నా ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎక్కడ నివసించును? అని మనము చూచినట్లయితే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 91:1వ వచనము ఇలాగున సెలవిచ్చుచున్నది: "మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయనే మహోన్నతుడు, ఆయన ఉన్నత స్థలములలో నివసించుచున్నా డు. అందుకే బైబిల్ నుండి యోబు 25:2వ వచనములో చూచినట్లయితే, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఉన్నత స్థలములలో సమాధానమును స్థిరపరుస్తాడు. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రభువైన యేసు ఒకసారి, మా నాన్నగారిని అటువంటి ఉన్నత స్థలములకు తీసుకు వెళ్లియున్నాడు. అవును, అందుకే బైబిల్‌లో యేసు, "నేనే ద్వారము, నేనే మార్గమని'' అని ఆయన సెలవిచ్చుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నాడు; తాను చిందించిన రక్తము ద్వారా, మనము సర్వశక్తిమంతుడైన దేవుని కనుగొని ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి మార్గమును ఏర్పరచియున్నాడు. అవును, మన పాపములు తొలగించబడడానికి మరియు మనము పవిత్రులుగా మార్చబడుటకు యేసు మన కొరకు తన రక్తమును చిందించియున్నాడు. యేసు రక్తముతో మనము కడగబడినప్పుడు, మనము ఆయన బిడ్డలుగా మార్చబడుచున్నాము. తద్వారా, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకు మనకు మార్గము తెరవబడుతుంది.

అవును, ఈ యేసు ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక కన్యక గర్భములో తన బీజమును ఉంచియున్నాడు. తద్వారా, ఆయన మానవునిగా ఈ లోకమునకు దిగివచ్చియున్నాడు. ఆయన ఇంకను మానవ రూపమును ధరించియుండెను. యేసుక్రీస్తు మరియు సర్వశక్తిమంతుడును తండ్రియైన దేవుడును ఏకమైయున్నారు. ఆయన కన్యక గర్భములో మానవుని స్వరూపమును ధరించి, ఈ లోకములోనికి వచ్చెను. గనుక, ఆయన మానవ స్వరూపమును కలిగియున్నాడు. అదే సమయంలో, ఆయన సర్వశక్తిమంతుడైన దేవునిగా ఆత్మ స్వరూపమును ధరించియున్నాడు. యేసు మానవుని పోలికను కలిగియున్నాడు గనుకనే, ఆయన ద్వారా ఆత్మ స్వరూపియైన సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించడానికి మార్గము తెరవబడియున్నది.

ఏ స్థలములో సర్వశక్తిమంతుడైన దేవుడు నివసించును? ఆయన ఏకైక స్థలములో నివసించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 68:33వ వచనములో చూచినట్లయితే, " అనాదిగానున్న ఆకాశాకాశ వాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము'' అని చెప్పబడినట్లుగానే, ఆయన అత్యున్నత ఆకాశము మీద ఎక్కువాడు అని సెలవియ్యబడియున్నది. అవును, నా తండ్రి ఆ స్థలమును ఒక మహిమగల స్థలముగా చూచియున్నారు. అది సమాధానముతో నింపబడిన ఒక ఏకైక స్థలం. అక్కడి నుండి సమాధానము స్థాపించబడి, ఈ భూమి మీదికి దిగివచ్చుచున్నది. ఆయన విశ్వమంతటిని సమాధానముతో ఏలుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యోబు 25:2వ వచనములో చూచినట్లయితే, "అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై యున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఉన్నతమైన పరలోక స్థలములో సమాధానమును నెలకొనుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 85:8వ వచనములో కూడా మనము దీనిని గురించి చదువుతాము, "దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక '' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఉన్నత స్థలములో నుండి తన పరిశుద్ధులకు శుభవచనమును ప్రకటించుచున్నాడు.

తదుపరి, నా ప్రియులారా, అక్కడ ఆయన సింహాసనము స్థిరపరచబడియున్నది. ఆయన ఆ సింహాసనము మీద ఆసీనుడైయున్నాడు. దీనిని గురించి మనము బైబిల్ నుండి యెహెజ్కేలు 1:26-28వ వచనములలో చదవగలము, "వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనమువంటిదొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మానవునిగా తన స్వంత స్వరూపములో సృష్టించబడియున్నాడని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. కాబట్టి, ఆయన ఆత్మగా ఉన్నప్పటికిని, ఆయన మానవ స్వరూపమును కలిగియున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి యెహెజ్కేలు 1:28వ వచనములో, "వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సు యొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను'' అని చెప్పబడియున్నది. అక్కడ మహిమతో కూడిన ఒక దృశ్యం కనిపించినది. దీనిని గురించి మనము బైబిల్ నుండి ప్రకటన 4:2-11వ వచనములలో కూడా చదివినట్లయితే, 'అటుతరువాత, ఆయన మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడుగా ఉన్నాడని' చెప్పబడియున్నది. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 104:1-2 వ వచనముల ప్రకారం, ఆయన మహిమ మరియు ప్రభావములను వస్త్రముగా ధరించుకొని, కాంతిని వస్త్రమువలె తన చుట్టూ కప్పుకొని ఉన్నాడు. బైబిల్ నుండి యెహెజ్కేలు 1:28వ వచనము ప్రకారం, ఆయన స్వరము ఉరుము శబ్దమువలె ఉండియున్నది.

అందుకే బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 29:3-4వ వచనములలో చూచినట్లయితే, " యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది; మహిమగల దేవుడు ఉరుముచున్నాడు. ఆయన స్వరము శక్తివంతమైనది'' అని చెప్పబడినట్లుగానే, మన దేవుడు మహిమగలవాడుగా ఉన్నాడు. ఇంకను, కీర్తనల గ్రంథము 46:6వ వచనములో చూచినట్లయితే, "జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన సింహాసనము నుండి అటువంటి శక్తివంతమైన, భయంకరమైన స్వరము వినబడుతుంది. కనుకనే, అటువంటి స్థలమునకు నా తండ్రి కొనిపోబడ్డారు. అప్పుడు, నా తండ్రి ఆయనను చూసినప్పుడు, "నీకు ఏమి కావాలి?'' అని అడిగియున్నాడు. ఆ స్వరము వెయ్యిరెట్ల్లు ప్రతిధ్వనించినది; అది వెయ్యి స్వరములవలె మార్చబడినది. అది ఎంత శక్తివంతముగానూ, భయంకరముగానూ ఉందంటే, తన శరీరంలోని ఎముకలన్ని విరువబడినట్లుగా మా నాన్నగారికి అనిపించినది. ఆ స్వరము బూర ధ్వనివలె ఉంటుందని బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 4:1వ వచనములో చూచినట్లయితే, "ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను '' అని చెప్పబడినది. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి సంఖ్యాకాండము 7:89వ వచనములో కూడా మనము ఇదే భాగమును చదవగలము.

అవును, నా ప్రియులారా, ఆ స్వరము ఏమి చెబుతుంది? బైబిల్ నుండి మత్తయి 3:17వ వచనములో చూచినట్లయితే, యేసుకు ప్రత్యక్షమైనప్పుడు, " మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను '' అని పరలోకం నుండి ఒక స్వరము వినబడెను. నా ప్రియ స్నేహితులారా, నేడు మీ విషయంలో కూడా ఆ స్వరము అదే చెబుతుంది. పరలోకం నుండి వచ్చే ఆ స్వరం, " ఉరుమువలె, బూర ధ్వనివలె, ప్రతిధ్వనించే భీకరమైన స్వరమువలె, భూమిని కంపించునట్లుగా ఒక స్వరము వలె ఇలా ప్రకటించుచున్నది, "ఈమె నా ప్రియ కుమార్తె; ఇతడు నా ప్రియ కుమారుడు.'' కనుకనే, నా ప్రియులారా, నేడు మీకు ఇంతకంటే ఏమి కావలెను? అందుకే ఆయన సింహాసనంపై ఆసీనుడైయున్నాడు.

అవును, నా ప్రియులారా, ఆయన తన సింహాసనము నుండి నా తండ్రిని ఇలా అడిగారు: " నీకు ఏమి కావలెను? నీవు నాకు ఎంతో ప్రియమైనవానివి, కనుకనే, నీవు అడుగుము, నేను నీకు అనుగ్రహిస్తాను' అని సెలవిచ్చినప్పుడు, నా తండ్రి ఆయన యొక్క ఆత్మీయ వరములను కోరుకున్నారు. కానీ, మరల ప్రభువు ఇలాగున చెప్పాడు: " నేను నీకు నా వరములను మాత్రమే కాదు, నన్ను నేను నీకు ఇచ్చుచున్నాను'' అని సెలవిచ్చియున్నాడు. అందుకే మా నాన్నగారు తాను జీవించిన కాలమంతా ప్రభువును తనతో కూడా ఉంచుకున్నాడు. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు మాట్లాడినా దేవుని సన్నిధి ప్రజలను నింపుచుండెను. ప్రజలు వారి జీవితము ద్వారా యేసును చూచియున్నారు. అవును, నా ప్రియులారా, ప్రభువు మీకు కూడా అటువంటి కృపనే అనుగ్రహించుచున్నాడు. సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే మీ దేవుడు, ఆయన మీకు కూడా సహాయం చేసి, మిమ్మును ఉన్నత స్థలములకు ఎక్కించి, ఆయన మీలో నివసించు కృపను మీకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ కుమారుడైన యేసు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నీ సన్నిధిలోనికి ప్రవేశించడానికి మాకు మార్గం కల్పించినందుకు నీకు వందనములు. యేసయ్యా, నీవు మమ్మును నీ రక్తము ద్వారా కడిగి, పవిత్రులనుగా చేసి, నీ నీడలో నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయములను నీ యొక్క సమాధానముతోను మరియు నీ మహిమతోను నింపుము. యేసయ్యా, ఉన్నత సింహాసనముపై ఆసీనుడవై ఉంటూ, సమస్తమును ఏలుచున్న మా సర్వశక్తిమంతుడైన దేవుడవని మేము ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మేము నీ ప్రియ బిడ్డలుగా ఉన్నామని ప్రకటించుటకును మరియు నీ యొక్క శక్తివంతమైన స్వరము ద్వారా మా జీవితములపై నీ ప్రేమను, హామిని పలుకబడునట్లుగా చేయుము. దేవా, మేము వెళ్లు ప్రతిచోట నీ సన్నిధిని మోసుకొని వెళ్లు కృపను మాకు దయచేసి, తద్వారా ఇతరులు మా జీవితముల ద్వారా యేసును చూడగలుగునట్లుగా సహాయము చేయుము. దేవా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించి, నీ దైవీకమైన సమకూర్పును మరియు సహాయమును పొందుకొనునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.