నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు వాగ్దానంగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 33:12 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును'' ప్రకారం అవును, మీరు దేవునికి ప్రియమైనవారు. మీరు యేసు రక్తంతో కడుగబడియున్నారు, ఆయన చేసిన బలియాగము ద్వారా మీరు విలువపెట్టి కొనబడియున్నారు, మీ పాపాల క్షమాపణ కొరకు ఆయన మిమ్మును తన బిడ్డలనుగా చేసుకోవడానికి తన ప్రాణమును అర్పించి, తన రక్తమును చిందించాడు. కాబట్టి, మీరు ఆయన చేత ఎన్నుకొనబడియున్నారు, రూపాంతరపరచబడియున్నారు మరియు ఆయన స్వంత బిడ్డలనుగా మిమ్మును మార్చుకున్నాడు. యేసు పరలోకం నుండి దర్శనం పొందిన ప్రతిసారీ, దేవుని స్వరం ఉరుములుగా వినిపించింది: అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; "ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడి'' మరియు మరల "ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను'' ప్రకారం మనము ఆయనకు ప్రియ బిడ్డలముగా ఉన్నాము.

నా ప్రియులారా, ఇప్పుడు, దేవుడు మిమ్మును గురించి కూడా ఆలాగుననే చెబుతున్నాడు, " మీరు ఆయనకు ప్రియమైనవారు!'' కనుకనే, మీరు దేవునిచేత ఎన్నుకోబడ్డారు. యేసు తన రక్తం ద్వారా మిమ్మును క్రయధనముగా కొనియున్నాడు. తద్వారా మీరు, పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఆయన ఆలయంగా రూపాంతరం చెందియున్నారు. ఆయన ప్రియమైనవారిగా, మీరు ఆయనలో సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటారు కనుకనే, యెషయా 32:18వ వచనములో మనము చూచినట్లయితే, " నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు '' ప్రకారం ఆయన సమాధానము మీకు లభిస్తుంది. నా ప్రియులారా, మీరు దైవీకమైన భద్రతతోను మరియు కాపుదలతోను చుట్టుముట్టబడియున్నారు. ఎందుకనగా, దేవుడే మీకు బలమైన కోటగా ఉన్నాడు. మరియు 1 కొరింథీయులకు 10:4వ వచనములో బైబిలు ఇలాగున చెబుతుంది, " అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే'' ప్రకారం మీరు క్రీస్తు అను బండ మీద కట్టబడియున్నారు, కాబట్టి, మీరు ఎన్నటికిని కదిలించబడరు. ఎందుకంటే, మీరు బండపై స్థిరపరచబడియున్నారు మరియు ఆయన బలమైన కోట చుట్టూ ఉన్నాడు. మీరు ఎల్లప్పుడూ దేవుని సంరక్షణలో సురక్షితముగా నివసిస్తారు. ఎందుకంటే, ఆయన రోజంతయు మిమ్మల్ని కాపాడుతాడు గనుకనే, మీరు ఆయనలో భద్రంగా ఉంటారు.

నా ప్రియులారా, కొందరు అడుగుతారు, 'అపవాది మాపై దాడి చేయగలదా?' అవును, అపవాది కూడా శక్తి కలిగి ఉంటాడు. కానీ దేవుడు దానిని అనుమతించినట్లయితే, తప్ప, అది మిమ్మును ఏమి చేయలేదు. అయినప్పటికి, దేవుడు మిమ్మును విశ్వాసం అనే డాలుతో ఆయత్తపరుస్తాడు మరియు దానిని ఎదిరించడానికి మీకు కృపను అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్‌లో ఈలాగున హామీ ఇస్తుంది, "కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' ప్రకారం ఈ లోక చింతలకుగాని మరియు అపవాదికిగాని లోబడక దేవునికే లోబడియుండుడి; అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోవును. అయినను మిమ్మును ప్రేమించిన యేసు ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నారు. మరియు యేసు ఇలాగున అంటున్నాడు, " నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు...'' కాబట్టి భయపడకండి. అపవాది జయించే శక్తి మీకు యేసులో కలదు. కాబట్టి, విశ్వాసంతో మీరు ఇలాగున చెప్పండి, "ప్రభువా, మేము నీకు ప్రియమైనవారము. మా పట్ల నీకున్న ప్రేమకు వందనాలు. నీవు మమ్మును నీలో భద్రంగా ఉంచుతావు. పాపాన్ని లేదా అపవాది శోధనలను మమ్మును జయించడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. అపవాది లేదా దుష్టులు మా మీద దాడి చేసినప్పుడు, నీవు మమ్మును విశ్వాసమనే కేడెముతో కాపాడుతావు. అపవాదిని ఎదిరించడానికి నీవు బలవంతులను చేస్తావు. మరియు మేము యేసు ద్వారా అయినను మమ్మును ప్రేమించినవాని ద్వారా మేము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ప్రభువా, నీకు వందనాలు' అని ఇప్పుడే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన తండ్రీ, మమ్మును నీ యొక్క ప్రియమైనవారమని అని పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీవు మమ్మును యేసు రక్తంతో కడిగి నీ సొంత బిడ్డలుగా చేసుకున్నావు నీకు వందనాలు. యేసయ్యా, మమ్మును ప్రతిరోజు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ సమాధానముతో మమ్మును సుఖకరమైన నివాసములలో మేము సురక్షితముగా ఉండునట్లుగాను, మమ్మును భద్రపరచుము. దేవా, మమ్మును నీ రక్షణలో విశ్రాంతి తీసుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము, నీ చేతులలో సురక్షితంగా ఉండునట్లుగా మాకు నీ యొక్క కాపుదలను దయచేయుము. యేసయ్య, నీవు మాకు బండగా మరియు మా బలమైన కోటగా ఉండి, మా మీద శత్రువు దాడి చేసినప్పుడు, నీ విశ్వాస కవచాన్ని పైకి లేపుము. దేవా, మేము నీకు మాత్రమే లోబడటానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, అపవాదిని ఎదిరించడానికి మరియు స్థిరంగా నిలబడటానికి మాకు బలాన్ని దయచేయుము. ప్రభువా, క్రీస్తు యేసు ద్వారా అపవాది నుండి మమ్మును అన్నిటికంటె అత్యధికముగా విజయము పొందునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నిన్ను మా పూర్ణ హృదయముతో విశ్వసించునట్లుగాను, మేము నీ ప్రేమలో సురక్షితంగా నిలిచి ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.