నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 142:3వ వచనమును తీసుకొనబడినది. ఇది నేడు మన కొరకు ఇవ్వబడిన దేవుని వాగ్దానం. ఆ వచనము, "నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును...'' అని చెప్పబడినట్లుగానే, మనము అనేకసార్లు మన హృదయము, ఈ లోక శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు, మన ఆత్మ బలహీనపడినప్పుడు, మన ప్రాణము మనలో క్రుంగిపోవుతుంది. అటువంటి సమయములో దేవుడు మనలను బలపరచడానికి మరియు తిరిగి మనలను తన సేవలోనికి నడిపించడానికి ఆయన మన మార్గాన్ని గమనించుచున్నాడు. కనుకనే, ప్రభువైన యేసును చూచినట్లయితే, ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుచున్నప్పుడు, ఆయన సిలువలో వ్రేలాడదీయ్యబడడానికి ముందు, అది చివరి గడియ. ఆయన తన ఆత్మలో కృంగిపోయినట్లుగాను, ఎంతో భయంతోను మరియు ఆందోళనతోను నిండియున్నట్లుగా మనము చూడగలము. ఎందుకనగా, మానవాళి రక్షణ కొరకు సిలువపై తాను అనుభవించవలసిన యాతనను గురించి ఆయన ఆందోళన చెందెనని మనకు స్పష్టముగా లేఖనములు తెలియజేయుచున్నవి. తద్వారా, తాను పొందబోవుచున్న మరణము తలంచిన భయం ఆయన ప్రాణమును ఆవరించినది. తద్వారా, ఆయన ఎంతో భారముగాను, నిరుత్సాముగాను, బలహీనంగాను తలంచెను. కనుకనే, ఆయన దుఃఖపడుటకును చింతా క్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; కనుకనే, ఆయన చెమట రక్తపు బిందువుల వలె కారినది. అయితే, ఆయన తండ్రికి విధేయత చూపుతూ, కొంత దూరము వెళ్లి, సాగిలపడి "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.'' అప్పుడు సాతాను, 'ఇక ఆయన సిలువకు ఎన్నటికిని వెళ్ళలేడు. ఆయనలో ఒక భయం అలుముకున్నది' అని చెబుతూ ఆనందంతో గంతులు వేసినట్లుగా, నా తండ్రి కీర్తిశేషులైన దినకరన్‌గారు ఈ దృశ్యాన్ని ఒక దర్శనంలో చూశారు.

అయితే, ఆ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయనే మన కష్టాలన్నింటిలోనూ మరియు బాధలన్నిటిలోను మనకు ఆదరణను దయచేయగలడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:26వ వచనములో చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు; ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన బలహీనతలలో మనకు సహాయం చేయగల పరిశుద్ధాత్మ శక్తి, ప్రభువైన యేసు మీదికి దిగివచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు యేసునకు రాబోవు సంగతులను బయలుపరచి, ఆయనతో ఇలాగున తెలియజేసెను, 'ప్రభువైన యేసూ, నీవు దేవుని చిత్తాన్ని నమ్మకంతో అంగీకరించి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినట్లయితే, తండ్రి నీకు గొప్ప నామాన్ని, ప్రతి నామముకంటె పై నామమును నీకు అనుగ్రహించును. నీవే జీవమును, పునరుత్థానము. కనుకనే, నీవు సజీవముగా తిరిగి లేస్తావు' అని పరిశుద్ధాత్మ ఆయనకు మార్గం చూపి, ఆయనను ఓదార్చినప్పుడు, ప్రభువైన యేసు తన నిరుత్సాహము నుండి మరియు బలహీనపడిన సమయంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డాడు. అప్పుడు ఆయన, 'తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యముకాని యెడల, నీ చిత్తమే సిద్ధించు గాక' అని ప్రార్థించాడు. ఆ తర్వాత ఆయన లేచి నిలబడి, తనను అప్పగించబోవుచున్న కార్యమును ధైర్యముగా ఎదుర్కొన్నాడు. తనపై దోషారోపణలు చేసిన ప్రధాన యాజకులను ఎదుర్కొన్నాడు మరియు తనకు మరణశిక్ష విధించిన పిలాతును కూడా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆయన మరి దేనికిని భయపడలేదు. ఇంకను ఆయన సిలువను భరించెను. ఆలాగుననే, రోమా సైనికుల యొక్క కొరడా దెబ్బలను కూడా భరించాడు మరియు మేకుల బాధను కూడా సహించాడు.

చివరిగా ఆయన ఇలాగన తెలియజేసెను, 'సర్వశక్తిగల దేవా, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. నా ప్రజల కోసం నేను నా రక్తాన్ని చిందించియున్నాను. నేను చేసిన ఈ త్యాగాన్ని అంగీకరించి, దానిని పొందుకున్న ప్రతి ఒక్కరూ నా రక్తము ద్వారా కడుగబడి పాపం నుండి రక్షింపబడతారు. ఆయన, లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పి,'తన ప్రాణమును అప్పగించి, మూడవ రోజున తిరిగి లేచాడు. నేటికిని ఆయన సజీవుడు! అందుకే, "నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును...'' అని చెప్పినట్లుగానే, బైబిల్ నుండి యెషయా 40:29-31వ వచనములలో చూచినట్లయితే, " సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ఈ రోజు కూడా, దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని, ' దేవా, నీ చిత్తం మా జీవితములో నెరవేరును గాక' అని చెప్పినట్లయితే, నేడు మీ యొక్క ప్రతి అణచివేత, శ్రమ మరియు శోధనను ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అంతమాత్రమే కాదు, మీరు అన్నిటికంటెను అత్యధికమైన విజయమును పొందినవారుగా ఉంటారు. ఆలాగుననే, దేవుడు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చి, మీ ద్వారా లక్షలాది మందికి రక్షణను అందించువారుగా మార్చబడతారు. యేసు నామంలో ఈ కృప ఇప్పుడే మీ మీదికి దిగి వచ్చును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ఆదరణకర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానం ద్వారా మమ్మును ప్రోత్సహించినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, "మాలో మా ప్రాణము క్రుంగియున్నప్పుడు మా మార్గము నీకు తెలియునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, సొమ్మసిల్లిన మాకు నీ యొక్క బలమును ఇచ్చి, నీవే శక్తిహీనులైన మాకు బలాభివృద్ధి కలుగజేయుము. దేవా, మేము నీ కొరకు ఎదురు చూచు వారముగాను, తద్వారా, నూతన బలము పొందుకొని, పక్షిరాజులవలె రెక్కలు చాపి మేము పైకి ఎగురునట్లుగాను, అలయక పరుగెత్తునట్లుగాను మరియు సొమ్మసిల్లక నడిచిపోవునట్లుగాను మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో బలపరచుము. ప్రభువా, మా ఆత్మ బలహీనమైనప్పుడు, మా మార్గాన్ని ఎరిగిన నీవు మా మార్గమును కాపాడుము. దేవా, మాలో ఉన్న భయం మరియు బలహీనత క్షణాల్లో మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిచేత బలపరచుము. ప్రభువా, నీ చిత్తానికి మేము సంపూర్ణంగా విధేయత చూపడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా పరిస్థితులపై పక్షిరాజులవలె రెక్కలు చాపి మేము పైకి ఎగరడానికి మాకు తగిన బలమును పునరుద్ధరించుము మరియు ధైర్యం మరియు విశ్వాసంతో ప్రతి శోధనను ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితంలో నీ చిత్తం నెరవేరునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.