నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడంలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. మరియు ఈ రోజు మా సహోదరి షారోన్ ఏంజల్ జన్మదినమును మీతో కలిసి జరుపుకోవడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆమె మన కుటుంబము పట్ల ఎంతగానో జాగ్రత్త వహించును. మా కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమతోను మరియు శ్రద్ధగా పరామర్శిస్తుంటుంది. ఈ ప్రత్యేక దినమున, ఆమెను మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం కొనసాగించండి. నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 60:12 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే'' అని చెప్పబడిన ప్రకారము జయశీలుడైన ప్రభువుగా ఆయన మనకు ముందుగా వెళ్లుచున్నాడు; మనకంటే అత్యధికముగా, మనం చేయుచున్న కార్యములలో మనకు విజయాన్ని అనుగ్రహించాలనే ఉత్సాహము మరియు పట్టుదల ఆయన మన పట్ల కలిగియున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, నేడు మీ యెదుట ఒక గొప్ప సవాలు ఉండవచ్చును, చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్టు మీ ముందు ఉండవచ్చును, పరిష్కరించవలసిన ఒక పెద్ద కేసు ఉండవచ్చును లేదా మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి నప్పటికి ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో పనిచేయుచూ ఉండవచ్చును. ఇది అసాధ్యమని భావించుచూ, మీరు మీ తలను పట్టుకుని ఆలోచించూ ఉండవచ్చును. కానీ నా స్నేహితులారా, దేవుని సహాయంతో ఎంతటి గొప్ప కార్యమైనను మనం విజయం సాధించగలము. అంతమాత్రమే కాదు, ఆయన మన యెదుట ఉన్న పరిస్థితిని అణచివేసి, మనకు విజయమును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే, ఆయన ఇప్పటికే మనకంటే ముందుగా వెళ్లుచూ, మన పక్షమున పోరాడి, మన శత్రువులను అణగద్రొక్కి, ఆయన మనకు విజయమును దయచేయుచున్నాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి. ధైర్యంగా ముందుకు కొనసాగండి. దేవుడు మీకు ముందుగా వెళ్లుచూ, మిమ్మును నడిపిస్తాడు.

ఆ దినములలో అమెరికాలో ఆఫ్రికన్ బాలులను బానిసలుగా చెరపట్టుకొని వెళ్లేవారు. అయితే, అమెరికాలో ఒక చిన్న ఆఫ్రికన్ బాలుడు ఉండేవాడు. ఒకరోజు రాత్రి, తాను బానిసత్వములో ఉన్నాడన్న తన పరిస్థితికి విసిగిపోయి, గదిలో కూర్చుని, అతను ఎంతో భారముతో ప్రార్థించుచూ ఇలాగున అన్నాడు, ' దేవా, ఈ పరిస్థితి మధ్యలో కూడా, నా యొక్క ఈ జీవితంలో కూడా, నన్ను ఒక గొప్పవానిగా చేయగలవా? ఈ బానిస్వతము నుండి నన్ను పైకి లేవనెత్తగలవా? నేను ఇకపై బానిసగా ఉండాలనుకోవడం లేదు' అని ఎంతో దుఃఖముతో దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టాడు. అయితే, ఆ రాత్రి, దేవుడు ఆ పిల్లవానికి ఒక అద్భుతమైన కల కనునట్లుగా చేశాడు. ఆ కలలో ఒక చిన్న వేరుశెనగలో దాగి ఉన్న రహస్యాలన్నిటిని బయలుపరచాడు. ఆ పిల్లవాడు మొక్కలతో కలిసి పనిచేయడానికి ఎంతో ఇష్టపడేవాడు మరియు దేవుడు అతనికి చూపించిన కలతో అతను అనుసంధానం చేసుకోగలిగాడు. తరువాత, అతను తన ఆవిష్కరణలను ఒక శాస్త్రీయ సమావేశంలో ప్రదర్శించాడు మరియు అమెరికా దేశానికి చెందిన వారు అది చూచి ఎంతగానో ఆశ్చర్యపోయారు. వారు అతనిని 'వేరుశెనగల రాజు' 'ఫీనెట్ కింగ్' అని పిలిచారు. అవును, నా ప్రియులారా, నేడు దేవుడు మనలను కూడా అద్భుతమైన రీతిలో ఉన్నత స్థితికి తీసుకొనివెళ్లగలడు. 'కొద్ది' దానితో, 'తక్కువ' దానితో కూడా దేవుడు గొప్పదానిని సృష్టించగలడు మరియు ఆయన అలాంటి జ్ఞానమును దేవుడు నేడు మీకు కూడా బయలుపరచును గాక. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు ఎన్నికలేని మిమ్మును గొప్పవారినిగా చేయగలడు. కనుకనే, భయపడకండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఉన్నత స్థితికి హెచ్చించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, జయశీలుడవుగాను, విజయవంతమైన ప్రభువుగాను మాకు ముందుగా వెళ్లుచున్నందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము చేయవలసిన ప్రతి సవాలు మరియు ప్రతి నిర్ణయం, వాటన్నింటిని నీ యొక్క బలమైన హస్తములలోనికి అప్పగించుచున్నాము. దేవా, మేము అసాధ్యము అనుకొనుచున్న ప్రతి స్థలములోను, నీ యొక్క విజయం తలెత్తునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, మాకు ముందుగా ఉన్న ప్రతి ఆటంకములను అణిచివేసి, మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, సరిహద్ధులను దాటి మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, మేము కలిగియున్న చిన్నదానిని గొప్పవాటికి ఉపయోగించుకొనునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మేము నిన్ను మా పూర్ణ హృదయముతో నమ్మునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.