నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 46:1వ వచనమును నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన యొక్క ఆపత్కాలములో మనకు సహాయము చేయవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, మనకందరికి ఏదో ఒక విధముగా, సహాయము అవసరమై ఉంటుంది. అంతమాత్రమే కాదు, మనము మందుల వైపు చూస్తాము. లేక మన స్నేహితుల వైపు మరియు కుటుంబికుల వైపు చూస్తుంటాము. ఇవన్నియు మనకు సహాయపడనప్పుడు, చివరిగా మనము ప్రభువు చెంతకు వెళ్తుంటాము. ఇది మానవ సహజమైన గుణముగా ఉంటుంది. అయితే, బైబిల్ గ్రంథములో మనము చూచినట్లయితే, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అని సెలవిచ్చుచున్నది. అవును, మనము అన్ని మార్గాలలో విఫలమైన తర్వాత, దేవుని వైపు తిరుగుతాము. కానీ, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి, మన సమస్యలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి, ఆయనే మనకు మొట్టమొదటి సహాయకుడుగా ఉండాలని బైబిల్ మనకు గుర్తుచేయుచున్నది.

బైబిల్ గ్రంథములో లూకా సువార్త 8వ అధ్యాయములో పండ్రెండు సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీని మనము చూడగలము. ఆమె తన యొక్క రక్తస్రావ బలహీనత కలిగిన స్త్రీ, వైద్యము కొరకు తన ధనమంతటిని ఖర్చుపెట్టినది. మందులు, వైద్యము అవన్నియు కూడా ఆమెకు ఏ సహాయము చేయలేకపోయినవి. చివరికి, వైద్యము కానీ, మందులు కానీ, ఆమెకు సహాయపడలేనప్పుడు, ఆమె యేసయ్యను వెంబడించినది. యేసయ్యా, నడుస్తూ వెళ్లుచున్నప్పుడు, ఆయన చుట్టూ, ఎంతో జనసమూహములు గుంపుగా చేరి, ఆయన మీద పడుచుండిరి. అయితే, ఈ స్త్రీ యేసయ్య వెనుకకు వెళ్లి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొనియున్నది. వెంటనే ఆమె స్వస్థతను నొందినదని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. వెంటనే, దేవుని ప్రభావము ఆమె శరీరంలోనికి ప్రవహించినది వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపో యెను. ఆమెకు కలిగిన ఆ అద్భుతం స్వస్థత ద్వారా కాకుండా, యేసుక్రీస్తు యందు ఉంచిన విశ్వాసము ద్వారా ఇదంతయు జరిగినది.

అవును, నా ప్రియ స్నేహితులారా, మనము ప్రభువు వైపు చూచినప్పుడు, ఆయన వెంటనే, మనకు సహాయము చేస్తాడు. ఆయన మనలను స్వస్థపరుస్తాడు. మన కష్టాల మధ్యలో మనకు ఒక నిరీక్షణ కలదు. కనుకనే, మీరు కూడా ఈ స్త్రీ వలె ప్రభువును విశ్వసించుచున్నారా? ప్రభువుతో మీరు ఒక మంచి సంబంధమును కలిగియుంటున్నారా? ప్రియులారా, ఆయన లేకుండా మీరు ఒంటరి భావనను మాత్రమే కలిగియుంటారు. కనుకనే, ఎల్లప్పుడు, మీరు ఆయనను కలిగియున్నప్పుడు, నిశ్చయముగా, ఆయన మీరు నమ్ముకొనదగిన సహాయకుడుగా మీతో కూడా ఎల్లప్పుడు ఉంటాడు.

నా ప్రియులారా, ఈ లేఖనము సెలవిచ్చుచున్నది, ' దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు,' అనగా, ఆయన మనకు రక్షణను, కాపుదలను అనుగ్రహిస్తాడు. 'ఆపత్కాల సమయములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు గా ఉంటాడు' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుకనే, ఆయన మనలను ఎన్నడును విడువడు మరియు ఎడబాయడు అని ఆయన మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 43:2వ వచనములో మనము అదే చూడగలుగుతాము. ఆ వచనము, " నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు'' అని చెప్పబడినట్లుగానే, జలములలో బడి వెళ్లినప్పుడు, ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. నదుల మధ్యలో నుండి మనము నడిచినప్పుడు, అవి మనలను ఎంతమాత్రము ముంచజాలవు. అగ్నిమధ్యలో నుండి మీరు వెళ్లినను కూడా ఆ అగ్ని మిమ్మును కాల్చజాలవు. ఎందుకు? కష్ట సమయములలో కూడా ప్రభువు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. కొన్నిసార్లు కష్టాలు మన జీవితములోనికి రావడానికి ప్రభువు అనుమతిస్తుంటాడు. ఎందుకో తెలుసా? ప్రభువు మనకు అతి సమీపములో ఉన్నాడని మనము తెలుసుకొనుట కొరకు మాత్రమే. అవును ప్రభువు మన ఆశ్రయ దుర్గమై యున్నాడు.

నా ప్రియులారా, ఈ వచనములోనికి తరువాతి భాగములో మనము చూచినట్లయితే, ప్రభువు మనకు బలమై యున్నాడు. మనము ఎప్పుడైనను, బలహీనతను, చింతను అనుభవిస్తున్నప్పుడు, మన యొక్క బలహీనతలో ప్రభువు యొక్క శక్తి మనలను బలపరుస్తుంది. ఆ కష్టాలను మరియు శ్రమలను భరించుచూ, ఎదుర్కొనగలిగే శక్తిని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. మనము అత్యధికమైన విజయమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 13:6వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము'' అని భక్తుడు అదే అంటున్నాడు. అవును, నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువే మీకు సహాయకుడుగా ఉంటాడు. ఆయన మీకు కేడెముగా ఉంటాడు. కనుకనే, మనము ఆయన వైపు చూచినప్పుడు, ప్రభువు మనకు సహాయకుడుగా ఉండి, మనలను నడిపిస్తాడు.

నా ప్రియులారా, ఈ రోజు, మీరు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తును గురించిన భయము లేదా మానసిక వేదన వంటి ఏ సవాలును ఎదుర్కొంటున్నప్పటికిని, దేవుని సన్నిధికి పరుగెత్తండి. ప్రభువు నామము బలమైన దుర్గము; నీతిమంతులు దానిలోనికి పరుగెత్తి సురక్షితంగా నివసించెదరు. ఆయనను సంపూర్ణంగా నమ్మినప్పుడు ప్రతి కష్టంలోనూ ఆయనే మీకు ఆశ్రయము, బలము మరియు ఆపత్కాలములో ప్రభువు ఎల్లప్పుడు మీకు తోడుగాను, సహాయకుడుగాను ఉండి మిమ్మును నడిపించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ప్రతి కష్టకాలంలో మాకు ఆశ్రయంగాను, మా బలముగాను మరియు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, నీవు మాకు సహాయకుడుగా ఉంటావని నీవు ఎంతో స్పష్టముగా చెప్పియున్నందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపడము వలన నీవు మాకు సహాయము చేస్తావని మేము నమ్ముచున్నాము. తండ్రీ, పరిశుద్ధాత్మ శక్తిని మాలోపల కలిగియుండడము మాకు ఎంత సహాయముగా ఉండునట్లుగా చేయుము. దేవా, మేము సహాయము కొరకు ఎడముకు కానీ, కుడికిగాని తిరగకుండా, ఎల్లప్పుడు నీ వైపు చూచునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క శక్తిచేత మా బలహీనతలలో నీవు మమ్మును బలపరచునట్లుగా నీ శక్తి మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మేము నీకు అతి సమీపముగాను ఉండుటకును, నిన్ను ప్రేమించుటకును మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, ఏ కష్టము, శ్రమయు మమ్మును తాకకుండా ఉండునట్లుగాను, మా యొక్క భవిష్యత్తును గురించిన భయములన్నిటిలో నుండి మేము విడుదల పొందునట్లుగా నీ యందు నిరీక్షణ కలిగియుండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా యొక్క అపత్కాలములో నీవు మాకు సహాయకుడవు అని మేము సాక్ష్యము చెప్పునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా జీవితములను అందమైన విధములో నిర్మించునట్లుగాను, నీ మంచితనమును మాకు కనుపరచుము. ప్రభువా, మనుష్యుల సహాయముకంటే నిన్ను అత్యధికముగా నమ్మునట్లుగాను, ఎటువంటి స్థితిలోను నీ సన్నిధిని వెదకునట్లుగా మాకు కృపనిమ్ము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును బలపరచి, భయము లేకుండా ప్రతి సవాలును ఎదుర్కొనే ధైర్యమును మాకు దయచేయుము. దేవా, నీవు మాకు కేడెముగా ఉంటూ, ప్రతి కీడు నుండి మమ్మును, మా కుటుంబమును తప్పించుము. ప్రభువా, మా యొక్క ప్రతి శోధనలో మమ్మును సురక్షితంగా నడిపించి, నీ శాంతి మా హృదయములను ఏలునట్లుగా చేయుము. దేవా, అనుదినము మేము నీకు మరింత దగ్గరగా చేరుటకును, నీ శాశ్వతమైన ప్రేమ, కృప, మరియు అద్భుతమైన శక్తిని అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.