నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును...'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రభువునందు ఆనందించినప్పుడు, ఆయన మన కొరకు పరలోకంలో గొప్ప ప్రతిఫలమును సిద్ధపరుస్తాడన్న విషయము మనకు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. కనుకనే, మనము ఆయనలో ఆనందించడము కొనసాగించుచున్నప్పుడు, ఆయన మన మీద తన దీవెనలను కుమ్మరిస్తాడు మరియు మనలను సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆకాశపు వాకిళ్లను తెరచుచున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, మనము భూమి మీద దేనిని విత్తుతామో, అది దేవుని సంకల్పమునకు అనుగుణంగా పంటను కోయుదుము. ప్రభువు మన కొరకు, ప్రస్తుతము జీవించుచున్న జీవితములోనూ మరియు పరలోకములోనూ సమృద్ధిగల ఆశీర్వాదములను సిద్ధపరచియుంచాడు. అయితే, మనము ఆయనయందు విశ్వాసముతోను మరియు విధేయతతోను స్పందించవలెను. మనము ప్రభువునందు ఆనందించినప్పుడు, బాధల మధ్యలో కూడా ఆయన రక్షించే శక్తిని అనుభవించగలము. నా ప్రియులారా, గొప్ప రాజు మనలో నివసించుచున్నాడని గుర్తించి, మన పేర్లు పరలోకంలో వ్రాయబడియున్నవని ఎరిగి పవిత్రమైన జీవితమును గడిపినప్పుడు, ఆయన మన కొరకు సిద్ధపరచిన గొప్ప ప్రతిఫలమును పొందుకొనుట కొరకు మనము ఎదురుచూడవచ్చును. అంతేకాక, ఆయన పరలోకపు వాకిళ్లను తెరచి, తన ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తాడు.
నా ప్రియులారా, మనము ఈ ఆనందముతో జీవించడములో విఫలమైనట్లయితే, పరలోకపు వాకిళ్లు తెరచి ఉన్నప్పటికిని, మన అంతరాత్మ ఎండిపోయినట్లుగా అనిపించవచ్చును. కానీ, మనము దేవునియందు భయభక్తులు కలిగియుంటూ, పరిస్థితిలన్నిటిలోను యేసును సంతోషంగా వెంబడించుచూ జీవించినప్పుడు, మన దగ్గర ఎక్కువ ఉన్నను లేదా తక్కువ ఉన్నను సరే, ఇతరులు మనలను దీవించినను లేక శపించినను సరే, అలాగుననే, మనకు ప్రతిఫలము వెంటనే లభించినా లేదా అందుకొరకు మనము ఎదురు చూడవలసి వచ్చినను సరే, మనము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కదల్చబడకుండా స్థిరంగా ఉండగలము. అంతమాత్రమే కాదు, దుఃఖ సమయములలోనైనను, సరే, ఆనంద సమయముల్లోనైనను సరే, యేసు మన రక్షకుడని, ఆయన పరలోకములో మన కొరకు గొప్ప ఫలమును దాచియుంచాడని మనము ధైర్యముగా చెప్పగలము. నా ప్రియులారా, నేడు మన పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయనే నిశ్చయతతో మనము దేవుని యందు ఆనందించినప్పుడు, ప్రభువు మనకు సమృద్ధిగా సమకూరుస్తాడని మనము నమ్మవచ్చును. అందుకే బైబిల్ నుండి మలాకీ 3:10వ వచనములో చూచినట్లయితే, " నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడని చెప్పబడియున్నది. మనము ఎల్లప్పుడు ఆయన మంచితనము మీద నమ్మకమును కలిగియుందాము మరియు ఆయనకు నమ్మకస్థులుగా జీవించుదాము. మీరు ఆలాగున చేసినట్లయితే, మీరు ధన్యులు.
నా ప్రియులారా, బైబిల్ నుండి మత్తయి 5:11వ వచనములో చూచినట్లయితే, " నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు'' అని చెప్పబడినట్లుగానే, మనము ఆయన నిమిత్తము ప్రజలు మిమ్మును నిందించినప్పుడు, హింసించినప్పుడు మరియు మీపై అబద్ధపు నిందలు వేసి వివిధరకాలుగా చెడుగా మాట్లాడినప్పుడు కూడా మీరు ధన్యులు. కాబట్టి, ఎవరైనా మన మీద అబద్ధపు నిందలు వేసినప్పటికిని, మనము ప్రభువునందు ధన్యులమనే స్థిరమైన విశ్వాసమును కలిగియుండవలెను. నా ప్రియులారా, ఈ లోకములో మనము ఎటువంటివారిని చూడగలము? దుష్టులు, క్రమశిక్షణలేని వారు కొందరు ఉంటారు. అందుకే బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:2వ వచనములో చూచినట్లయితే, "అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' అని చెప్పబడినట్లుగానే, మూర్ఖులైన దుష్ట మనుష్యులను గురించి ప్రస్తావించబడినది; మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించి, కాపాడమని పౌలు ప్రార్థించాడు. కానీ, విశ్వాసము అందరికి లేదు. అయినప్పటికిని వారు యేసు నామమును ఉపయోగించుచూ, పైకి మాత్రము ఆయనయందు భక్తిగలవారివలె కనిపించారు. మనము బైబిల్లో యేసుక్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యూదావలె, వారు సమస్తమును డబ్బు కోసమే జరిగిస్తారు. వారు యేసును, ఆయన సేవకులను తిరస్కరించెదరు మరియు వారికి ద్రోహమును జరిగిస్తారు మరియు ఆర్థిక లాభము కొరకు అన్యాయముగా ప్రవర్తిస్తారు. కానీ, ప్రభువు తన పిల్లలకు తోడుగా నిలిచియున్నాడు. ఆయన మన రాజుగాను, మన ప్రేమగల, ఘనతగల తండ్రిగాను మనకు తనను తాను ప్రత్యక్షపరచుకొనియున్నాడు.
నా ప్రియ స్నేహితులారా, ఇక, అసూయతో నిండినవారు కూడా ఉంటారు. అందుకే బైబిల్ నుండి సామెతలు 27:4వ వచనములో చూచినట్లయితే, "క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది'' అని చెప్పబడినట్లుగానే, క్రోధము ఎదుట ఎవరు నిలువగలరు? అయితే, కోపము, అసూయ ఎదుట ఎవరు నిలువగలరు? ఈ లోకములో అసూయపడువారు కూడా అనేకులు ఎదురవుతారు. ఇందుకు యేసుక్రీస్తును ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ప్రజలలో ఆయనకు కలుగుచున్న ప్రభావమును చూసి ప్రధాన యాజకులు, మత నాయకులు అసూయ చెందారు. కానీ, అసూయతో వారు ఆయన మీద అబద్ధపు నిందలు మోపి, ఆయనను పిలాతుకు అప్పగించాడు. నేటి ప్రపంచంలో కూడా అటువంటి అసూయ, వ్యతిరేకత కొనసాగుతూనే ఉన్నవి. ఇక, అపవాది ప్రభావమునకు లోనైన వారు కొందరు ఉన్నారు. అందుకే బైబిల్ నుండి యోహాను 13:27వ వచనములో చూచినట్లయితే, "వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పెను.'' ఆలాగుననే, సాతాను యూదాలోనికి ప్రవేశించెను. అటువంటివారు దుష్టశక్తుల ప్రభావముతోనే ప్రవర్తిస్తుంటారు. వారు హత్యలు చేయడం, ఇతరుల గౌరవ ప్రతిష్టలను తీయడం, అబద్ధాలు ప్రచారం చేయడం వంటి చర్యలకు కూడా పాల్పడవచ్చును. యేసుకు ద్రోహము జరిగించి, ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిన యూదాను ఉదాహరణగా చూచియున్నాము. అవును, నా ప్రియులారా, దుష్టకార్యముల వలన కలుగు కష్టాలు, బాధలు, వేదనలు నేటికిని అనేకమంది ప్రజలను ప్రభావితం చేయుచున్నవి. ఇక, దోచుకొనువారి విషయమునకు వచ్చినట్లయితే, యూదాకు పేదల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని వాక్యము మనకు తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 12:6వ వచనములో చూచినట్లయితే, "వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను'' అని చెప్పబడినట్లుగానే, అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు, సామాజిక సేవ అనవసరమని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకూడదని వాదిస్తుంటారు. పేదవారికి ఏమీ ఇవ్వకూడదని, వారికి ఓదార్పు మాటలు కూడా అవసరం లేదని వారు భావిస్తుంటారు. అయితే, వారు ఎందుకు అలాగున ఆలోచిస్తారు? యూదాను ఉదాహరణగా తీసుకున్నట్లయితే, అతడు దొంగ కాబట్టి, వానికి పేదవారి పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. అతడు డబ్బు సంచిని ఉంచుకుని, అందులో దాచి ఉంచిన డబ్బును దొంగిలించియున్నాడు. తన సంరక్షణలో ఉంచిన డబ్బును దుర్వినియోగం చేశాడు. విచారకరంగా, ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇప్పటికిని కనబడుచున్నారు.
చివరిగా, బైబిల్ నుండి 2 తిమోతికి 3:2-5 వ వచనములలో చూచినట్లయితే, " ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము'' అని చెప్పబడినట్లుగానే, తమను తాము ప్రేమించుకునేవారు మరియు ధనాన్ని ప్రేమించేవారు కొందరు ఉన్నారు. వారు గొప్పలు చెప్పుకునేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు మరియు అపవిత్రులుగా ఉంటారు. అయితే, నా ప్రియులారా, వీటన్నింటికిని పరిష్కారం ఏమిటి? మీ ద్వారా మరియు నా ద్వారా ప్రజలపై తన ఆత్మను కుమ్మరించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:17వ వచనములో చూచినట్లయితే, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు '' అని చెప్పబడినట్లుగానే, ప్రజలు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, వారికి ఒక నూతన దర్శనం లభిస్తుంది మరియు వారి జీవితములు రూపాంతరపరచబడతాయి. వారి పాత పద్ధతులు గతించిపోతాయి, వారు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడతారు. దొంగతనాలు ఆగిపోతాయి; స్వార్థపరులు తమకున్న దానిని త్యాగము చేయుటకు నేర్చుకుని, ఇతరులకు ఆశీర్వాదకరముగా మారతారు. దుష్టశక్తుల ప్రభావంలో ఉన్నవారు దేవుని ఆత్మతో నింపబడతారు. అసూయతో నిండిపోయిన వారు ఇతరులను దీవించడం ప్రారంభిస్తారు మరియు ప్రతి ఒక్కరినీ ప్రేమతో పలకరిస్తారు. దుర్మార్గులు, క్రమశిక్షణ లేనివారు మరియు చెడు స్వభావం కలవారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెంది, తమ జీవితముల ద్వారా యేసును ప్రతిబింబించడం ప్రారంభిస్తారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, ప్రతి పరిస్థితిలోను, శ్రమ మరియు హింసల మధ్యలో కూడా, మేము నీయందు ఆనందించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, మా హృదయములను మార్చుము. ప్రభువా, మా నుండి అసూయ, స్వార్థం, అబద్ధం మరియు ప్రతి దురాశను నీ యొక్క ఆత్మ శక్తితో మా నుండి తొలగించుము. దేవా, మేము పరిశుద్ధమైన జీవితమును గడపడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు నీకు నమ్మకంగా ఉండటానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, ఆకాశపు వాకిళ్లు విప్పి, నీ సమృద్ధియైన ఆశీర్వాదములను మా మీద కుమ్మరించుము. దేవా, మా జీవితములు నీ ప్రేమను వెల్లడిపరస్తూ, నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


