నా ప్రియ స్నేహితులారా, నేడు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 40:2వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "...ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను'' ప్రకారము ప్రభువు ఎల్లప్పుడు ఆశీర్వదించుటకు ఇష్టపడతాడు. మనలను పైకి లేవనెత్తి స్థిరపరుస్తాడు. మనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఆయన తన పర్ణశాలలో మనలను దాచిపెట్టి మనలను కాపాడతాడు. అందుకే కీర్తనలు 27:5వ వచనములో దావీదు భక్తుడు అదే చెబుతున్నాడు. ఆ వచనములో, "ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును'' ప్రకారము ఆయన మనలను తన గుడారపు మాటున దాచుతాడు. అవును, మనము లోతైన సమస్యలలో బడి, వెళ్లుచున్నప్పటికిని, ప్రభువు మనలను పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యము గలవాడు. భక్తుడైన యోనా సమస్యలలో ఉన్నప్పుడు "పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను,'' అని ఈ విధంగా మొఱ్ఱపెట్టాడు. ప్రభువు అతని సమస్యలలో నుండి విడిపించియున్నాడని యోనా ప్రభువునకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాడు. అందుకే బైబిల్ నుండి యోనా 2:6వ వచనములో చూచినట్లయితే, "నేను మరెన్నటికిని ఎక్కి రాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించియున్నావు'' ప్రకారము ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏదియు లేదు నా ప్రియ స్నేహితులారా. ప్రభువు మనలను ఎటువంటి సమస్యలలో నుండియైనను బయటకు రప్పించగల సమర్థుడు. కనుకనే మీరు భయపడకండి.
నా ప్రియులారా, మీరు విశ్వాసములో బలపరచబడాలనియు మరియు ప్రోత్సహించబడాలనియు మీతో గణేష్‌గారి యొక్క ఒక చక్కటి సాక్ష్యమును పంచుకోవాలని కోరుచున్నాను. అతను కాకినాడ పట్టణము దగ్గర నివసించుచున్నాడు. కొన్ని సంవత్సరముల క్రితము అతనికి వివాహము జరిగినది. వారిద్దరు అద్భుతమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తుండేవారు. అయితే, జీవితములో అనుకోని ఒక ములుపు తిరిగియున్నది. 2023వ సంవత్సరములో వారు కాకినాడలో ఉన్నటువంటి యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును సందర్శించి వారు రక్షణ పొందుకొనియున్నారు. ఆ సమయములో వారు అనేకమైన ఆర్థిక ఇబ్బందులలో ఉండేవారు. భయంకరమైన అప్పులలో కూరుకుపోవుచున్నట్టుగా వారు భావిస్తూ ఎంతగానో బాధపడేవారు. వారికి అప్పు ఇచ్చినటువంటివారి యొక్క ఒత్తిడి రోజు రోజుకు ఎంతగానో ఎక్కువైపోవుచుండెను. వారు ఆశలన్నిటిని కోల్పోయారు. ప్రతిరోజు సహోదరులు గణేష్ భయముతోను, అవమానముతో నిండుకొని ఉండేవారు. నిరాశ నిస్పృహలు సహోదరులు గణేష్‌ని ఆవరించాయి. అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కలుగుచుండేవి. అతని జీవితమును తాను అంతము చేసుకోవాలనుకున్నాడు. కానీ, తన భార్యకు ఒక ఉద్యోగమును సంపాదించుకోవాలని 3 లక్షలు వ్యయపరచాడు. వారిద్దరు కూడా మోసపోయారు. ఆ డబ్బంతయు కూడా నష్టపోయారు. మోసగించబడుట ద్వారా వారు ఇంకా నిరాశ నిస్పృహలలోనికి నెట్టబడ్డారు. మోసము చేయబడుట వలన అతడు మానసికంగా కృంగిపోయాడు. అటువంటి పరిస్థితిలో రాజమండ్రిలో 2024 వ సంవత్సరమున జరుగుచున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థుల కూడికలను గురించి అతడు వినియున్నాడు. ఆ కూడికలో ఎలాగైన పాల్గొనవలెనని అతడు ప్రేరేపించబడ్డాడు. ప్రార్థన మాత్రమే అతని చివరి ఆశ అని అతడు నమ్మాడు. ఆ కూడిక జరుగుచున్న సమయములో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థించాను. అతడు నాతో కూడి కలిసి ప్రార్థించడానికి మొదలు పెట్టాడు. అతడు కూడ ప్రార్థనలో ఏకీభవించాడు. ఆ తర్వాత, అతని జీవితములో మార్పులు సంభవించాయి. అతని చేతి పనిని ప్రభువు ఆశీర్వదించడము మొదలు పెట్టాడు. ప్రభువు అతనికి ఒక అద్భుతమైన ఉద్యోగమును ఇచ్చాడు. ఆ ఉద్యోగము వలన మంచి జీతము లభించేది. ఆర్థికముగా ప్రభువు అతనిని ఎంతగానో ఆశీర్వదించడము మొదలు పెట్టాడు. అతని జీవితములో సంపూర్ణముగా సమస్తమును మారిపోయినది. ఈ రోజు వారు ఎంతో ఆనందముగా తమ వైవాహి జీవితమును గడుపుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియులారా, ప్రభువు మనలను పైకి లేవనెత్తి మన పాదములను స్థిరపరచి, బండ మీద నిలబెట్టి, మన అడుగులను స్థిరపరుస్తాడు. ఈ రోజు కూడా ఆయన యొక్క శక్తివంతమైన హస్తముచేత మీ జీవితములో ప్రభువు అద్భుతములను జరిగిస్తాడు అని నమ్ముచున్నాను. మీ జీవితములో ఎన్నో మారబోవుచున్నవి. యుగయుగాల బండయైన యేసు మీ కోసం స్థిరంగా నిలిచియున్నాడు. ఆయన మీ చేతుల పనిని స్థిరపరుస్తాడు, మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు మరియు మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు నూతనంగా లేవనెత్తుతాడు. ప్రభువు ఆశీర్వదించినప్పుడు, ఎవరూ శపించలేరు. ఆయన ప్రోత్సహించినప్పుడు, ఎవరూ మిమ్మల్ని క్రిందికి లాగలేరు. కనుకనే, నా ప్రియులారా, ఈరోజు ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి - ఆయన మిమ్మల్ని ఒక బండపై ఉంచుతాడు. అద్భుతాలను ఎదురు చూడండి! ప్రభువు మీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని మరియు ఆర్థిక పరిస్థితులను ఆశీర్వదిస్తాడు. మీరు ఉద్యోగం, పదోన్నతి, బదిలీ లేదా వీసా కోసం ప్రార్థించుచున్నట్లయితే, ప్రభువు సరైన మార్గములను తెరుస్తాడు. ఆయనను నమ్మండి, మరియు ఆయన శక్తివంతమైన చేయి మిమ్మల్ని గతంలో కంటే ఉన్నతంగా పైకి లేవనెత్తడం మీరు చూడగలరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మా కొండ, కోట, ఆశ్రయముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువైన యేసయ్యా, నీ మాట చొప్పున మేము చేయుచున్న చేతి పనులన్నిటిని ఆశీర్వదించుము. దేవా, మేము అర్థిక ఇబ్బందుల నుండి మమ్మును విడిపించుము. దేవా, మేము మా జీవితములో ఆశలన్నిటిని కోల్పోయాము. తద్వారా మాలో ఉన్న ఆత్మహత్యా ఆలోచనలన్నిటిని తీసివేయుము. యేసయ్యా, స్థిరమైన నీ బండ మీద మమ్మును నిలబెట్టుము. ప్రభువా, మా అప్పుల సమస్యల నుండి మమ్మును విడిపించి, మమ్మును జ్ఞాపకము చేసుకొని, మమ్మును ఆశీర్వదించుము. దేవా, నేటి నుండి మా ఆర్థికాలు మరియు మా కుటుంబ జీవితమును ఆశీర్వదించబడునట్లుగా చేయుము. దేవా, మా నష్టములన్నిటిని మార్చి, మాకు కావలసినవన్నియు ఇచ్చి, మమ్మును దీవించుము. ప్రభువా ఉన్నత శిఖారాలకు మమ్మును లేవనెత్తుము. దేవా, మేము నిన్ను ప్రేమించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము అప్పులు మరియు నిరాశతో పోరాడుతున్నప్పుడు మమ్మును పైకి లేపుము మరియు మేము ఆశను కోల్పోయినప్పుడు మమ్మును ఓదార్చుము మరియు మా బలాన్ని పునరుద్ధరించుము. ప్రభువా, మా భయం, వైఫల్యం మరియు అవమానం యొక్క ప్రతి గోతి నుండి మమ్మును విడిపించుము. దేవా, మా వ్యాపారం వృద్ధి పొందునట్లుగాను మరియు మా ఉద్యోగం సురక్షితంగా ఉండనివ్వండి. నిన్ను ప్రేమించేవారికి మరియు ప్రేమించని వారికి మధ్య తేడాను కనుపరచుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


