నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:16వ వచనము మన కొరకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును'' అని సెలవియ్యబడినట్లుగానే, దేవుని దృష్టి మరియు మనస్సు నిత్యము మన మీద ఉండునని తెలియజేయుచున్నది. ఇది ఎంతటి గొప్ప జీవితమై ఉంటుంది కదా! ప్రభువు దృష్టిని మరియు ఆయన మనస్సు ఎల్లప్పుడు మన మీద ఉండడము ఎంత గొప్ప ధన్యమైనది కదా! ఆయన ఎల్లవేళల మనలను చూస్తుండడము మరియు గమనించడము మనము ఎంత గొప్ప ధన్యకరమైన ప్రజలముగా ఉన్నాము కదా! అందుకే బైబిల్ నుండి హబక్కూకు 2:20వ వచనములో చూచినట్లయితే, "అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయ్యకండి. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో ప్రభువు సన్నిధానమును ఎల్లవేళల కనుగొంటున్నారా? ఒకసారి మీ జీవితమును పరీక్షించుకొని చూడండి. ఒకవేళ, మీరు ఎల్లవేళల, కొట్లాడుతూ, తప్పు విషయాలను జరిగించుచున్నారా? అయితే, ప్రభువు అక్కడ మీతో కూడా ఉండడు మరియు మీలో నివసింపడు. కనుకనే, నేటి నుండి ప్రభువు యెదుటను మరియు ఆయనకు ప్రీతికరమైన జీవితమును జీవించడానికి ప్రయత్నించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీలో వచ్చి నివసిస్తాడు.

ఇంకను నా ప్రియులారా, ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి మరియు మీ కొరకు సిలువలో చిందించబడిన ప్రశస్తమైన రక్తముతో మిమ్మును శుద్ధీపరచమని ఆయనను అడగండి. అదియుగాక, ప్రభువు ఎటువంటి జీవితమును నేడు మీకు అనుగ్రహిస్తాడు? అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 6:16వ వచనములో చూచినట్లయితే, "దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని ఆలమై యున్నారు. ఇంకను 1 కొరింథీయులకు 3:16వ వచనములో కూడా అదే చెప్పబడియున్నది, "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు'' అని స్పష్టముగా తెలియజేయబడుచున్నది. కనుకనే, నా ప్రియులారా, దేవుని ఎల్లప్పుడు మీతోనూ, మీలోనూ ఉంటే లేక ఆయనను మీరు కలిగియున్నప్పుడు, ఈ లోకములో మహిమాన్వితమైన జీవితమును మీరు కలిగియుంటారు. హల్లెలూయా!

ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 65:4వ వచనములో చూచినట్లయితే, " నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తి పొందెదము'' అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 92:13వ వచనములో చూచినట్లయితే, "యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు'' అని చెప్పబడియున్నట్లుగానే, మనము దేవుని మందిరములో నాటబడినవారముగా ఉండాలి. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, యేసయ్య మీతో ఉండి, మీరు యేసుతో సంబంధము కలిగియున్నప్పుడు, అది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితముగా ఉంటుంది కదా. ఆలాగుననే, ప్రియులారా, మీరు దేవుని సంతోషముతోను మరియు సమాధానముతో నింపబడతారు. క్రీస్తులో ఇటువంటి ప్రశస్తమైన జీవితమును ఇవ్వమని అడుగుదాము. అదేవిధముగా, మీరు దేవునిలో వర్థిల్లుటకును మరియు ఆయన మీలో నివసించాలంటే, మీరు పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు మిమ్మును మీరు ఆయన హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము నుండి మీలో వచ్చి, నివసిస్తూ, మిమ్మును వర్థిల్లజేయును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మాలో నివసించ డానికి మమ్మును ఎన్నుకున్నందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా జీవితం లో నీ సన్నిధి ఉంచినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ యొక్క అమూల్యమైన రక్తంతో మా హృదయములను కడిగి మమ్మును శుద్ధి చేయుము. దేవా, నీకు ఆయాసకరమైన కార్యములు మాలో ఉన్నట్లయితే, ఇప్పుడే మా నుండి ప్రతిదానిని తొలగించుము. ప్రభువా, మమ్మును నీ యొక్క పరిశుద్ధమైన ఆలయంగా మార్చుము. దేవా, నీవు మాలో నివసించునట్లుగా మేము నిన్ను మాలోనికి ఆహ్వానించుచున్నాము. ప్రభువా, నీ ఆత్మ ఎల్లప్పుడు మాలో నివసించి, సంచరించునట్లుగా చేసి, నీ మహిమ కొరకు మేము వాడబడునట్లుగా చేయుము. తండ్రీ, మేము ప్రతిదినం నిన్ను ఘనపరచు జీవితమును గడుపుటకు మాకు సహాయం చేయుము. దేవా, మేము ఎల్లవేళలా నీతో సహవాసము కలిగియుండునట్లుగా చేసి, మేము నీ మందిరములో వర్థిల్లునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో మేము నింపబడి, ఆనందకరమైన జీవితమును జీవించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.