నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 1:12వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.'' ఆ ప్రకారముగానే ఇక్కడ సొలొమోను రాజుకు దేవుడు దర్శనమందు కనబడి, "నీకు ఏమి కావాలి అని అడిగియున్నాడు?'' అందుకు, సొలొమోను జ్ఞానమును కోరుకొనియున్నాడు. కనుకనే, దేవుడు పై చెప్పబడిన విధముగానే, అతనికి వాగ్దానము చేసియున్నాడు. ఆలాగుననే, దేవుడు అతనికి జ్ఞానమును తెలివియు, ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇచ్చియున్నాడు. ఇకముందుకు రాబోవు రాజులకు కూడా అటువంటి ఐశ్వర్యమును కలిగి ఉండరు. అవును, ప్రభువు సొలొమోనును బట్టి ఎంతగానో ఆనందించియున్నాడు కదా!
నా ప్రియులారా, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నాము కదా! సొలొమోను రాజు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి లాభము కొరకు ఏదియును కోరలేదు. కానీ, ప్రభువు అతనికి ఆశీర్వాదములన్నిటిని అనుగ్రహించియున్నాడు. ప్రభువు, అతనికి ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా ఇచ్చియున్నాడు. బైబిల్ గ్రంథములో మనము కూడా మొదటగా అదే చూడగలుగుచున్నాము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెదకినట్లయితే, అప్పుడవన్నియు మీకనుగ్రహించబడతాయి అని చెప్పబడియున్నది. అవును, మన దేవుడు ఔదార్యముగలిగిన దేవుడు. ఆయన ఆశీర్వాదములను మన జీవితములో అధికముగా ఇస్తూనే ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితములో మనకు సమృద్ధిని కలుగజేయుచున్నది. " యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు '' అని చెప్పబడినట్లుగానే, ఇంకను దేవుడు తన యొక్క ఆయాశీర్వాదములతో కూడా ఆయన ఎటువంటి దుఃఖమును కూడా జతచేయడు. అవును, నా ప్రియులారా, సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును కోరుకొనియున్నాడు కనుకనే, అతడు ఎంతగానో వర్థిల్లియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 రాజులు 10:24వ వచనములో చూచినట్లయితే, "అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి'' అని చెప్పబడినట్లుగానే, సొలొమోను యొక్క జ్ఞానమును చూచుటకు ఇతర దేశముల నుండి వచ్చారని బైబిల్‌లో చెప్పబడియున్నది. అవును, మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయగలిగిన మన దేవుడు ఎంతో శక్తిమంతుడైయున్నాడు. అందుకే సొలొమోను ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి, జ్ఞానమును కోరియుండగా, అతడు ఎంతగానో దీవించబడ్డాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రజలను మీరు నడిపించాలి అంటే, దైవీకమైన జ్ఞానము మీకు ఎంతో అవసరము. అవును, యేసుక్రీస్తు మనకు జ్ఞానమై యున్నాడు. ఆయన యందు బుద్ధిజ్ఞానము సర్వసంపదలు గుప్తము లై యున్నవి. మీరు మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాధాన్యత నిచ్చి, మొదట దేవుని జ్ఞానమును వెదకినప్పుడు, మీ జీవితంలోని ప్రతి ఇతర అవసరతలన్నిటిని ఆయనే చూసుకుంటాడు. కనుకనే, మీరు యేసును మీ హృదయములలోనికి అంగీకరించినప్పుడు, మీరు దైవీకమైన జ్ఞానమును, నడిపింపును మరియు ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదమును పొందుకుంటారు. అవును, నిజమైన జ్ఞానము యేసుక్రీస్తులో దొరుకుతుంది. నా ప్రియులారా, యేసయ్యతో పాటు ఇహలోకమందును మరియు పరలోకమందును సమస్తమును ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత ఔదార్యముగల దేవుని మనము కలిగియున్నాము కదా! ఈ రోజు నిశ్చయముగా ప్రభువు మిమ్మును అభివృద్ధి నొందించబోవుచున్నాడు. ఈ రోజు, ప్రభువు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావాలని మీపట్ల కోరుకుంటున్నాడు. ఆయన మీ హృదయమును తన జ్ఞానముతో నింపి, మీ జీవితంలోని ప్రతి రంగంలో మిమ్మును స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు నాయకత్వము వహించుచున్నట్లయితే, ప్రజలను నడిపించుటకు కావలసిన దైవీకమైన జ్ఞానం కొరకు ఆయనను అడగండి. అప్పుడు ఆయన మీ నిర్ణయాల వైపు మిమ్మును నడిపిస్తాడు, మీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు మరియు మీ జీవితమును ఆయన విశ్వసనీయతకు సాక్ష్యంగా నిలుపుతాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు యేసయ్య, మీ యందు నివసించబోవుచున్నాడు. ప్రభువు యొక్క దేవుని హస్తము మీ మీదికి ఇప్పుడే దిగివచ్చుచున్నది. ప్రభువు మీ జీవితములో అద్భుత కార్యములను జరిగిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు సొలొమోనును ఆశీర్వదించినట్లుగానే, నీ యొక్క పరలోక జ్ఞానముతో మమ్మును నింపుము, అన్నిటికంటే ఎక్కువగా నీ రాజ్యమును వెదకునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, ఇప్పుడే నీ యొక్క పరలోక జ్ఞానము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును సంపద మా మీద కుమ్మరించబడునట్లుగా చేయుము. దేవా, నీవు మాతో ఉన్నావని ప్రజలు గుర్తెరగునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ దాచబడిన ధనము మాకు వచ్చునట్లుగా కృపనిమ్ము. దేవా, మా జీవితములో ఆశీర్వాదములు పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములో ఇక నుండి ఏ కొదువ వుండకుండా సమృద్ధితో మమ్మును నింపుము. దేవా, నాయకులుగా ఉన్న మమ్మును లేక మా ప్రియులను నీ చేతికి సమర్పించుకొనుచున్నాము, ప్ర్రతి శ్రేష్టమైన మంచి యీవులను మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ బిడ్డలైన మాకు మరియు ఇతరులకు ఒక వ్యత్యాసమును చూపించుము. దేవా, మా సరిహద్ధులను విశాలపరచి, మా మీద నీ యొక్క ఆశీర్వాదములను అధికముగా కుమ్మరించి మమ్మును అభివృద్ధిపరచుము. యేసయ్యా, మా చేతి పనులన్నిటిని ఆశీర్వదించుము. దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో మాకు కావలసిన జ్ఞానమును మరియు తెలివిని అనుగ్రహించుము. ప్రభువా, మా సరిహద్దులను విస్తరింపజేసి, మా ప్రయత్నాలన్నింటిని ఆశీర్వదించి, నీ యొక్క నిబంధన ఆశీర్వాదములను మా జీవితము మీద నిలిచియుండునట్లుగా చేయుము. దేవా, మేము ఆత్మీయంగాను మరియు భౌతికంగా వర్ధిల్లునట్లుగా చేసి, నీ నామమునకు ఘనత మహిమ కలిగించునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


