నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 75:10వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును'' ప్రకారం మనలను దేవుడు హెచ్చించబోవుచున్నాడు. ఈ కొమ్ములు దేనిని సూచిస్తాయి? కొమ్ములు అనగా, ఘనత, బలము, అధికారము, శక్తిని సూచిస్తాయి. బైబిల్‌లో పాతనిబంధన గ్రంథములో మొర్దెకై అను వ్యక్తి జీవితములో ఈ వచనము యొక్క నెరవేర్పును మనము చూడగలుగుతాము. అతడు చేసిన పనులన్నిటిలో నీతిమంతుడుగా ఉన్నాడు. కానీ, హామాను అతనికి గుర్తింపు రాకుండా చేయాలని అనుకున్నాడు. అతనే ఘనతను పొందుకోవాలని అనుకున్నాడు. కాబట్టి, మొర్దెకైని ఎప్పుడు పైకి రానివ్వలేదు. హామాను తనను తానే శ్రేష్టమైన వ్యక్తిగా చూపించుకొని, ఘనత పొందాలని అనుకున్నాడు. రాజు అతనిని అధికారములో రెండవ స్థానములో హెచ్చించాడు.

కానీ, ఒకానొక సమయములో ఎస్తేరు ద్వారా రాజు అన్నిటిని తెలుసుకోగలిగాడు. హామాను మొర్దెకైని నాశనము చేయాలని ఏదైతే సిద్ధపరచియున్నాడో అదే హామాను మీదికి వచ్చినది. రాజు మొర్దెకై యందు ఆనందించాడు గనుకనే, అతనిని హెచ్చించి ఘనపరచాడు. రాజును కాపాడడములో అతను చూపించిన ధైర్యము అతనినికి ఘనతను తీసుకొని వచ్చినది. ఎస్తేరు గ్రంథము 2 వ అధ్యాయములో మనము ఈ విషయమును చదవవచ్చును. మొర్దెకై నీతిమంతుడు, కనుకనే అతడు రాజును కాపాడాడు. ఇంకను తన ప్రజల కొరకు ప్రార్థించిన వ్యక్తి. దుష్టులైన మనుష్యులకు అతడు మ్రొక్కలేదు. కాబట్టి, మొర్దెకై కొమ్ములను ప్రభువు హెచ్చించి, అతనిని ఘనపరచాడు.

అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు, 'నేను చేయుచున్న నీతికార్యములు ఏవియు కూడా గుర్తించబడుటలేదు అని అంటున్నారా? అందరి పట్ల నేను యథార్థముగాను, ధైర్యముగాను ఉన్నాను, నీతి జరిగించడానికి నా ప్రాణాన్ని కూడా తెగించుచున్నాను. కానీ, నాకు ఏమి జరుగుతుందో అని మీరు భయపడుచున్నారా?' నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. అవును, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మిమ్ములను ఘనపరుస్తాడు. ఇంకను మిమ్మును హెచ్చించి, ఉన్నత స్థలములో ఉంచుతాడు. ఎందుకనగా, ఆయన మీ యందు ఆనందించుచున్నాడు. మీరు నీతికార్యములు చేయడానిని బట్టి, ఆయన మీ కొమ్ములను హెచ్చించి, మిమ్మును ఘనపరుస్తాడు. ఈ రోజు ప్రభువు యొద్ద నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృగపల మా ప్రి పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీతిమంతుల కొమ్ములు పైకెత్తబడతాయని నీవు ఇచ్చిన ప్రోత్సాహకరమైన వాగ్దానానికి నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రభువా, మేము నీతిగా జీవించునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, మేము ఈ లోకములో ఉన్న శోధనలను జయించుటకు మాకు కావలసిన ధైర్యమును, యథార్థముగా ఉండునట్లుగాను, పరిశుద్ధంగా జీవించునట్లుగాను, నీతిగా జీవించుటకు ప్రాణాలను తెగించుటకు కూడా నీ యొక్క ధైర్యమును మాకు దయచేయుము. ప్రభువా, మేము నీలో జీవించునట్లుగాను, మమ్మును పైకిలేవనెత్తుము, ఘనత, బలము మమ్మును వెంబడించునట్లుగా నీ శక్తిని మాకు దయచేయుము. ప్రభువా, నీతిలో జీవించుటకు మేము కొనసాగించుటకును మరియు ఇతరులను నీతిలోనికి నడిపించే గొప్ప కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మొర్దెకైని నీవు ఘనపరచినట్లుగానే, నీ పరిపూర్ణ సమయంలో మమ్మును ఘనపరచుము. ప్రభువా, ఇతరులు మమ్మును గుర్తించనప్పుడు కూడా మేము నమ్మకంగా, నిజాయితీగా మరియు ధైర్యంగా నీలో నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయుము. దయచేసి దేవా, మా హృదయం నుండి అన్ని భయాలను తొలగించి, మా జీవితం నీకు ఆనందాన్ని కలిగించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మమ్మును పైకి లేవనెత్తి, మా కొరకు సిద్ధపరచి స్థలములో మమ్మును ఉంచుతావని మేము నమ్ముచున్నాము. దేవా, నేడు నీవు, మా కొమ్ములను హెచ్చించి, మమ్మును తృణీకరించువారి యెదుట ఘనపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.