నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయడములో నాకు చాలా సంతోషముగా ఉన్నది. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 17:20 వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "...ఇదిగో నేనతనిని ఆశీర్వదించి...అతనిని గొప్ప జనముగా చేసెదను'' ప్రకారం ఈ వాగ్దానము దేవుడు అబ్రాహామునకు ఇవ్వబడినది. జనము అనగా ఏమిటి? జనము అనగా, ఒక దేశము లేక ఒక దేశములో ఉన్న ప్రజలందరు అని అర్థము. అయితే, దేవుడు అబ్రాహామును జనముగా చేస్తానని వాగ్దానము చేయలేదు కానీ, గొప్ప జనముగా చేస్తానని వాగ్దానము ఇచ్చియున్నాడు. దేవుడు అబ్రాహాముతో ఈ వాగ్దానము చేసినప్పుడు, అతనికి పిల్లలు లేనేలేరు. అయినప్పటికి, దేవుడు అతనికి ఆ వాగ్దానమును ఇచ్చియున్నాడు. ఒక గొప్ప దేశమునకు ఏముంటుంది? ఆ దేశము చుట్టు ఉన్న ఇతర దేశాలను కూడా ఆశీర్వదించే శక్తి, ప్రభావము ఆ గొప్ప దేశమునకు ఉంటుంది. ఇంకను చుట్టు ఉన్నటువంటి సరిహద్ధులను నియంత్రించుకొనుటకు కావలసినటువంటి సంపదలు, వస్తువులు అన్ని ఉంటాయి. దేవుని స్వభావమును అనుసరిస్తూ, నీతి న్యాయములతో గొప్ప దేశము, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ పనిచేయుచున్నది. మరి ముఖ్యముగా, గొప్ప జనాభా కలిగి ఉంటుంది. ఆకాశములోని నక్షత్రములవలె మరియు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె ఉంటుంది. అయితే, అబ్రాహామునకు ఈ వాగ్దానము ఇచ్చినప్పుడు, అతనికి సంతానము లేదు. అతనికి పిల్లలు లేరు. అయితే, గొప్ప జనమునకు కావలసినటువంటి ఆ లక్షణములతో ప్రభువు అతనిని ఆశీర్వదించియున్నాడు.

కానీ, నా ప్రియులారా, ఇప్పుడు అబ్రాహాము జీవితాన్ని తిరిగి చూచినట్లయితే, దేవుడు ఈ వాగ్దానంలోని ప్రతి భాగాన్ని నెరవేర్చాడని మనం చూడగలము. అతడు గొప్ప ప్రభావమును మరియు శక్తిని కలిగియుండెను. అతనికి అనేకమైన ఆస్తులుండెను. ఇంకను అతడు నీతి న్యాయములను కలిగియున్నాడు. అదియుగాక, దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించేవాడు. మరియు ఆకాశములోని నక్షత్రములవలె మరియు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె అనేకమంది పిల్లలతో దీవించబడ్డాడు. అంతమాత్రమే కాదు, ఒక గొప్ప జనముగా ఉండగలిగే ఈ గొప్ప ఆశీర్వాదమును ప్రభువు ఎందుకు అతనికి ఇచ్చియున్నాడు? ఎందుకనగా, ప్రభువు దృష్టిలో అతను నీతి న్యాయముగా ఉంటూ, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాడు. కాబట్టి, అబ్రాహాము మాత్రమే కాదు గానీ, అతని సంతానము కూడా వారి జీవితములలో ఈ ఆశీర్వాదమును పొందుకోగలిగియున్నారు. అవును, నా ప్రియులారా, తరము వెంబడి తరము ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ, ప్రభువుయందు నమ్మికయుంచే ప్రతి ఒక్కరు కూడా, వారందరు ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ లక్షణాలన్నియు కూడా వారి జీవితములో నెరవేరడాన్ని వారు చూస్తారు.

అవును, నా ప్రియులారా, అదేవిధముగా, నేడు ప్రభువు మిమ్మును కూడా అదే వాగ్దానము చేత దీవించుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాడు. మీ పిల్లలను ఆకాశములోని నక్షత్రములవలె మరియు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె చేస్తాడు. ఇతరులను ఆశీర్వదించడానికి శక్తిని మరియు ప్రభావమును ఇస్తాడు. ఇంకను మిమ్మును నీతిగల జీవితమును జీవింపజేస్తాడు. నేడు దేవుని ఆజ్ఞలను అనుసరించే కృపను మీకు అనుగ్రహిస్తాడు. ఆస్తులు మరియు ఐశ్వర్యమును సమృద్ధిగా మీరు కలిగి ఉండునట్లుగా చేస్తాడు. ఈ రోజు మీ జీవితములో ప్రభువు అనుగ్రహించుచున్న ఆశీర్వాదములను పొందుకొనండి. ఆయన మిమ్మును గొప్ప జనముగా చేస్తాడు. కనుకనే, ఆయనకు వందనాలు చెల్లించండి. దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును గొప్ప జనముగా చేసి, మిమ్మును అబ్రాహాము వలె ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ అద్భుతమైన వాగ్దానమునకై నీకు వందనాలు. దేవా, మమ్మును గొప్ప జనముగా చేస్తానని వాగ్దానము చేశావు. ప్రభువా, ఆకాశములోని నక్షత్రములవలె మరియు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె సంతానము లేని మాకు పిల్లలను అనుగ్రహించుము. దేవా, నీతిగల జీవితమును జీవించుచూ, ఇతరులను ఆశీర్వదించే ప్రభావమును, శక్తిని మాకు దయచేయుము. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరిస్తూ, నీ గుణములను ప్రతిబింబింపజేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, ఐశ్వర్యమును కలిగి నీ దీవెనలను మేము అనుభవించునట్లుగా, మమ్మును దీవించి, నీ మంచితనమునకు సాక్షులుగా మమ్మును నిలువబెట్టుము. దేవా, ఈ ఆశీర్వాదములన్నిటిని యేసు నామమున మేము పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, నీవు అబ్రాహామును గొప్ప జనాంగముగా చేసినట్లుగానే, మా జీవితంపై కూడా అదే ఆశీర్వాదాన్ని ఉంచుతున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము ఇంకా పూర్తి చిత్రాన్ని చూడనప్పుడు కూడా, మేము నీ వాక్యాన్ని నమ్ముచున్నాము. ప్రభువా, నీ వెలుగును ముందుకు తీసుకెళ్లే భౌతిక మరియు ఆధ్యాత్మిక సంతతితో మమ్మును దీవించుము. దేవా, మా జీవితం నీ గొప్పతనానికి సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, ఈ రోజు మేము నీ వాగ్దానాన్ని కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో అంగీకరించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.