నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, ఈ రోజు ఒక అద్భుతమైనటువం టి వాగ్దానమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:4 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించు చున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, నిత్యమైన ప్రేమతో ప్రభువు మిమ్ములను ప్రేమించుచున్నాడు. మీ యొక్క ఆశీర్వాదములను అధికము చేస్తానని అందుకే ప్రభువు అంటున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ విస్తరింపును, దయను, ఆనందమును మరియు సమృద్ధియైన ఆశీర్వాదములను తీసుకొని వచ్చుచుచున్నది.
2025వ సంవత్సరములో నేను నా పుట్టినరోజును జరుపుకుంటున్న సమయమునందు, ఒక ప్రియ సహోదరుడు ఈ వచనమును నాకు వాగ్దానముగా ఇచ్చియున్నాడు. ఆ వాగ్దాన వచనము బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథము 36:11వ వచనము ఇవ్వబడియున్నది. ఆ వచనము, "మీ మీద మనుష్యుల ను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమై న మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు'' ప్రకారముగా ఈ వచనము నా కొరకు అని నేను స్వీకరించియున్నాను. మరి ముఖ్యముగా, 'మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను' అను మాటను నేను గట్టిగా పట్టుకున్నాను.
అదేవిధముగా, 2025వ వచనమును నేను గమనించినప్పుడు, నిజముగా ప్రభువు నా కుటుంబమును అభివృద్ధిపరచియున్నాడు. ఆలాగుననే, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో కూడా ప్రభువు విస్తరింపును కలుగజేసియున్నాడు. కారుణ్య విశ్వవిద్యాలయములో కూడా అభివృద్ధి జరుగుట నేను చూచియున్నాను. ఎంత విస్తరించినను, అంత ఆనందము అను సామెతను ప్రజలు అంటుంటారు కదా! ఒక ప్రియమైన తల్లిగారు ఒకరోజు నాకు కాల్ చేసి, ఈలాగున చెప్పారు, 'ఇవాంజెలిన్, ఈ రోజు నీవు విస్తరింపబోవుచున్నావు. నీ కుటుంబము విస్తరించబోవుచున్నది. నీవు ఇప్పుడు సమస్యలలోనికి కూడా వెళ్లబోవుచున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు.' అయితే, నేను ఆమెతో ఈలాగున చెప్పాను, 'ప్రభువు నా కుటుంబమును ఎంతమంది కుటుంబ సభ్యులతో విస్తరింపజేయుచున్నాడో నేను అంతగా సంతోషిస్తాను' అని అన్నాను. ఆలాగుననే, ప్రభువు ఆ విషయమును నా జీవితములో జరిగించుచూ ఉన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు మనమసంతానము కలిగియున్నాను. నాకు ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు, నా పిల్లలతో నేను ఈలాగున చెబుతుంటాను, ' నాకు పండ్రెండుమంది మనమ సంతానము కావాలని' అంటుంటాను. ఎంతమంది ఎక్కువగా ఉన్నట్లయితే, నాకు అంతగా సంతోషము. అవును, నా ప్రియులారా, ప్రభువు ప్రజలను మీ మీద విస్తరింపజేస్తాడు.
అదేవిధముగా, నా ప్రియులారా, పరిచర్యలో కూడా ప్రభువు దేవుని యొక్క సైన్యమును మాకు ఇచ్చియున్నాడు. కారుణ్యలో కూడా అక్కడ చదువుకునే విద్యార్ధుల కుటుంబముల ద్వారా ప్రభువు ఎంతగానో దీవించియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము ఎంతగా విస్తరించినట్లయితే, మనకు అన్ని ఆశీర్వాదములు మన జీవితములోనికి వస్తాయి.
ఇశ్రాయేలీయులకు సంఖ్యలో చూచినట్లయితే, ఇశ్రాయేలీయులు సంఖ్యలో విస్తరించు చున్నప్పుడు, ఒక నూతనమైన రాజుగా ఫరో వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు సంఖ్య ఎంతగానో పెరిగిపోతుంది మరియు విస్తరించుచూనే ఉన్నది అని అన్నాడు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 1:11వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి'' అని చెప్పబడిన ప్రకారముగా, అతడు ఇశ్రాయేలీయుల ప్రజల సంఖ్యను చూచి ఎంతగానో అసూయ చెందాడు. ఇశ్రాయేలీయులతో వెట్టి పనులు చేయించుచూ, వారిని బానిసలుగా మార్చియున్నాడు. ఆలాగుననే, ఆ తరువాతి వచనము అనగా, నిర్గమకాండము 1:11వ వచనములో మనము చూచినట్లయితే, "అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి'' అని చెప్పబడినట్లుగానే, ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు అంతకంతకు విస్తరించి, ప్రబలిరి. అందును బట్టి, ఐగుప్తీయులు వారిని చూచి భయపడిపోయారు.
నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ఇట్టి ఆశీర్వాదములు మీ కుటుంబము మీదికి కూడా దిగివచ్చుచున్నది. ప్రభువు మిమ్మును ప్రేమించుచున్నాడు గనుకనే, మీకు ప్రతిగా ప్రభువు మనుష్యులను ఇస్తాడు. మీ పైని మనుష్యులను విస్తరింపజేస్తాడు. అంతమాత్రమే కాదు, మీ పైని ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు మరియు సమృద్ధియైన ఐశ్వర్యమును అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను బట్టి సమస్తమును విస్తరింపవలసియున్నది. ప్రభువు మిమ్మును మరియు మీ బిడ్డలను అట్టి విధముగా విస్తరింపజేసి, దీవించును గాక. ఇంకను ప్రభువు మీ యొక్క మనవళ్లను మరియు మనమరాళ్లను కూడా విస్తరింపజేయును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును విస్తరింపజేసి, దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మమ్మును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, నీ దృష్టిలో మమ్మును అమూల్యమైన వారినిగా పిలిచినందుకు నీకు వందనాలు. ప్రభువా, మా యొక్క విస్తరణను చూచి, అసూయ చెందకుండా, మమ్మును నీ కృపతో కప్పుము. ప్రభువా, ప్రజలు మా మీద కోపముగా ఉన్నట్లయితే, నీ హస్తము మా మీదికి దిగివచ్చి, మమ్మును మరియు మా కుటుంబము విస్తరింపజేయునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క పరిచర్యలో అభివృద్ధి నొందునట్లుగాను మరియు మా వ్యాపారములను మరియు మా జీవితములో ఆశీర్వాదములను విస్తరించునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఎంతగా శ్రమపడుచున్నామో అంతగా, మేము రానున్న దినములలో విస్తరించి, వర్థిల్లునట్లుగా చేయుము. ప్రభువా, దీన స్థితిలో ఉన్న మేము మరియు మా బిడ్డలు విస్తరించునట్లుగాను మరియు మా యొక్క మనమసంతానము కూడా విస్తరించునట్లుగా చేయుము. దేవా, నిన్ను ప్రేమించువారికిని మరియు ఇతరులకు మధ్య ఒక వ్యత్యాసమును కనుపరచుము. యేసయ్యా, నీ బిడ్డలమైన మేము నిన్ను ప్రేమించుచున్నందున మమ్మును ఉన్నతంగా హెచ్చించి, మమ్మును దీవించుము. దేవా, మేము ఇంతకు ముందుకంటే మమ్మును అధికముగా అభివృద్ధినొందించుము. ప్రభువా, మాకు నీవిచ్చు విస్తరణ, మా జీవితములో సంతోషమును కలుగజేసి, ఆ సంతోషము మాలో అధికమగునట్లుగా మరియు పరిపూర్ణమగునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబాన్ని, మా పిల్లలను, మా మనవసంతతిని, మా పనిని, మా పరిచర్యను, మరియు నీవు మాకు అప్పగించిన వాటన్నిటినీ ఆశీర్వదించుము. ప్రభువా, ఇతరులు మమ్మును ఎదిరించినా లేదా అపార్థం చేసుకున్నను సరే, నీ దయచేత మా ఇంటిని ఆనందంతో, శాంతితో, మరియు సమృద్ధియైన ఆశీర్వాదాలతో నింపుము. దేవా, మా జీవితం నీ విశ్వసనీయతకు మరియు మంచితనానికి సాక్ష్యంగా మారునట్లుగా చేసి, మేము చేయు ప్రతి పని నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేసి, అనేకులను ఆశీర్వదించునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


