును దీవించునట్లుగా ఇప్పుడు ప్రార్థించుకుందాము. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు సన్నిధిలో మీ హృదయమును పరిశీలించుకోవడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం. ఒకవేళ మీ జీవితం ఆయనకు దూరముగా ఉన్నట్లయితే, తగ్గింపుతో ఆయన వైపు తిరిగి, ఆయన అమూల్యమైన రక్తంతో మిమ్మును కడిగి పవిత్రపరచమని కోరినట్లయితే, ఆయన మిమ్మును క్షమించి, మీ జీవితములను పునరుద్ధరించి, మిమ్మును మార్చుటలో ఆయన నమ్మదగినవాడు. నీతిగా నడవడానికి మరియు ఆయన సమృద్ధియైన ఆశీర్వాదములను పొందుటకు ఆయన మీకు గొప్ప కృపను అనుగ్రహించి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యెదుట మమ్మును మేము తగ్గించుకొనుచున్నాము, మా జీవితంలోని ప్రతి భాగమును నీ ప్రేమగల హస్తములకు అప్పగించుకొనుచున్నాము. దేవా, మా హృదయములను పరిశోధించి, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, దానిని మా నుండి ఇప్పుడే తొలగించుము. దేవా, మా హృదయమును చూడుము. ప్రభువా, ఒకవేళ మేము నీతిగల జీవితమును జీవించనట్లయితే, ఇప్పుడే, మేము నీతిగల జీవితమును జీవించుటకు మాకు కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా చెడు మార్గములన్నిటిని మార్చి, క్షమించుము. దేవా, నీ సమృద్ధిగల కృపతో దీవించి, నీతిగల జీవితమును జీవించు కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ ద్వారా మేము జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, మమ్మును తాకి, మా పాపములన్నింటిని క్షమించి, నీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మును కడిగి పవిత్రపరచు. దేవా, మా యొక్క ప్రతిదినం యథార్థత, నీతి, మరియు సత్యంతో నడవడానికి నీ కృపతో మమ్మును నింపుము. ప్రభువా, మా ఆలోచనలు, మాటలు, మరియు క్రియలు నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా మమ్మును నూతన వ్యక్తులనుగా మార్చుము. ప్రభువా, మా యొక్క ప్రతి పరిస్థితిలో మేము నీకు నమ్మకముగాను, నిందారహితులముగాను మరియు విధేయులముగాను ఉండునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, నీ దైవీక కాపుదల క్రింద మేము భద్రంగా నడుచునట్లుగాను, నీ కటాక్షమును మరియు సమృద్ధియైన ఆశీర్వాదములను అనుభవించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితం ఇతరులను నీకు దగ్గర చేయు సాక్షులుగా మార్చబడునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


