నా ప్రియమైన స్నేహతులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 84:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు'' ప్రకారము ప్రభువునందు బలమును కనుగొన్నవారు, ఎంతగానో ఆశీర్వదింపబడినవారు అని మరొక అనువాదములో వాక్యము సెలవిచ్చుచున్నది. అనగా, ప్రభువునందు బలము నొందుకున్నవారు ప్రభువునందు ఎంతగానో వర్థిల్లుతారు అని అర్థము. మనకు బలం ప్రభువు నుండి వచ్చినప్పుడు, మనం నిజంగా ఆత్మలో సమృద్ధిని పొందుకుంటాము. పరిస్థితుల వలన మనం కదిలించబడము, ఎందుకంటే మన బలం మానవ శక్తిపై కాదు, దైవీక కృపపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత వచనములో చూచినట్లయితే, కీర్తనలు 84:6లో, "వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును'' ప్రకారము దేవుని వలన మనము బలమును పొందుకొనగలమని స్పష్టముగా తెలియజేయబడుచున్నది. ప్రభువుపై నమ్మకం ఉంచేవారు తమ అంధకారములో కూడా ఆశీర్వాదాలను అనుభవిస్తారు. వారు కన్నీటి లోయ గుండా వెళ్ళినప్పుడు కూడా, దానిని నీటి బుగ్గల ప్రదేశంగా, ఆకాశము నుండి వచ్చే తొలకరి వర్షంతో నిండిన ఆశీర్వాదపు జలమయముగా మారుస్తాడని పై వచనము తెలియజేయుచున్నది. కానీ, ఇతరులు కేవలము వేదన, బాధను మాత్రమే ఎదుర్కొందురు. వీరికైతే, ప్రభువు దీవెనలతో నిండినటువంటి తొలకరి వానను కురిపిస్తాడు. ప్రభువు యొద్ద నుండి సమృద్ధిని వీరు కలిగియుందురు. అట్టివారు నానాటికి ప్రభువు యొద్ద నుండి బలమును పొంది, ప్రభువు కృపను పొందుకుంటారు. ఆలాగుననే, కీర్తనలు 84:7వ వచనములో చూచినట్లయితే, "వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును'' అని వ్రాయబడియున్నది.

ఆలాగుననే, నా ప్రియులారా, ఒక విత్తనముపైన సూర్యుడు ప్రకాశించినప్పుడు, అది మొలకెత్తి పైకి ఎదుగుతుంది. నెమ్మదిగా ఆ భూమి లోపల నుంచి పైకి వచ్చి ఎదుగుతుంది. అదేవిధముగా, దేవుని కృప చేత నింపబడిన హృదయము పరలోకపు తట్టు పైకి ఎదుగుతుంది. దేవుని యొక్క సంపూర్ణతలో నుండి ఆయన యొక్క సమృద్ధియైన కృపా సత్యములు వెలువడుతాయి. యోహాను 1:16లో చెప్పబడినట్లుగానే, తద్వారా మనమందరము కృప వెంబడి కృపను మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదములను పొందుకొనుచున్నాము. దయ వెంబడి దయను మరియు వరముల వెంబడి వరములను పొందుకొనుచున్నాము. ప్రభువునందు మనము బలము నొందినప్పుడు, ప్రభువు మనలను ఎంతగా ఆయన దీవెనలతో నింపుతాడు కదా! అందుకే బైబిల్ నుండి మత్తయి 13:12వ వచనములో చూచినట్లయితే, "కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసి వేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు'' అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఎవరైతే, అధికముగా కలిగి ఉంటారో, వారికి ఇంకను ఇవ్వబడును. వారు సమృద్ధి కలిగియుందురు. కాబట్టి, మనము దేవుని యందు సమృద్ధి కలిగినవారముగా ఉండాలి. ప్రభువు మీకు ఎంపిక చేసుకొనే అవకాశమును ఇచ్చియున్నాడు. కాబట్టి, ప్రభువు యొద్ద నుండి బలమును కనుగొనండి. ఏ మనుష్యునిపైనను ఎన్నడును ఆధారపడకండి. పైకి ఎదగడానికి కష్టపడి కృషి చేయుచూ, పని చేయండి. ప్రభువు మాత్రమే మనలను బలపరచగలుగుతాడు.

అందుకనే, అపొస్తలుడైన పౌలు భక్తుడు, ఫిలిప్పీయులకు 3:14వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, "క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను'' ప్రకారం ఆ యొక్క బహుమానము పొందవలెనని కష్టపడి పనిచేయండి. పైకి ఎదగడానికి ఎంతగానో కృషి చేయండి. మీ జీవితములో ఎదురై ఏ సమస్య కూడా మిమ్ముల్ని శ్రమపెట్టలేదు, మిమ్మల్ని అణగద్రొక్కలేదు. మీరు పైకి మాత్రమే ఎదుగుచుంటారు. మీరు బలము వెంబడి బలమును పొందుకుంటారు. నేడు మనము ప్రార్థన చేయుచూ ప్రభువునందు అటువంటి బలమును పొందుకుందాము. నా ప్రియులారా, రాబోవు దినములలో ప్రభువు మీకు తోడై ఉండి, మిమ్మును తన బలముతో నింపును గాక. ఇంకను ప్రభువు బలము వెంబడి బలమును మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీవు మాత్రమే మాకు బలమును ఇవ్వగలవు. దేవా, మా జీవితములో వేదన, కష్టములతో శ్రమపడుచున్నాము మరియు నేడు మేము ఎదుర్కొంటున్న కష్టముల వలన మేము కన్నీరు విడుచున్నాము, నీ ఆశీర్వాదములతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క సమృద్ధియైన దీవెనలు మా మీద కుమ్మరించుము. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మతో మరియు నీ సన్నిధానముతో మమ్మును నింపి, తద్వారా, నీ యందు ఆనందమును మేము కనుగొనునట్లుగా కృపను చూపుము. ప్రభువా, నీ ఆత్మ ద్వారా మా యొక్క అడ్డంకులన్నిటి కొట్టివేసి, మాలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామమున మా నుండి ఇప్పుడే తొలగించుము. దేవా, ఇక ఎన్నటికిని మేము ఓటమిలను ఎదుర్కొనకుండా, మమ్మును బలపరచి, మాకు విజయమును దయచేయుము. యేసయ్యా, మా జీవితములో నష్టాలు ఇక వద్దు, వేదన లేకుండా చేసి, ఆనంద భాష్పములతో మరియు మా నోటిని నవ్వుతోను, ఆనందముతోను నింపుము. దేవా, నీ యందు మేము బలము నొందినవారమని ఎల్లప్పుడు భావించునట్లుగా చేయుము. ప్రభువైన యేసూ, నీవే మా బలానికి ఏకైక ఆధారం. దేవా, ఈ రోజు మా బలహీన హృదయాన్ని నీ శక్తివంతమైన బలముతో నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి ఎండిన చోట నీ యొక్క సమృద్ధి వర్షమును కురిపించుము. దేవా, నీ సమాధానముతో మా హృదయాన్ని నింపి, మేము పైకి ఎదగలేకుండా అడ్డుకునే ప్రతి సంకెళ్లను బ్రద్ధలు చేయుము. యేసయ్యా, మా బలహీనతను దైవీక బలం మరియు విశ్వాసంతో నింపుము. దేవా, ఈ రోజు నుండి విజయం మా భాగంగా ఉండునట్లుగాను, వైఫల్యం ఇక ఎన్నటికిని ఉండకుండా చేయుము. ప్రభువా, ఆకాశపు వాకిళ్లు తెరిచి, కృప వెంబడి కృపను, వరముల వెంబడి వరములను కుమ్మరించుము. ఓ ప్రభువా, మమ్మును నీలో బలపరచి, ప్రతిరోజూ మేము పైకి ఎదగడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.