నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడంలో నేను ఎంతో సంతోషించుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 సమూయేలు 22:33వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును'' అన్న వచనం ప్రకారం దేవుడు నేడు మనకు బలమైన కోటగా ఉన్నాడు. పై వచనమును చూచినట్లయితే, రాజైన దావీదు వ్రాసిన విజయ కీర్తన ఇది.
నా ప్రియులారా, నిజానికి, దావీదు చేసిన యుద్ధాలన్నింటిని జయింపజేసినది దేవుడే. ముఖ్యంగా, దావీదును అతని బలమైన శత్రువుగా ఉన్న సౌలురాజు నుండి యెహోవాయే అతనిని విడిపించాడు. అందుకే 2 సమూయేలు 22:35వ వచనంలో దావీదు విజయోత్సాహంతో ఇలాగున అంటున్నాడు, "నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును'' ప్రకారం దేవుడే దావీదునకు యుద్ధము చేయుటకు నేర్పించెనని వ్రాయబడియున్నది. మరియు 2 సమూయేలు 22:41వ వచనంలో చూచినట్లయితే, "నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును'' అన్న వచనము ప్రకారం దావీదును దేవుడు తన యోధునిగా సిద్ధపరచియున్నాడు. ప్రభువు దావీదు జీవితంలోని ప్రతి భాగంలో అతనికి అక్షరాలా శిక్షణ ఇచ్చి, అతనిని సిద్ధపరచాడు. అందుకే బైబిల్‌లో కీర్తనలు 3:6వ వచనములో చూచినట్లయితే, దావీదు ధైర్యముగా ఇలాగున అంటున్నాడు, " పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను'' ప్రకారం గొప్ప సైన్యము తన మీదికి వచ్చి పడినను, అతడు భయపడనని చెబుతున్నాడు. దావీదుకు ఆధ్యాత్మిక నడిపింపును ఇచ్చినది ప్రభువే కనుకనే, దావీదు ఎంతో ధైర్యంతో చెప్పాడు. దేవుడు అతనికి సహాయము చేశాడు మరియు అతడు ఆధ్యాత్మికంగా నడిపించబడ్డాడు. కాబట్టి అతను ఈ మాటలను ధైర్యంగా చెప్పగలిగాడు. ముఖ్యంగా యుద్ధ సమయాలలో, దావీదు మొఱ్ఱపెట్టినప్పుడు, ప్రభువు అతనికి జవాబిచ్చాడు, ప్రభువే అతని పక్షమున నిలిచి, అతని యుద్ధములన్నిటిలోను అతనికి విజయమును ఇచ్చాడు. అతనికి తోడుగా నిలిచాడు మరియు అతని యుద్ధాలన్నింటిని ఆయన గెలిచాడు. అదేవిధంగా, నా ప్రియులారా, నేడు మీ ఆపత్కాల సమయములలో, మీరు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మీ పక్షాన ఉంటాడు, తన వాక్యం ద్వారా మీకు కావలసిన జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన ఎల్లప్పుడు తన ఆత్మ మూలముగా మీ పక్షమున విజ్ఞాపనము చేస్తుంటాడు. కనుకనే, ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీ పక్షమున ప్రార్థించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతాడు. కనుకనే, మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమనగా, ' లోకంలో ఉన్నవానికంటె మీలో ఉన్నవాడు గొప్పవాడు' అని చెప్పబడినట్లుగానే, మీరు తన ఆత్మతో నింపమని ఆయన మొఱ్ఱపెట్టండి. నిశ్చయముగా జవాబును పొందుకుంటారు.
కాబట్టి, నా ప్రియులారా, ఇంకా అత్యధికంగా దేవునికి మొఱ్ఱపెట్టుకొనండి, ఆయన తన పరిశుద్ధాత్మతో మిమ్మును నింపమని ఆయనను అడగండి, ఎందుకంటే, మీలో నివసించే గొప్ప దేవుడు, మీ యుద్ధాలన్నింటినీ పోరాడుచున్నాడు. అప్పుడు మీరు కూడా, 'నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను' అని ధైర్యంగా చెప్పగలరు. అవును, నా ప్రియులారా, ప్రభువు నేడు మిమ్మును బలపరచి, మీ మార్గాలను సరాళము చేసి, మిమ్మును భద్రముగా కాపాడుతాడు. మీ జీవితంలో సమస్త కార్యములు చేయడానికి ప్రభువు మిమ్మును బలపరుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును బలమైన ఆయుధముగా చేసి మా మార్గాన్ని భద్రపరచువాడవని నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్యా, మా బలహీనతలో నీ బలమును మాకిచ్చి, మమ్మును నీలో బలపరచుము. దేవా, నీవు దావీదుకు శిక్షణ ఇచ్చినట్లుగానే, మా శరీరము, జీవమును మరియు ఆత్మను మేము ఎదుర్కొనే యుద్ధాలకు శిక్షణ ఇవ్వు. ప్రభువా. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుము మరియు ఈ లోకములో ఉన్న వానికంటెను మాలో ఉన్నవాడవైన నీవు గొప్పవాడవని మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. దేవా, మా భయాలను మేము నీకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవు మా విమోచకుడవుగా ఉండి, మమ్మును ధైర్యముతో మరియు నీ ఆత్మ యందు ఎదుగునట్లుగా విశ్వాసముతో మమ్మును నింపుము. దేవా, తద్వారా మేము కూడా ధైర్యంగా, 'మమ్మును బలపరచు క్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయగలము' అని ప్రకటించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మమ్మును నీకు యోధులనుగా మార్చుము. మా దుఃఖములన్నిటిని సంతోషముగా మార్చుము. దేవా, మమ్మును క్రిందకు పారద్రోలుచున్న బలహీనతలన్నిటిని మా నుండి పారద్రోలుము. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి చేత, మా తలలను పైకి లేవనెత్తుము. ప్రభువా, దయచేసి మా మార్గాన్ని సురక్షితంగా కాపాడుము. దేవా, మా యుద్ధములన్నిటిలో నీవు మా పక్షమున పోరాడి మాకు విజయమును దయచేయుమని యేసుక్రీస్తు విజయవంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


