నా ప్రియ స్నేహితులారా, నేడు అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 33:17వ వచనమును ఈ రోజు మీ కొరకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను; నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును...'' ప్రకారం దేవుడు మనము ఏదైతే అడుగుతామో దానిని జరిగించు దేవుడుగా ఉన్నాడు. ఆయన మీకు తండ్రియై యున్నాడు. అవును, మనము ఎంత గొప్ప ప్రేమగల ఒక తండ్రిని కలిగియున్నాము కదా! భయపడకండి, మీ పూర్ణ విశ్వాసముతో ఆయనను అడగండి. ఎందుకనగా, ఆయన మీ పట్ల ఉద్దేశమును కలిగియున్నాడు. ఆయన మీ కోసం ఒక మంచి భవిష్యత్తును కలిగియున్నాడు. ఆయన మీకు నిరీక్షణను మరియు సంతోషమును ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుచేతనే, బైబిల్ నుండి యోహాను 14:14వ వచనములో చూచినట్లయితే, "నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అని చెప్పబడినట్లుగానే నేడు మీరు కూడా ఆయన నామమున ఏది అడిగినను, దానిని జరిగిస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు ఆలాగుననే, మీ కొరకు సమస్తమును మేలు కొరకు జరిగిస్తాడు. కారణము, మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానము నమ్మదగినది. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, దేవుడు మీ ప్రార్థనకు జవాబును ఇచ్చినప్పుడు లేక దేవుడు మీ కార్యములను జరిగించినప్పుడు, ఆయన సాధారణమైన ఆశీర్వాదాలను మాత్రమే మీకు ఇవ్వడు, ఆయన మిమ్మును సమస్త ఆత్మీయ ఆశీర్వాదములచేత దీవించును. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:3వ వచనములో చూచినట్లయితే, " మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను'' ప్రకారం సమస్త ఆత్మీయ ఆశీర్వాదములన్నియు కూడా యేసునందు ఉన్నవి. ఆయన తనలో తాను కలిగియున్న ఆశీర్వాదములను తీసుకొని వచ్చి, వాటిని మీ మీద ఉంచనై యున్నాడు. ఈ రోజున అవన్నియు మీలోనికి దిగివస్తాయి. మీ పొరుగువారు పొందిన ఆశీర్వాదముల ప్రకారము కాదు, లేక మీ పితురుల యొక్క ఆశీర్వాదముల ప్రకారం కూడా కాదు. యేసుక్రీస్తు కలిగియున్న ఆశీర్వాదములను మీరు కలిగియుండెదరు. అది ఆయనలో సజీవముగా ఉండి యున్నది. అట్టి ఆశీర్వాదమును మీలోనికి ఇప్పుడే దిగివస్తున్నది. బైబిల్ నుండి రోమీయులకు 8:26వ వచనములో చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, అట్టి ఆశీర్వాదము మీ చెంతకు రావాలంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో నుండి విజ్ఞాపనము చేయును. ఒకవేళ మీరు అనుకోవచ్చును, ఏలాగున ప్రార్థన చేయాలో? ఏమి ప్రార్థన చేయాలో నాకు తెలియలేదు అని చెప్పవచ్చును. అయితే, మీరు ఆత్మలో ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడు మీ ద్వారా మాట్లాడిన ప్రకారము మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మీ ద్వారా మాట్లాడియున్నప్పుడు, మీ నిమిత్తము యేసులో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదము కూడా మీలోనికి ఇప్పడే వచ్చును. ఆ ఆశీర్వాదములు ఆటంకపరచు ప్రతి అపవాది కూడా నేల మీద పడిపోతుంది.
అవును, నా ప్రియులారా, దేవుడు మీ కొరకు సిద్ధపరచిన దానిని ఏ చీకటి శక్తులు కూడా ఆపలేవు. బైబిల్ నుండి రోమీయులకు 16:20వ వచనములో చూచినట్లయితే, "సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక'' ప్రకారం సమాధానకర్తయగు దేవుడు మీకు విరోధముగా లేచు అపవాదిని మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఇంకను ఫిలిప్పీయులకు 2:10వ వచనములో చూచినట్లయితే, "ఆకాశమందున్నవారిలోగాని, భూమిమీదనున్నవారిలోగాని, భూమిక్రిందనున్నవారిలోగాని, ప్రతీ మోకాలు యేసు నామమునందు వంగి, ప్రతీ నాలుక తండ్రియైన దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనవలెను'' అని చెప్పబడిన ప్రకారం మన దేవుడు ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామమున వంగునట్లుగా చేస్తాడు. అంతమాత్రమే కాదు, దూతలు దైవాశీర్వాదములను మీ చెంతకు తీసుకొని వస్తారు. భూమి మీద వాటిని ఎవరైతే, ఆపు చేస్తారో వారు తొలగించివేయబడతారు. భూమిక్రింద అపవాదియైన సాతాను చితుక త్రొక్కించబడుతుంది. నా ప్రియులారా, నేడు మీ కొరకైన యేసులో ఉన్న ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము మీ చెంతకు వచ్చును. యేసు నామమున ఇట్టి ఆశీర్వాదము మీ మీదకు వచ్చునట్లుగా నేను ప్రార్థించుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ప్రార్థనలకు జవాబు ఇస్తావని నీవు ఇచ్చిన వాగ్దానానికై నీకు స్తుతులు చెల్లించుచున్నాము. తండ్రీ, మా కొరకై నీవు ఇప్పటికి సంపాదించిన నీలో ఉంచుకొనియున్న ఆశీర్వాదములను మాకు దయచేయుము. పరిశుద్ధాత్మ దేవా, మాలోనికి నీ యొక్క ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదము దిగివచ్చునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఇట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదము మాకు రాకుండా, ఆపు చేయు ప్రతి ఆటంకమును యేసు నామమున తొలగించివేయుము. ప్రభువా, మేము సమస్తమును సమృద్ధిగా కలిగియుండునట్లుగా కృపను దయచేయుము. దేవా, ఈ రోజు మాకు ఆశీర్వాదకరమైన దినముగా ఉండునట్లుగా యేసు నామమున అడుగుచున్నాము. యేసయ్యా, నీ నామమున ఏది అడిగినను దానిని మాకు ఇస్తావని మేము నమ్ముచున్నాము. కనుకనే దేవా, ఈ రోజు క్రీస్తులో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరించుము. యేసయ్యా, నీ నామంలో మా జీవితములో ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకమును మరియు మా వ్యతిరేకతను ఇప్పుడే మా నుండి తొలగించబడునట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొద్ద మా పట్ల విజ్ఞాపనము చేయుము. దేవా, మా వితంలోనికి పరలోకపు ఆశీర్వాదములను నింపుము. ప్రభువా, ఈ రోజును దేవుని యొక్క ఆశీర్వాదములతో నింపబడు దినంగా మేము అంగీకరించుచున్నాము. యేసయ్యా, నీ యెదుట మా మోకాళ్లు వంగునట్లుగాను అటువంటి కృపను దయచేయుము. యేసయ్యా, మా పక్షమున విజ్ఞాపనము చేయుటకు నీ పరిశుద్ధాత్మను మాలోనికి పంపించి, మేము ఉచ్చరింపశక్యముకానీ, మూలుగులతో చేయు ప్రార్థనను నీవు ఆలకించి, మాకు జవాబును దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.