నా ప్రియమైన స్నేహితులారా, ఈ దినమున దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానమును కలిగియున్నాడు. చింతించకండి, మిమ్మును నడిపించడానికి ఆయన మీ కొరకు వేచియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 23:20వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు సిద్ధపరచిన స్థలమునకు ఆయన మనలను రప్పించుటకు, ఆయన తన దూతను మనకు ముందుగా పంపించుచున్నాడు. ఇది ఎంత సౌందర్యవంతమైన వాగ్దానము కదా! మీ జీవిత ప్రయాణములో మీరు ఒక నూతనమైన అధ్యాయములోనికి వెళ్లుచున్నారేమో? లేక మీరు మీ జీవితములో ఒక అద్భుతకార్యము కొరకు ఎదురు చూస్తున్నారేమో? వీటన్నిటి మధ్యలోను కూడా ఆయన మిమ్మును భద్రపరచి, మీ కొరకు సిద్ధపరచిన స్థలమునకు మిమ్మును తీసుకొని వెళ్లుటకు ఆయన మీకు ముందుగా వెళ్లుటకు మీ కొరకు ఒక దూతను ఏర్పరచియున్నాడు. మీరు సరైన స్థలమునకు వెళ్లుటకు ఆయన ఒక దూతను మీ నిమిత్తము ఏర్పరచియున్నాడు. మీరు సరైన స్థానమునకు చేరుకొనునట్లుగా చేస్తాడు. నేడు ఆయన మీ కొరకు సెలవిచ్చిన వాగ్దానమును మీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన మీ కొరకు కలిగియున్న అద్భుత కార్యములను మీ పట్ల జరిగిస్తాడు. మిమ్మును మీ మార్గములలో కాపాడుటకు తన దూతను మీకు ముందుగా పంపించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు చింతించకండి.
బైబిల్ నుండి మరియ మరియు యోసేపు యొక్క చక్కటి జీవితము మనము చూడగలము. మరియ గర్భములో దేవుడు ఒక బిడ్డను ఇచ్చు సమయమునకు యోసేపు మరియు మరియ ఇద్దరు కలిసి వచ్చునట్లుగా దేవుడు ఒక దూతను వారి యొద్దకు పంపించుటకు సెలవిచ్చియున్నాడు. మరియ తోను, యోసేపులతోను ఆ దూత మాట్లాడి వారు వెళ్లవలసిన చోటునకు వారిని నడిపించియున్నాడు. బెత్లెహేములో ఒక పశువుల తొట్టిలోనికి నడిపించాడు. వారు ఉన్న ప్రతి స్థలమునకు కూడా ఆయనే వారిని నడిపించియున్నాడు. ఆ యొక్క బిడ్డ మహా అద్భుత రీతిగా జన్మించెను. ఐశ్వర్యవంతమైన బహుమానములతో ఆ బిడ్డను ఘనపరచుట కొరకై జ్ఞానులను దేవుడు యోసేపు మరియు మరియల యొద్దకు తన దూత ద్వారా నడిపించియున్నాడు. మహా అద్భుతముగా, దేవుని యొక్క నవజాత శిశువును వారు ఘనపరచి, ఆరాధించిన తర్వాత, హేరోదు రాజు నుండి తప్పించుకొను నిమిత్తము దేవుడు మహా అద్భుతమైన రీతిలో మరొక మార్గమును తనదూత ద్వారా వారికి ఉపదేశమును చేసియున్నాడు. అంతమాత్రమే కాదు, మరల యోసేపునకు మరియు మరియకు దేవుని దూత ప్రత్యక్షమాయెను. బెత్లెహేమును విడిచి ఐగుప్తునునకు వెళ్లవలెనని వారికి ఆజ్ఞాపించియున్నాడు. ఎందుకనగా, రాజైన హేరోదు ఆ బిడ్డను చంపనుద్దేశించియున్నాడు కనుకనే, జ్ఞానులను వేరొక మార్గములో నడిపించాడు. అవును, ఎంత చక్కగా దేవుడు వారిని రాజు యొద్ద నుండి తప్పించుకొనునట్లుగా చేసియున్నాడు కదా. దేవుడు వారిని ఎంత చక్కగా ప్రతి స్థలమునకు తీసుకొని వెళ్లియున్నాడు కదా. వారు వెళ్లు చోట దేవుడు వారికి భద్రతను మరియు కాపుదలను తీసుకొని వచ్చియున్నాడు కదా!
నా ప్రియులారా, అదే నడిపింపు నేడు మీ యొద్దకు వచ్చుచున్నది. మీరు కూడా ఎటు వెళ్లాలో తోచక ఉన్నారా? మీరు దేవుని హస్తములలో ఉన్నారు. కనుకనే మీ జీవితము ఆయన చేతులలో భద్రపరచబడియున్నది. ఆలాగుననే, మీ కనుదృష్టి యేసు మీద గురి నిలిపియున్నప్పుడు, నిశ్చయముగా ఈ భద్రతను మీరు పొందుకుంటారు. అంతమాత్రమే కాదు, మీరు వెళ్లవలసిన మార్గమును, మీరు తీసుకొనవలసిన నిర్ణయములను దేవుడు మిమ్మును తన దూత ద్వారా చక్కగా నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువైన యేసూ, నా జీవితంలోని ప్రతి దశలో నాతో ఉండి, నన్ను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మేము నీ యొద్ద వేచియున్న కార్యముల నిమిత్తము నీ మీద ఆధారపడియున్నాము. దేవా, నీవు వచ్చి, మా చేతి పట్టుకొని, నీ వాగ్దానము ప్రకారము మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దూతలను మాకు ముందుగా పంపించుము. ప్రభువా, నీ నడిపింపును వెంబడించడానికి మరియు నిన్ను సంపూర్ణంగా విశ్వసించడానికి మాకు సహాయము చేయుము. దేవా, మాకు కావలసిన జ్ఞానం మరియు నడిపింపు కావలసినప్పుడు మమ్మును నీ యొక్క జ్ఞానము ద్వారా నడిపించి, నీ చిత్తానుసారంగా నడుచుకొనుటకు మాకు మార్గము చూపించుము. ప్రభువా, మా జీవితములో మేము సరైన స్థలమునకు నడిపించబడునట్లుగానే, నీవు మా కొరకు సిద్ధపరచి స్థలమునకు మేము తీసుకొని వచ్చునట్లుగాను మరియు నీవు మా కొరకు సిద్ధపరచిన అద్భుతమును మేము పొందుకొనునట్లుగాను కృపను చూపుము. ప్రభువా, మార్గము కొరకు వెదకుచున్న మాకు సరైన మార్గమును చూపుటకు నీవు మాకు ముందుగా నీ దూతను పంపించుము. దేవా, యోసేపు మరియు మరియలతో మాట్లాడినట్లుగానే, నీవు దర్శనముల ద్వారాను, కలల ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ప్రభువా, నీవు సిద్ధపరచిన స్థలమునకు మేము భద్రంగా చేరుకొనునట్లుగా మాకు నీ నడిపింపును దయచేయుము. దేవా, మేము సమస్త కీడుల నుండి విడిపించబడునట్లుగా మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


