నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములను తెలియజేయడములో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మిమ్మును లేవనెత్తుతాడు. పరలోకమందున్న ఆయనతో కూడా మిమ్మును కూర్చుండబెడతాడు. ఈ వచనమును చదివినప్పుడు, 2 సమూయేలు గ్రంథములో నుండి ఒక సంఘటన నాకు జ్ఞాపకమునకు వచ్చినది. దావీదు భక్తుడు రాజుగా ఉన్నప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు అతని యొద్దకు వచ్చెను. ఆ కాలములో పాత రోజులలో ఏ దేశములోనైనను నూతనంగా ఒక రాజు వచ్చినట్లయితే, ముందు ఉన్న రాజు యొక్క సంతానమంతటిని సంహరించి, అతని యొక్క సింహాసనమునకు ఎటువంటి అపాయమును రాకుండా చేస్తారు. ఆలాగుననే, మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చినప్పుడు, వంగి నమస్కరించెను. అతనిని సంహరించాలన్న ఆలోచనను ప్రక్కన బెట్టి, దావీదు యోనాతానును బట్టి, మెఫీబోషెతుకు కనికరము చూపెట్టెను. మీ తాతయైనటువంటి సౌలునకు సంబంధించిన భూములన్నిటిని కూడా నీకు మరల అప్పగిస్తాను అని చెప్పాడు. నీవు ఎల్లప్పుడు నా బల్ల యొద్ద కూర్చుండెదవు అని చెప్పెను.

మెఫీబోషెతు ముందున్న రాజు యొక్క సంబంధికుడు కాబట్టి, ఒకవేళ భయపడి, ఉండవచ్చును. నా జీవితము అపాయములో ఉన్నది. నేను ఎలాగున నూతనంగా ఏర్పడిన రాజును సమీపించగలను? అతను నన్ను ఏమి చేస్తాడు? అని తలంచుకొనుచుండెను. అయితే, దావీదు అతనికి కనికరమును చూపెట్టెను. వారి తాతలకు సంబంధించిన భూములన్నిటిని అతనికి తిరిగి అప్పగించెను. కారణము, యోనాతాను మీద ఉన్న ప్రేమ మరియు స్నేహమును బట్టి, అతని పట్ల కనికరమును కనుపరచియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ పట్ల కనికరమును కలిగియున్నాడు. నేను పాపముతో నిండియున్నాను, నేను అనేకమైన తప్పులను చేసియున్నాను, నేను ప్రభువు యొద్దకు ఎలాగున రాగలను? అని అనుకుంటున్నారా? నా జీవితమునకు ఏమి జరగబోవుచున్నదని భయపడుచున్నారా? అయితే, ప్రభువు, కనికరమును మన యెడల చూపించుచున్నాడు. తన సిలువ రక్తము ద్వారా మిమ్మును కొనియున్నాడు. కనుకనే, దేవుడు మీ యెడల కనికరమును చూపుచున్నాడు. తన కృపను బట్టి, మీ పాపపు జీవితములో నుండి మిమ్మును పైకిలేవనెత్తుచున్నాడు.

నా ప్రియులారా, మీరు పశ్చాత్తాపపడి ప్రభువు యెదుట మీ పాపములను ఒప్పుకున్నట్లయితే, ఆయన మీ పట్ల తన కృపను చూపుతాడు, తన దయను మీ యెడల కనుపరుస్తాడు. మీ పాత జీవితము నుండి మిమ్మును లేవనెత్తుతాడు. నూతన ఆరంభమును మీకు మరల అనుగ్రహిస్తాడు. పరలోకమందు మిమ్మును ఆయనతో పాటు కూర్చుండబెడతాడు. నా పాపమును బట్టి, ఈ రోజు నేను ఏమి కానివాడనుగా ఉన్నాను, అందరు నన్ను త్రోసివేసియున్నారు. నా తండ్రి యొద్దకు వెళ్లినట్లయితే, ఆయన నన్ను చేర్చుకుంటాడా? అని అంటున్నారా? ఈ రోజు తండ్రియైన దేవుడు మీ పట్ల కృపను, దయను కనుపరుస్తాడు. మిమ్మల్ని గోతి నుండి పైకి లేవనెత్తుతాడు. తనతో పాటు కూర్చుండబెడతాడు. ఆయన బల్ల యొద్ద మీకు ఎల్లప్పుడు స్థానము ఉంటుంది. కాబట్టి, ధైర్యము వహించండి నా ప్రియ స్నేహితులారా. ఈ రోజు నూతన ప్రారంభము మీ కొరకు వేచియున్నది. ఇప్పుడే అటువంటి కృపను పొందుకుందామా? ఆలాగైతే, మీ జీవితాన్ని దేవుని హస్తములకు అప్పగించినట్లయితే, నిశ్చయముగా, ఆయన నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా మీద నీవు కనికరము చూపుచున్నందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ రక్తముచేత మమ్మును కొనియున్నందుకై మరియు నీ జనముగా మమ్మును చేసియున్నందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా పాపపు జీవితమునుబట్టి, మరియు మా పాత మార్గములను బట్టి, పశ్చాత్తాపముతో ఒప్పుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, నీ రక్తముతో మమ్మును కడిగి, మమ్మును లేవనెత్తి, నీతో పాటు కూర్చుండబెట్టుము, పరలోక స్థలములలో, ఏ మనుష్యుడు అందజాలనటువంటి మరియు ఎవ్వరు ఆపజాలనటువంటి స్థలములో మమ్మును కూర్చుండబెట్టుము.ప్రియ ప్రభువా, మా బలహీనతలలో కూడా మమ్మును నీ యొద్దకు చేర్చు కనికరము కొరకై నీకు వందనాలు. మేము అనర్హులమని, భయపడతామని భావించినప్పుడు, ప్రభువా, నీవు మమ్మును నీ దగ్గరకు పిలిచావని మాకు జ్ఞాపకం చేయుము. యేసయ్యా, మేము పశ్చాత్తాపపడి నీ మార్గాలలో నడవడానికి మాకు కృపను దయచేయుము. దేవా, కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇచ్చి, మమ్మును నూతనపరచుము. ప్రభువా, మా జీవితం నీ దయను, ప్రేమను ప్రతిబింబించునట్లుగా చేయుము. దేవా, మమ్మును ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉంచుము. ప్రభువా, నీ ప్రేమ నుండి ఎవ్వరు వేరుపరచనంతగా మమ్మును నీ ప్రేమతో మేము వేరునట్లుగా చేయుము. దేవా, ఈ రోజు మా పట్ల నీ కృపను, కనికరమును చూపించి, మమ్మును పరిశుద్ధపరచి, మేము పైకి లేవనెత్తబడుటకు నీ బలమును మాకు దయచేయుము. దేవా, మేము మా యొక్క ప్రతి పాపమును అధిగమించుటకు నీవు అట్టి కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఈ రోజు మమ్మును నూతనపరచి, నూతన ప్రారంభములతో మమ్మును దీవించి, ఘనపరచుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.