నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 144:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు'' ప్రకారము దేవుడు చిన్న బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తాడు. యేసయ్య యొద్దకు తమ తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు, ఆయన వారి పిల్లలను ఎత్తుకొని ఆశీర్వదించాడు. ఈ రోజు ప్రభువు మీ కుమారులను మరియు కుమార్తెలను ముఖ్యముగా మీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకే కీర్తనలు 128:3వ వచనములో చూచినట్లయితే, " నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు'' అని వాక్యములో చెప్పబడియున్నది. అవును, మన పిల్లలు ఆశీర్వదింపబడాలని మనము కోరుకునేదానికంటే, ప్రభువు మనలను ఎక్కువగా ఆశీర్వదించాలని మన పట్ల ఆశించుచున్నాడు. కనుకనే, మీరు మరియు మీ పిల్లలు మరి ఎక్కువగా ఆశీర్వదింపబడాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. ఆలాగుననే, మీతో పాటు మీ పిల్లలను కూడా అత్యధికముగా ఆశీర్వదింపబడాలని ప్రభువు ఆశించుచున్నాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

ఈ రోజు మీతో ఒక అద్భుతమైన సాక్ష్యమును పంచుకోవాలని నేను మీ పట్ల ఆశించుచున్నాను. ప్రియ సహోదరియైన ఫణి కుమారి మరియు తన భర్తయైన శివ వీర వెంకట రామారావుగారు ఈ విధంగా తమ సాక్ష్యమును పంచుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె పేరు జ్యోతి ప్రియ మరియు చిన్న కుమార్తె శాంతి ప్రియ. పెద్ద కుమార్తె తమ చదువులను పూర్తి చేసుకొనెను. తన జీవితములో స్థిరపడడానికై ఆమె వేచియుండెను. తల్లిదండ్రులు తన కొరకు ఒక చక్కటి జీవిత భాగస్వామి కొరకు వెదకుచున్నారు. వారు ఎంతో కాలముగా వెదకుచూ, వేచియున్నారు. అది వారికి ఎంతగానో విసుగు తెప్పించినది. కానీ, కాలము గతించిపోవుచుండెను. వారి స్నేహితుల యొక్క కుమార్తెలందరు కూడా వివాహము చేసుకొని, జీవితములో స్థిరపడ్డారు. అయితే, తల్లిదండ్రులు తమ జీవితములో ఆ విధంగా దీవించబడాలని కోరుకుంటున్నారు. ఈ టి.వి2 మరియు ఆరాధన ఛానల్‌లో కూడా ప్రసారమగుచున్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా కార్యక్రమములను వారు ఎంతో ప్రార్థనా పూర్వకముగా క్రమము తప్పకుండా చూసేవారు.

ఆలాగున కొనసాగుచుండగా, 2020 జనవరి 3వ తారీఖున, నా భర్తగారైనటువంటి, డా. పాల్ దినకరన్‌గారు దేవుని వాక్యమును పంచుకొనుచుండెను. ప్రార్థనా సమయములో నా భర్తగారు, ప్రవచనాత్మకముగా వారి యొక్క కుమార్తె పేరును పిలిచియున్నారు. ఆమెను పెట్టి పిలిచి, ఈలాగున చెప్పెను, ' ప్రియా, నీకు ప్రభువు ఒక అద్భుతమైన భర్తను ఇవ్వబోవుచున్నాడు మరియు నీవు అందుకొరకు ఎంతగానో ప్రార్థించుచున్నావు, కనుకనే, భయపడవద్దు, నీవు అనేకమైన నిరాశలను ఎదుర్కొని ఉన్నావు. కానీ, నిన్ను ప్రేమించే చక్కని భర్తను ప్రభువు నీకు ఇస్తాడు మరియు ఈ రోజు దేవుని కృప నీ మీదికి రానైయున్నది, నీవు చేయుచున్న ప్రతి ప్రయత్నములన్నిటిలో కూడా నీవు సఫలమవుతావు' అని చెప్పారు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు అసలు నమ్మలేకపోయారు. తమలో తాము, ఇలాగున మాట్లాడుకున్నారు, మనము అసలు మన హృదయములో ఉన్న విషయములను డా. పాల్ దినకరన్‌గారికి చెప్పలేదు. కానీ, అసలు ఇది ఎలాగున సాధ్యము? అనుకున్నారు. అయితే, ఫిబ్రవరి, 13వ తారీఖున తన కుమార్తె ప్రియాకు నిశ్చితార్థము జరిగినది. గత సంవత్సరము జూన్ 21వ తారీఖున వారికి వివాహము జరిగినది. దేవుని కృపను బట్టి వారు ఇప్పుడు యుకెలో చక్కగా స్థిరపడియున్నారు. ఆలాగుననే, తన పై చదువులను కూడా యుకెలో కొనసాగించుచుండెను. యుకెలో ఉంటూ ఆమె తన పై చదువులను ముగించియుండెను. అంతమాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులందరిని యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఉన్న వివిధమైన పధకాలలో భాగస్థులనుగా చేర్చినది. వారు దేవుని పట్ల ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించారు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యను బట్టి, వారు దేవునికి ఎంతో కృతజ్ఞులై యున్నారు. ఈ పరిచర్యను బట్టి మా పిల్లలు అన్ని విధాలుగా దీవించబడియున్నారు అని వందనాలు చెల్లించుచూ మరియు వారు ప్రభువునకు కూడా కృతజ్ఞతలు చెల్లించారు. కనుకనే, నా ప్రియులారా, మీ కుమారులు మరియు కుమార్తెలు కూడా దీవించబడతారు. ఇంకను వారు నగరునకై చెక్కిన మూలకంబములవలె వారు ఉంటారు. మరియు వారు యౌవన కాలమందు చక్కగా ఎదిగిన మొక్కలవలె ఉంటారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 128:3వ వచనములో చూచినట్లయితే, "మీ భోజనపు బల్లచుట్టు మీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు'' ప్రకారము ప్రభువు మిమ్మును మరియు మీ పిల్లలను నేటి వాగ్దానము నుండి వర్థిల్లింపజేయును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా పిల్లలను ప్రేమించి ఆశీర్వదిస్తానని చేసిన వాగ్దానము కొరకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు చిన్నపిల్లల మీద నీ చేతులు ఉంచి, వారి కౌగలించినట్లుగానే, ఈరోజు మా పిల్లలపై నీ యొక్క చేతులు ఉంచి, ఆశీర్వదించుము. ప్రభువా, ఈ రోజు ఇంకను వివాహము కానీ, మా పిల్లల కొరకు లేక మా కొరకు ప్రార్థించుచున్నాము, పై చెప్పబడిన సహోదరి దీవించబడినట్లుగానే, మేము కూడా దీవించబడునట్లుగా చేయుము. దేవా, మా పేర్లను నీవు ఎరిగియున్నావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఈ రోజు ఆశీర్వాదము కొరకు వేచియున్న మమ్మును జ్ఞాపకము చేసుకొనుము. దేవా, ముఖ్యంగా వివాహము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు త్వరగా స్థిరపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, అటువంటి బిడ్డలపై నీ యొక్క హస్తము దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, సరైన జీవిత భాగస్వాములను మాకు మరియు మా పిల్లలకు దయచేయుము. ప్రభువా, గర్భముఫలము లేని మా ప్రియులైన వారికి మరియు మాకును ఇప్పుడే యేసు నామమున గర్భఫలమును దయచేయుము. ప్రభువా, మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉండునట్లుగాను మరియు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉండునట్లుగాను స్థిరంగా మరియు ప్రకాశవంతంగా నిలబడునట్లుగా సహాయము చేయుము. దేవా, మాకు మరియు మా పిల్లలకు నీ యొక్క జ్ఞానం, ఆనందం మరియు నిన్ను వెంబడించే హృదయంతో మమ్మును మరియు మా ప్రియులను ఆశీర్వదించుము. ప్రభువా, మా కుటుంబం నీ ప్రేమ మరియు అనుగ్రహంలో వర్ధిల్లునట్లుగా చేసి, మా తర్వాత తరతరాలుగా నీ కృప ప్రవహించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.