నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు. ఆ వాగ్దానము బైబిల్ నుండి లేవీయకాండము 20:26వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము, "మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని'' అని చెప్పబడిన ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండాలని మన పట్ల ప్రభువు కోరుచున్నాడు. చూడండి, ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దాన వచనము కదా! ఒకవేళ, ఈ లోకములో మీరు పాప పూరితమైన జీవితమును జీవించుచున్నారేమో? పాపపు అలవాట్లతోటి మీరు నిండుకొనియున్నారేమో? 'ఇది చేయి, అది చేయి,' అని తప్పులు చేయమని అపవాది మిమ్మును ప్రోత్సహించుచున్నదేమో? అయితే, ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, 'నా కుమారుడా, కుమార్తె, మీరు నావలె పరిశుద్ధులుగా ఉండాలి' అని అంటున్నాడు. కనుకనే, మీరు కూడా పరిశుద్ధులుగా మారుటకు, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా మీరు పరిశుద్ధపరచబడతారు.

నా ప్రియులారా, ఇంతటి ధన్యకరమైన జీవితమును ఎలా కలిగియుండగలము? అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:13-22వ వచనములను మనము చదివినట్లయితే, "అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు; కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు మరియు ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు'' అని వ్రాయబడినది. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, నేడు మీరు ఎటువంటి జీవితమును కలిగియున్నారు? అని ఒకసారి మిమ్మును మీరు పరీక్షించుకొనండి. ప్రశాంతమైన జీవితమును కలిగియున్నారా? దేవుని శక్తితో మరియు ఆయన సన్నిధితో నింపబడియున్నారా? లేక ఎల్లప్పుడు మీ జీవితములో కలిగియున్నటువంటి చెడుకార్యముల వలన మీ హృదయములో అశాంతితో నింపబడియున్నారా? అయితే, ఈ రోజు మీకు నూతన జీవితమును ఇవ్వడానికి యేసయ్య ఈ లోకమునకు మీ కొరకు వచ్చియున్నాడు. మన నిమిత్తము ఆయన తన ప్రాణమును సిలువలో పెట్టియున్నాడు. కనుకనే, యేసయ్య రక్తము మన పాపములన్నిటిని నుండి మనలను పరిశుద్ధులనుగా మార్చగలదు. కనుకనే, చింతించకండి.

బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో చూచినట్లయితే, సౌలును అనబడే వ్యక్తిని ఒక గొప్ప దైవజనుడైన పౌలుగా దేవుడు మార్చియున్నాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 9:23వ వచనములో చూచినట్లయితే, 'అతడు ఉగ్రత పాత్రయై యున్నాడని' మనము చదువుచున్నాము. దేవుడు తన మహా కృపను బట్టి, 'అతనిని కరుణా పాత్రగా మార్చియున్నాడు.' కనుకనే, తద్వారా, బైబిల్ గ్రంథములో అతని యొక్క రచనలన్నిటిని చూడండి, ప్రతిరోజు చదవండి. ఆ తర్వాత అతడు గొప్ప జీవితమును కలిగియున్నాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఇప్పుడే అటువంటి ధన్యకరమైన జీవితమును పొందుకొనగలరు. మీరు ఇంకా యేసయ్యను మీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే, ఇప్పుడే మీ జీవితమును ఆయనకు సమర్పించుకొనండి. సౌలు, పౌలుగా మార్చబడిన రీతిగానే, మీ జీవితములో కూడా మీరు మార్పు నొందుతారు. అపవాది మార్గములను వెంబడించకండి. యేసుక్రీస్తు మార్గములను వెంబడించండి. కనుకనే, ఇప్పుడు మనము ప్రార్ధించుకుందాము. పూర్తిగా మీ జీవితమును యేసుకు సమర్పించండి. ప్రభువుకు మొరపెట్టండి, సిలువ వైపు చూడండి. 'దేవా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, మా అవసరతలను తీర్చుము, నీ బిడ్డలనుగా మమ్మును మార్చి, నీ మహిమార్థమై మేము నీ కొరకు ప్రకాశించునట్లుగా చేయుము' అని మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా, ఇటువంటి గొప్ప ధన్యతను మీరు పొందుకుంటారు. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదమును పొందండి.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము ఈ రోజు ఉన్న పక్షముగా నీ సన్నిధికి వచ్చుచున్నాము. యేసయ్య, నీ రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మమ్మును కడిగి శుభ్రపరచుము. దేవా, మా హృదయం నుండి ప్రతి తప్పుడు కోరికను మాలో నుండి తీసివేసి, నీలాగే మమ్మును పరిశుద్ధులనుగా మార్చుము. ప్రభువా, మా జీవితాన్ని నూతనపరచి, మమ్మును నీ సొత్తుగా మార్చుము. దేవా, ఇకపై మేము అంధకార మార్గములను అనుసరింపకుండా, దయచేసి నీ సన్నిధితోను, శాంతితోను మరియు శక్తితోను మమ్మును నింపుము. దేవా, నీ మహిమ కొరకు మమ్మును కరుణా పాత్రగా మార్చుము. ప్రభువా, మా జీవితమంతటిని నీ ప్రేమగల చేతులకు అప్పగించుకొనుచున్నాము. తండ్రీ, నీవు మా మీద నీ దృష్టిని ఉంచి, మాకు నూతనమైన, పరిశుద్ధమైన జీవితమును దయచేయుము. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిచేతను మరియు నీ రక్తముతో కడగబడిన జీవితమును ఇప్పుడే మాకు దయచేయుము. యేసయ్యా, నీ ప్రాణమును మా కొరకు సిలువలో బలిగా ఇచ్చావు, కనుకనే, నీవు కార్చిన రక్తముతో మమ్మును కడుగుము. ప్రభువా, మా పాపములను క్షమించి, మాకు నూతన జీవితమును అనుగ్రహించి, మేము నూతనమైనవారిగా మార్చబడునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, మా అవసరతను తీర్చి, నీ బిడ్డలనుగా మమ్మును మార్చి, నీ మహిమార్థమై మేము నీ కొరకు ప్రకాశించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.