నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుటకు నేను ఎంతో సంతోషించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 7:25వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనలను రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనలను రక్షించు యేసయ్యను మనము కలిగియుండడము ఎంత గొప్ప భాగ్యము కదా! యేసు వలననే, మనము తండ్రిని చేరుకొనగలుగుచున్నాము, తద్వారా మనము రక్షణను పొందుకొనగలుగుచున్నాము. పాతనిబంధన కాలములో ప్రజలు ఏ విధంగా రక్షణ పొందుకునేవారు. వారు యాజకుని యొద్దకు వెళ్లి, వారి పాపములను ఒప్పుకొని, బలియర్పణలను అర్పించుట చేత దేవుని యొద్ద నుండి పాపక్షమాపణను పొందుకునేవారు. దేవుని యొద్ద నుండి పాపక్షమాపణను పొందుకొనుట కొరకై దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన ప్రతిసారి ఇదే విధానమును తిరిగి పాటించేవారు.

అయితే, నూతన నిబంధనలో యేసయ్య, మన కొరకై తన ప్రాణమును బలిగా అర్పించిన తర్వాత మనము రక్షణను పొందునట్లుగా, యేసు ప్రభువు మన కొరకు శాశ్వతమైన ప్రధాన యాజకునిగా మారియున్నాడు. మనము ఆయనను విశ్వసించినప్పుడు, మన పాపముల కొరకు ఆయన మరణించి, తిరిగి లేచియున్నాడని విశ్వసించినప్పుడు, మన నోటితో యేసును మన ప్రభువుగాను మరియు మన రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు, మనము సంపూర్ణమైన రక్షణను పొందుకుంటాము. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 10:9వ వచనములో చూచినట్లయితే, "అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు'' అని చెప్పబడినట్లుగానే మనము ఆయన యందు విశ్వాసముంచినప్పుడు, మనము రక్షణను పొందుకొనగలుగుతాము. అవును, యేసు అను పదమునకు అర్థము రక్షకుడు. పరలోక సౌభాగ్యములన్నిటిని విడిచిపెట్టి, మనలను పాపము నుండి విముక్తులనుగా చేయడాని కొరకై యేసయ్య ఈ లోకమునకు వచ్చియున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. మనము ఆయన యందు విశ్వసించి, ఈ పాపముల నుండి మనము విముక్తులము అగునట్లుగా యేసయ్య, మన కొరకు ఆ సిలువలో బలియై యున్నాడు. కనుకనే, మనము యేసునందు విశ్వాసముంచినప్పుడు, మనము పాపపు శిక్షను భరించినక్కర్లేదు. గానీ, నిత్యజీవమును మనము పొందుకొనగలుగుతాము.

నా ప్రియులారా, కాబట్టి, మీరు ఈ రోజు యేసయ్యను విశ్వసించండి. మీ నోటితో ఆయనను మీకు ప్రభువుగా ఒప్పుకొనండి. ఆయన తన రక్షణను మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ జీవితమును మీరు జీవించునట్లుగా, ప్రతిరోజు మిమ్మును తన ఆత్మతో నింపుతాడు. పాపము నుండి విముక్తులనుగా చేయుటకు సమాధానముతో మిమ్మును నింపుతాడు. ఈ రోజు ఈ గొప్ప కృపను బట్టి, ప్రభువునకు వందనములు చెల్లించుదాము. రక్షణ అను బహుమానమును మన జీవితములో పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
రక్షణకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ రక్షణ మాకు అందించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రియప్రభువా, నీ కుమారుని ద్వారా సంపూర్ణ రక్షణ అనే బహుమానమును మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్యా, మా కొరకై సిలువలో మరణించినందుకై మరియు మూడవ దినమున లేచినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, రక్షణ అను బహుమానమునకై నీకు వందనములు రక్షణ కొరకై అటుఇటు మేము పరుగెత్తకుండా, నీ యందు మేము విశ్వాసముంచి, నీవు అనుగ్రహించు రక్షణను పొందుకొనునట్లుగా సహాయము చేయుము. దేవా, మా పాపములను తీసివేసి, మాకు నిత్యజీవమును ఇవ్వడానికి నీకుమారుని పంపినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువైన యేసూ, నీవు మా కొరకు మరణించి తిరిగి లేచావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవే మా ప్రభువుడవునియు మరియు రక్షకుడవనియు మా నోటితో ఒప్పుకొని, మా హృదయమును, శుద్ధి చేసుకొనుటకును, ప్రతిదినం నీ సన్నిధితో మమ్మును నింపుము. దేవా, పరిశుద్ధతలో నడుచుకోవడానికి మరియు పాపములేనివారుగా జీవించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ శాంతి మా జీవితమును ఏలునట్లుగాను మరియు నీ కృప మమ్మును నిలబెట్టునట్లుగా చేయుము. దేవా, మమ్మును ప్రేమించి, సంపూర్ణంగా రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, కృతజ్ఞతా హృదయంతో ఈ రక్షణను మేము స్వీకరించుటకు మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.