నా ప్రియ స్నేహితులారా, మనం ఈ నెల చివరికి వచ్చియున్నాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించి, ఉన్నత స్థితికి హెచ్చించియున్నాడని నేను నమ్ముచున్నాను. కనుకనే, ఈ రోజు కూడా, ఆయన ఒక అద్భుతమైన వాగ్దానమును మీ పట్ల చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నెహెమ్యా 2:8వ వచనము తీసుకొనబడియున్నది. ఆ వచనములో నెహెమ్యా ఇలాగున అంటున్నాడు: "నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను'' అని తెలియజేసినట్లుగానే, ఆయన హస్తము ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటుంది. అవును, ఇది ఎంతో శక్తివంతమైన సత్యం! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన ఆయన యొక్క కృపగల హస్తం మన మీదికి దిగి వచ్చినప్పుడు, ఈ లోకపు రాజుల నుండి మనము స్వయంగా గొప్ప కృపను మరియు దయను పొందుకుంటాము. దేవుడు వారి దృష్టిలో మీకు కృపను మరియు కటాక్షమును అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, ఈ లోకంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని నుండి మీకు కృప లభిస్తుంది. మీకు ఇంతకంటే ఇంకా ఏమి కావాలి? ఆయన అందరికి ప్రభువు, ఆయన అందరికి రాజు మరియు ఆయన మాట సెలవిచ్చినట్లయితే, మీ పట్ల గొప్ప కార్యములు జరుగుతాయి.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మనం ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవుని నుండి ఈ దయను పొందడానికి, దేవుని కృపగల హస్తం మన మీద ఉండటానికి, మనం ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించుదాము. ఆయనకు విధేయులముగాను, నమ్మకంగాను మరియు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుదాము, ఆయనను ప్రేమించుదాము, అన్ని వేళలా ఆయనను మనతో కూడా ఉండునట్లుగా ఆయనను మనలోనికి అంగీకరించుదాము, ఆయనలో ఆనందించుదాము మరియు ఆయన వాక్యాన్ని క్రమము తప్పకుండా చదువుదాము. నా ప్రియులారా, మనం ఈ విధంగా దేవునితో కూడా నడిచినప్పుడు, మనం ఆయన బిడ్డలమవుతాము. కాబట్టి, ఆయన కృపగల హస్తము మన మీద ఎల్లప్పుడు ఉన్న వారికి దేవుడు ఉన్నతమైన ద్వారములను తెరుస్తాడు.
మా నాన్నగారు విమానంలో ప్రయాణించుచున్నప్పుడు, విమానం ఆకాశములో ఎగురుచుండగానే, ప్రభువు మా తండ్రిగారితో మాట్లాడి, ' నీవు ఈ దేశ ప్రధానమంత్రిని వెళ్లి కలువు' అని తెలియజేశాడు. మా నాన్నగారికి ఇంతకు ముందు ఎన్నడు కూడా ప్రధానమంత్రిని గురించి తెలియదు. ఆయనకు అపాయింట్‌మెంట్ లభించే అవకాశం అస్సలు లేదు. కానీ, ప్రభువు చెప్పినట్లుగానే, మా నాన్నగారు వెంబడించారు. చూడండి నా ప్రియులారా, ఆశ్చర్యకరంగా, కొన్ని గంటలలోనే ఆయనకు ప్రధానమంత్రి నుండి సానుకూల స్పందన లభించింది. ప్రధానమంత్రి తన ఇంటిలో మా నాన్నగారిని కలవడానికి తలుపులు తెరచి, ఎంతగానో ఉత్సాహముతో మా నాన్నగారిని ఆహ్వానించారు. ప్రధానమంత్రి మా నాన్నగారితో ఎంతో సేపు వ్యక్తిగతంగా మాట్లాడారు. తిరిగి మా నాన్నగారు బయలుదేరు సమయములో, ప్రధానమంత్రి స్వయంగా తానే లేచి ఆయనను తన గది తలుపు వరకు సాగనంపారు. మా నాన్నగారి మీద ప్రధానమంత్రి హృదయములో అంతటి గొప్ప దయ కలిగెను. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు కూడా ప్రభువు రాజ్యము కొరకు పరుగెత్తినప్పుడు, రాజుల ద్వారములు మీకు స్వాగతం పలుకుతాయి. కనుకనే, నా స్నేహితులారా, మీరు ఆయన దయను పొందినందుకు ఎల్లప్పుడూ ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఎందుకంటే, అది ఏ రాజు నుండియైనను లేదా ఏ మానవుని నుండియైనను వచ్చునది కాదు, కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది. కనుకనే, నా ప్రియులారా, మీరు కూడా అటువంటి దయను కనికరమును పొందుకోవాలంటే, ఇప్పుడే మిమ్మును మీరు దేవుని దయగల హస్తమునకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు తోడుగా ఉండి, మీకు తన కృప చూపుచున్న మన దేవుని కరుణా హస్తముకొలది రాజు మీ మనవి ఆలకించి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ కృపగల హస్తం మా జీవిత ము మరియు మా కుటుంబము మీద ఉండునట్లుగాను మరియు నీకు ఇష్టమైన జీవితమును జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము నీకు విధేయత చూపడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను సేవించడానికి మరియు ప్రతిరోజు నీతో నడవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, మా జీవితం నీ నామమునకు మాత్రమే మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి నీవు మాత్రమే మూయబడిన ద్వారములను తెరువగలవు. కనుకనే, ఈ రోజే, మా యెదుట మూయబడిన ద్వారములను తెరవబడుటకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఇప్పుడే, పరలోకము నుండి మాత్రమే వచ్చు నీ యొక్క దైవీకమైన కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ యొద్ద మా కొరకు దాచబడియున్న సమస్తము పొందుకొనుటకు మేము నీ వైపునకు తిరుగునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, నీవు మాకు తోడుగా ఉండి మాకు చాలిన కృప చూపుటకు నీ యొక్క కరుణా హస్తముకొలది నీవు మా మనవి ఆలకించి, మమ్మును ఉన్నత స్థనమునకు హెచ్చించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


