ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 4:29లో, “నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును” అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, ప్రియులారా! దేవునికి మనమందరము కావలెను. మనము ఇద్దరు యజమానులకు సేవ చేయలేము. మనము చల్లగా ఉండలేము కానీ, మనము దేవుని కొరకు వేడిగా ఉండవలెను. కనుకనే ప్రకటన 3:16లో, “నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను” అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మనము మన పూర్ణహృదయముతోను, పూర్ణ మనస్సుతోను మరియు పూర్ణాత్మతోను దేవుని ప్రేమించవలెను అని ప్రభువైన యేసు మత్తయి 22:37లో సెలవిచ్చుచున్నాడు. ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చెను కనుక మనము ఆయనను చేరుకొనగలము మరియు ఆయనను కనుగొనగలము. మనము ఎంత ఎక్కువగా దేవుని వాక్యమును ధ్యానించెదమో, అంత అధికముగా ఆయన మనకు ప్రత్యక్షమగును.

అవును ప్రియులారా! దేవుడు మనకు ప్రత్యక్షముకావలెనని ఆశించుచున్నాడు. దానికి మనము దేవుని వాక్యమును చదవవలెను, వాక్యమును వెదకవలెను, వాక్యమును ధ్యానించవలెను మరియు వాక్యము ప్రకారం జీవించవలెను. ప్రభువు ఆయన కొరకు మనము వెదకవలెనని ఆశించుచున్నాడు. మనము ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసించినప్ప్పుడు, ఆయన మనకు ప్రత్యక్షమగును. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” అని హెబ్రీయులకు 11:6 సెలవిచ్చుచున్నది. దేవుడు నమ్మకమైనవాడు. ఆయనను మనలను ఆసక్తిగా వెదకినట్లయితే, మనము నిజముగా ఆయనను కనుగొనెదము. 2008వ సంవత్సరములో నేను దేవుని నా పూర్ణహృదయముతో వెదకి, “ప్రభువా, నీ శక్తితో నన్ను అధికముగా నింపుము” అని మొఱ్ఱపెట్టాను. అది మా తండ్రియైన సహో. దినకరన్‌గారు మరణపడకలోనున్న బాధాకరమైన సమయము అది. మేము ఆ సమయములో వైజాగ్‌కు వెళ్లుటకు సిద్ధపడుచున్నాము, అయినను మేము సరిగ్గా ఉపవాసముతో ప్రార్థన చేయలేకపోయాము. మేము దుఃఖముతో నింపబడ్డాము మరియు నా హృదయములో చాలా శూన్యముగా భావించాను.

కనుక నేను, “ప్రభువా, నన్ను నీ శక్తితో నింపుము” అని దేవునికి మొఱ్ఱపెట్టాను. వైజాగ్‌లో దిగిన తరువాత, నిద్రపోవుటకు సిద్ధపడుచున్నప్ప్పుడు, ప్రభువు నాతో, “నా ప్రియ బిడ్డా, నిద్రపో. రేపు ఉదయము లేచి, నీ భర్తతో కలిసి ప్రార్థన చేయుము. నేను మీ ఇద్దరిని నా ఆత్మతో నింపెదను” అని మాటలాడుట నాకు వినిపించింది. నేను ఆ క్షణము కొరకు ఎంతో ఆసక్తితో ఎదురుచూశాను మరియు ఉదయమునే నా భర్తను నాతో కలిసి ప్రార్థించమని కోరాను. మేము ప్రార్థన చేయగా, దేవుడు ఆయన ఆత్మతో మమ్మల్ని నింపెను. దేవుని సంపూర్ణతను మేము అనుభూతిచెందాము మరియు పరలోకపు భాషలలో మాటలాడుట ప్రారంభించాము. పరలోకము, క్రిందికి దిగివచ్చినట్లుగా ఉన్నది. మా ప్రార్థన మధ్యలో, నేను యేసయ్యను ముఖాముఖిగా చూశాను. అది ఎంత మధురమైన అనుభూతి! ప్రేమతో నిండిన యేసయ్యను నేను చూశాను మరియు ఆయన నా హృదయమును ప్రేమతో నింపెను. నేను ఆయనను శ్రద్దగా వెదకినందువలన, ప్రభువు నా యెదుట ప్రత్యక్షమాయెను. ఈనాటికీ ప్రభువు, “మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను నన్ను వెదకినప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను” అని సెలవిచ్చుచున్నాడు.

ప్రార్థన:
పరలోకమందున్న మా తండ్రీ, నా పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను మరియు పూర్ణమనస్సుతోను నిన్ను వెదకుటకు నాకు నేర్పించుము. నాలోని నులివెచ్చదనమును తొలగించి, నీ కొరకు వాంఛను నాలో నింపుము. నీ వాక్యమును ప్రేమించుటకును, చదువుటకును మరియు నీ సత్యము ప్రకారం జీవించుటకును నాకు సహాయము చేయుము. ప్రభువా, నేను శూన్యముగాను మరియు బలహీనముగాను భావించుచున్నప్పుడు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. నన్ను నీ సహవాసములోనికి నడిపించుము మరియు అనుదినము నీ సన్నిధిని అనుభవించుటకు నాకు సహాయము చేయుము. లోకములో వేరే దేనిని ఆశించక, నీ కొరకు మాత్రమే నేను ఆకలిగొనియుండుటకు నాకు కృపచూపుమని యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.