నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 30:22వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో ప్రభువు, "అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును'' అని సెలవిచ్చినట్లుగానే, దేవుడు మిమ్మును తన ప్రజలుగా ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఆయన మీరు తన స్వంత ప్రజలుగా ఉండాలని కోరుచున్నాడు. ఆయన మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఎవరి ప్రజలుగా ఉండడానికి ఆయన మిమ్మును అనుమతించడు. ఏ ఇతర మానవునికి ప్రజలుగా ఉండడానికి ఆయన అనుమతించడు. ఏ అపవాది బిడ్డగా ఉండడానికి అనుమతించడు. ఎందుకంటే, మీరు ఆయనకు చెందినవారని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను. నేను మిమ్మును పేరు పెట్టి పిలిచియున్నాను. నేను మిమ్మును నా రక్తముతో కొనియున్నాను. మీరు నాకు చెందినవారై యున్నా రు. మీరు యేసుకు చెందియున్నవారు. నా ప్రియ స్నేహితులారా, మీరు యేసుకు చెందినవారు. మీరు ఆయనకు స్వంతమై యున్నారు. కనుకనే, భయపడకండి. మీరు ఏ మాత్ర ము భయపడకండి. మీరు ఈ లోకములో అనాథులు కారు. దేవుడు బహు రోషముగలవాడై ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు. కేవలము ప్రభువును కాదు, స్నేహితుని కాదు. నేను మీకు దేవుడనై యుందును. ఎంత సంతోషము కదా. ఎంత గొప్ప నిరీక్షణ కదా! కనుకనే, మీరు ఆయనను స్తుతించండి, మిమ్మును మీరు యేసు హస్తములలోనికి విడుదల చేసుకొనండి. ఇంకను ప్రతి విధమైన మానవాళి భయమును బయటకు మరియు అపరాధభావము యొక్క భయమును బయటకు వెళ్లిపోనివ్వండి. దుష్ట శక్తులు ప్రభావము యొక్క భయము మీ నుండి వెళ్లిపోనివ్వండి. ఎందుకనగా, యేసు మిమ్మును తన స్వంతము చేసుకొనియున్నాడు. ఆ యాజమాన్యమును బట్టి ఆనందించండి. ఎందుకంటే, ఆయన మీకు ప్రియమైన తండ్రిగా ఉన్నాడు. కనుకనే, మీరు భయపడకండి.
ఈ బాంధవ్యమును మీరు ఏలాగున కలిగియుందురు? మొట్టమొదటగా, మీరు లోకము నుండి వెడలి, పాపమునకు దూరముగాను ప్రత్యేకముగా ఉంటారు. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 6:17వ వచనములో చూచినట్లయితే, "కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు'' అని లేఖనములలో చెప్పబడినట్లుగానే, మీరు లోకము నుండి వెడలి ప్రత్యేకముగా ఉంటారు. అవును, పాపముతో మీకు ఇక ఏ ఒప్పందమును లేదు. అవును, మీరు జీవముగల దేవునికి ఆలయమై ఉన్నారు. మీ దేహమును మరియు మనస్సును దేవునికి ఆలయముగా యాజమాన్యము చేసుకొనవలెను. ప్రభువు ఎల్లవేళల మీ మీద యజమానిగా ఉన్నాడు. వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా రండి, అపవిత్రమైనదానిని మీరు ఏదియు కూడా ముట్టకండి. అందుకే, ఆయన మిమ్మును చూచి, "నేను మిమ్మును స్వీకరించెదను. నేను మీకు తండ్రిగా ఉండెదను. మీరు నాకు కుమార్తెలు, కుమారులుగా ఉండెదరు. నేను మీకు దేవుడనై ఉందును, నేను మీ మధ్య నివసించెదను. నేను మీతో నడుచుదును'' అని సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇది ఎంత గొప్ప సంతోషము కదా! కనుకనే, మిమ్మును మీరు ప్రత్యేకపరచుకున్నప్పుడు, నిశ్చయముగా, మీరు ఆయనతో కలిసి జీవించెదరు.
ఆలాగుననే, రెండవదిగా, మిమ్మును మీరు తగ్గించుకొనండి. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనములో చూచినట్లయితే, "నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును'' అని చెప్పబడినట్లుగానే, మిమ్మును మీరు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను విని, మీ పాపమును క్షమిస్తాడు. అవును, ఎవరో ఒకరు పాపము చేసియున్నప్పటికిని, వారెవరో మరొకరు పాపము చేసియున్నప్పటికని మరియు వారు మీ మీద నిందవేయుచున్నప్పటికిని, మీరు మరి ఎక్కువగా మిమ్మును తగ్గించుకొనండి, దేవునికి ప్రార్థన చేయుచూ, ఆయన ముఖదర్శనము కొరకు కనిపెట్టండి. అప్పుడు దేవుడు పరమందుండి మీ ప్రార్థనలను ఆలకించి, ఆయన మీ దేహమును, కుటుంబమును ఆయన వ్యాపారమును బాగుచేస్తాడు. ఆలాగుననే, దేశమును స్వస్థపరుస్తాడు. మీరు కలిగియున్న సమస్తమును కూడా బాగుపరచబడుతుంది. మీరు తెరవబడిన ద్వారమును కలిగియుంటారు. మీరు ఎక్కడైతే, అవమానమును పొందియుంటారో, అక్కడ ఖ్యాతిని, మంచి పేరును మీరు కలిగియుంటారు. ఎంత గొప్ప సంతోషము కదా! కనుకనే, మిమ్మును మీరు తగ్గించుకొని ప్రార్థించండి, నిశ్చయముగా, మీ ప్రార్థన ఆలకించి, మీకు జవాబునిస్తాడు.
ఆలాగుననే, మూడవదిగా, దేవుని మీరు అంగీకరించండి, పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా మీకు మీరే క్రీస్తు శరీరములోనికి రూపాంతరపరచబడుదురు. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:18వ వచనములో చూచినట్లయితే, "మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఆత్మ ద్వారా మీరు మహిమ నుండి అధిక మహిమను పొందుచు, మీరు యేసు యొక్క స్వారూప్యములోనికి మార్చబడుచున్నారు. దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. నా ప్రియులారా, ఈ రోజు, మానవుల పట్ల ఉన్న భయం, అపరాధ భావం మరియు దుష్ట శక్తుల పట్ల ఉన్న భయమును వీటన్నింటిని విడిచిపెట్టి, మిమ్మును మీరు సంపూర్ణంగా యేసుక్రీస్తు హస్తములకు అప్పగించుకున్నప్పుడు, ఆయనకు చెందినవారుగా ఉండి ఈ ఆశీర్వాదమును అనుభవించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్తన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్య, నీకు చెందినవారముగా, మాకు అటువంటి ఆధిక్యతను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మును నింపుము. ప్రభువా, సకల లోక దుష్ట కార్యముల నుండి మమ్మును మేము ప్రత్యేకపరచుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మమ్మును మేము తగ్గించుకొని, ప్రార్థన చేయు కృపను మరియు హృదయమును మాకు దయచేయుము. యేసయ్యా, నీ యొక్క మహిమ వెంబడి మహిమను మేము పొందుకొని, నీ స్వారూప్యములోనికి మార్చబడుటకు మాకు కృపను అనుగ్రహించుము. దేవా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసు నామమున నీ కృప మా మీద విస్తరించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క ఆత్మ శక్తిచేత, మాలోను మరియు మా కుటుంబములో ఉన్న దురాత్మ శక్తులు బయటకు వెళ్లిపోవునట్లుగా చేయుము. దేవా, నీ పరిశుద్ధాత్మశక్తిచేత మమ్మును నింపి, మా యొక్క బంధకములు బ్రద్ధలగునట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్య, మమ్మును నీవు ఏర్పరచుకొని, నీకు చెందినవారినిగా మార్చినందుకై నీకు వందనములు. దేవా, మా యొక్క ప్రతి దుష్టత్వము నుండి మమ్మును ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయుము. ప్రభువా, మమ్మును మేము నీ సన్నిధిలో తగ్గించుకొనుటకు, ప్రార్థించుటకు, మరియు ఇతరులను క్షమించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మేము నీలో వద్ధిచెంది, నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ యొక్క శాంతి ప్రతిదినం మా హృదయమును, మనస్సును కాపాడు కొనునట్లుగా చేయుము. దేవా, నీతో సన్నిహితంగా నడుచుకొనుటకు మరియు నీ పిలుపునకు నమ్మకముగా జీవించుటకు మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


