నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన హస్తముతో దిశానిర్దేశము చేసి మనలను నడిపించుచున్నప్పుడు, అది ఎంతో మనకు ఆహ్లాదకరముగాను మరియు ఆనందముగాను ఉంటుంది. తద్వారా, ఆయనలో మనకు ఎంతో భద్రత కలిగియున్నట్లుగా అనిపించుచున్నది. ఇంకను, ఎంతగానో ప్రియమైన అనుభూతిని కలుగుతుంది. ఈ రోజు వాగ్దాన వచనము ద్వారా ఈ రీతిగా మనకు జరిగించుటకు ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 22:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును'' అని చెప్పబడినట్లుగానే, మనము రాజుకు స్నేహితులుగా ఉండాలంటే, దయగల మాటలు పలకాలని మన ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఇది చాలా విభిన్నమైన ప్రత్యేకమైన వచనము. దయగల మాటలు పలుకువారు స్వయముగా రాజునే తన యొక్క స్నేహితునిగా కలిగియుంటారని వ్రాయబడియున్నది. ఎవరండి, రాజును స్నేహితునిగా కలిగియుండువారు? అని చూచినట్లయితే, ఈ వచనములో, మనము మాట్లాడు విధానము మరియు ఒక వ్యక్తి నుండి బయలు వెడలి వచ్చు మాటలు, మన యొక్క ప్రవర్తన విధానమును గురించి మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది.

ఈ వచనము మనకు రెండు సంగతులను తెలియజేయుచున్నవి. మొట్టమొదటిగా, హృదయ శుద్ధిని ప్రేమించువాడు. మనమందరము కూడా అటువంటి పవిత్రమైన, నిర్దోషమైన హృదయమును కలిగియుండాలని కోరుకుంటాము కదా! అనేక ఫర్యాయములు ఈ లోకము చేత మాలిన్యమునకు గురియవుతాము. ఈ లోకాశలు మన యొక్క ఉద్దేశములు మరియు మన తలంపులను చాలా చెడుగా మారుస్తుంటాయి. మన ఆలోచన విధానములు వెడలిపోయినట్లుగా ఉంటాయి. కానీ, దేవుడు మన హృదయమును రూపాంతరపరచి, దానిని పవిత్రముగాను మరియు నిర్దోషముగాను చేయుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజున అందుకొరకై అడగండి. ఎవరైతే, పవిత్ర హృదయమును కలిగియుంటారో, వారు ఈ రెండవ కార్యమును కూడా చేయుదురు.

రెండవదిగా, దయగల మాటలు పలుకువారుగా ఉంటారు. విషపూరితమైన మాటలు కాదు, లేక ప్రజల హృదయాలను భయకంపితులనుగా చేయువారు పలుకు మాటలుగా వారు ఉండరు. ప్రేమ కలిగిన మాటలను పలుకువారుగా వారు ఉంటారు. పవిత్రమైన దేవుని హృదయము నుండి ఎంతో నిమ్మళముగా, ఎంతో ప్రేమగలిగి, ఎంతో పవిత్రముగా వారు ఉంటారు. ఆలాగే, వారు దేవుని కార్యములను మాట్లాడుచుంటారు. మనము ఈ లోకములో మంచి వ్యక్తులుగా ఉండవచ్చును. కానీ, ఒక మంచి వ్యక్తిగా ఉంటూ, దేవుని కార్యములను గూర్చి గనుక మీరు పలుకుతూ ఉన్నవారిగా ఉన్నట్లయితే, మీరు ఇతర వ్యక్తులకు ఆకర్షణీయమైనవారుగా ఉండెదరు. రాజు తన స్నేహితునిగా ప్రేమించు నిమిత్తమే, మీరు రాజునకు కూడా ఆకర్షణీయమైనవారినిగా ఉండెదరని ఈ వచనము చెబుతుంది. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

ఇటీవల కాలములో, నేను ఒక కూటమునకు వెళ్లడము జరిగింది. ఆ కూటము అనంతరము నేను సుదీర్ఘకాలమున ఆ ప్రాంతమునకు వెళ్లనందువలన, ఆ ప్రాంతములో ఉన్నవారందరు గుంపులుగా నా యొద్దకు వచ్చియున్నారు. వారు నాతో కలుసుకోవాలనియు, నాతో కలిసి ఫోటోలు తీసుకోవాలన్న భావముతో అక్కడికి చేరి వచ్చియున్నారు. కానీ, ఆ ప్రజలందరి మధ్యలో కూడా ఇద్దరి బిడ్డల మీద నా దృష్టిని ఆకర్షింపబడియుండెను. ఎందుకంటే, వారు అంత చక్కటి నవ్వుతో అక్కడికి వచ్చియున్నారు. వారు నన్ను చూచి, 'అన్నా! మీరు ఎలాగున ఉన్నారు?' అని వారు నన్ను అడిగారు. ఇంకను, 'అన్నా! దేవుడు మా యొక్క విద్యలో తన జ్ఞానముతో మమ్మును నింపాలని మీ ప్రార్థనను మేము కోరుకుంటున్నామని చెప్పారు.' యేసు కొరకు వారి హృదయములో కలిగియున్న పవిత్రత, అమాయకత్వము చాలా విభిన్నముగా ఉన్నట్లుగా నాకు అనిపించినది. ఆ ప్రజలందరిలో, నాకైతే, వీరే విభిన్నమైన ప్రత్యేకమైన వారుగా ఉన్నారని అనిపిందినది. నేను వారితో స్నేహమును కలిగియుండాలని నేను కోరుకొనునట్లుగా నన్ను చేసినది. నా ప్రియులారా, ఈ లక్షణము, మనలను ప్రజల యెదుట ఆకర్షణీయముగా చేయుచున్నది. దేవుని హృదయమును మరియు దేవుని మాటలను, దేవుని గుణ లక్షణములను కలిగియుండునట్లుగా చేయుచున్నది. ప్రజలందరి మధ్యలో కూడా ఇది మనలను ప్రత్యేకమైన వ్యక్తులనుగా చేయుచున్నది. నాకు తెలుసు, ఆ యొక్క చిన్న బిడ్డలు, దేవుని చేతిలో అత్యంత బలీయమైన వారుగా ఉండబోవుచున్నారు అనియు. వారి హృదయమంతయు యేసు కొరకైన ప్రేమచేత నింపబడియున్నదని నేను గుర్తించాను. చూడండి, ఇది ఎంతటి గొప్ప ధన్యత కదా!

నా ప్రియులారా, నేడు మనము కూడా అటువంటి పవిత్రమైన హృదయము కొరకు దేవుని అడుగుదామా? అటువంటి దయగల మాటలు పలకాలని ఆయనను కోరుకుందామా? దేవుని హృదయము నుండి బయలు వెడలి వచ్చు మాటలు, ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికిని, మన భాషలను మరియు మన మాటలను మార్చివేయమని దేవుని అడుగుదామా? పరిశుద్ధమైన హృదయం, దయగల మాటలు ఏమి చేయగలవో ఇది మనకు చూపించును. అవి దేవుని స్వభావమును ప్రతిబింబించునట్లుగా చేయుచున్నవి. కాబట్టి, ఇతరులకు మనలను ఆకర్షణీయంగా చేయుచున్నవి. దానియేలు రాజుల దృష్టిలో దయను పొందుకున్నట్లుగానే, దేవుని హృదయం, ఆయన మాటలు మన ద్వారా ప్రవహించినప్పుడు ఆయన ప్రజల ఎదుట మనకు దయను ఇవ్వగలడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, మన హృదయములను పవిత్రపరచి, మన మాటలను మార్చమని దేవుని వేడుకుందాము. మన మాటలు కృప, దయ, జ్ఞానం మరియు ప్రేమతో నిండియుండును గాక. మన హృదయాలలో మరియు సంభాషణలలో క్రీస్తును ప్రతిబింబించినప్పుడు, దేవుడు దయ ద్వారములను తెరచి, తన మహిమ కొరకు మనలను స్థిరపరచి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దయగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవు ఈ రోజున మాతో మాట్లాడిన రీతిగా, పవిత్రమైన హృదయమును కలిగి ఉండడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయములో ఉన్న అతిక్రమములన్నిటిని మరియు దుష్టత్వమంతటిని మా నుండి తొలగించివేయుము. ప్రభువా, మాలో ఉన్న దుష్ట ఉద్దేశములు, దుష్ట ఆశలు, అట్టివి మా హృదయాలను విడిచిపోవాలని ఆజ్ఞాపించుము. దేవా, పై చెప్పబడిన అట్టివాటి నుండి మేము ఇప్పుడే విడుదల పొందునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మచేత మేము సంపూర్ణముగా నింపబడునట్లుగాను, అందులో నుండి పరిశుద్ధమైన మాటలను మాట్లాడునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, జ్ఞాన వాక్కులు మరియు ప్రేమగల వాక్కులు, కృపసహితమైన దయగల మాటలు మేము మాట్లాడునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, కృప మరియు జ్ఞానంతో కూడిన మాటలు పలకడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితములు నీ ప్రేమను ప్రతిబింబించునట్లుగా చేసి, ప్రజల ముందు మాకు దయను కలిగించునట్లుగా మేము నీ స్వభావంలో నడుస్తూ, నీ ఆశీర్వాదాలను పొందునట్లుగా చేయుము. ప్రభువా, మేము రాజులకు స్నేహితులగునట్లుగా మా హృదయములో దయగల మాటలను ఉంచి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, నీలాంటి పరిశుద్ధమైన హృదయమును, నీ వాక్కులను కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.