నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు జూలై 15వ తేదీ. ఈ రోజు నా ప్రియమైన భర్తగారి యొక్క జన్మదినము. అతనికి ఇంకా శుభాకాంక్షలు తెలియజేయనట్లయితే, మా సేవాపరిచర్య ద్వారా మీరు సందేశమును పంపించినట్లయితే, అతను ఎంతగానో సంతోషిస్తాడని నాకు తెలుసు. నా భర్తను గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు అతనిలో ఉన్న ఎన్నో మంచి లక్షణాలు నచ్చుతాయి. అయితే, అన్నింటి కంటే, ఎక్కువగా దేవుని భయభక్తులు కలిగియుండుట నాకు ఎంతో నచ్చుతుంది. ప్రతిసారి ప్రార్థన కూడికకు వెళ్లడానికంటె ముందు ఉదయముననే నేను లేచి చూచినప్పుడు, అతడు వేరొక గదిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఉదయము మూడు లేక నాలుగు గంటల నుండి సరైన దేవుని వాక్కు కొరకు కనిపెట్టుచూ, ప్రార్థిస్తుంటారు. కానీ, అతను నాతో ఈలాగున చెబుతూ ఉండేవారు, 'శిల్పా నేను వేదిక మీదికి వెళ్లి నిలబడాలంటే, ప్రతిసారి ఎంతో భయపడతాను. ఎందుకంటే, దేవుని వాక్యమును నేను మోయుచున్నాను అంటారు. అంతగా, అతను దేవుని యందు భయభక్తులను కలిగిఉంటారు. ఆ భయభక్తులను బట్టి, ప్రభువు మా పట్ల ఎంతగానో దయచూపించియున్నాడు. అంతమాత్రమే కాదు, అనేక రీతులుగా ప్రభువు మమ్మును దీవించియున్నాడు. ఆ పవిత్రమైన భక్తిభావము అతని హృదయంలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. అది ప్రజల పట్ల భయం కాదు, కానీ దేవుని వాక్యాన్ని పంచుకోవలసిన బాధ్యత పట్ల ఉన్న లోతైన గౌరవం. ఈ భక్తిభావం కారణంగానే దేవుడు అతనిని ఎన్నో విధాలుగా దయను అనుగ్రహించి, ఆశీర్వదించాడని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను.

నా భర్తయైన శ్యామ్‌ని చూచి, ' శ్యామ్, నీ జీవితములో నీవు ఏమి సాధించాలని అనుకుంటున్నావు? ' అని ఒకసారి నేను తనని అడిగాను? అందుకు తను నాతో ఈలాగున చెప్పారు కదా! 'శిల్పా, నేను ఒక పెద్ద వ్యాపారవేత్తనో, లేక ఒక పెద్ద వ్యక్తిని కావాలనుకోలేదు. ఎల్లప్పుడు దేవుని సన్నిధానము నాతో కూడా ఉండాలని అని ఆశించుచున్నాను అంతే, నేను దానిని కోల్పోదలచుకోలేదు.' నా ప్రియ స్నేహితులారా, అందుకనే, దేవుడు తన కృపను తన మీద ఉంచియున్నాడు. దేవుడు అతనిని ఎంతగానో ప్రేమించుచున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటమే మన అత్యంత ఆశ్రయంగా ఉన్నప్పుడు, ఆయన దయ సహజంగానే మన జీవితముల మీద ఉంటుంది. అందుకే, ప్రభువు అతని పట్ల అంతటి దయను, కృపను కనుపరచియున్నాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా!

కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 36:9వ వచనములో చూచినట్లయితే, " నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ పట్ల దయతో కృప చూపుచున్నాడు అని ప్రభువు ఈ రోజు మీతో తెలియజేయుచున్నాడు. నా ప్రియులారా, మీలో ప్రతిఒక్కరిని ఆయన ప్రేమించుచున్నాడు, మీపైన ఆయన కృపను కనుపరచుచున్నాడు. ఇంకను ప్రభువు కృపను కూడా చూపుచున్నాడు. కాబట్టి, మనకు కష్టాలే ఉండవని అర్థమా? కాదు, ఈ వచనములో వ్రాయబడియున్నది కదా! 'మీరు దున్నబడి విత్తబడుదురు.' మీరు కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, చివరిలో దేవుని కృపను బట్టి మీరే విజయవంతులు అవుతారు. ఆయన తన పిల్లలందరిని ప్రేమించుచున్నాడు మరియు తనకు చెందినవారిని ఆశీర్వదించడంలో ఆనందిస్తాడు. దేవుని అనుగ్రహం ఉందంటే మనకు ఎప్పుడూ కష్టాలు రావా? ఖచ్చితంగా అలా కాదు. మనం దున్నబడి, విత్తబడతామని ఆ వాగ్దానములో చెప్పబడినట్లుగానే, పంట పండాలంటే ముందుగా భూమిని సేద్యపరచాలి కదా! అలాగే, మన జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు మరియు శోధనల సమయములు ఉంటాయి. అయినప్పటికిని, ఈ అనుభవాలు ఏమాత్రం అర్థరహితమైనవి కావు. మనలను గొప్ప ఆశీర్వాదాలకు సిద్ధపరచడానికి దేవుడు వీటన్నిటిని ఉపయోగిస్తాడు.

నా భర్త శ్యామ్ జీవితములో చూచినట్లయితే కూడా, తను చిన్నతనములోనే, ఐదు లేక ఆరు సంవత్సరములో వయస్సులోనే, అంకుల్ మరియు ఆంటీ వారు పరిచర్య నిమిత్తము దూరముగా వెళ్లినప్పుడు, తను ఒంటరిగా ఉండేవాడు. చిన్నవయస్సులోనే దేవుని పరిచర్య కొరకు ఎంతగానో త్యాగము చేసియున్నాడు, అందును బట్టి, ప్రభువు తనను ఈ రోజు ఎంతగానో ఆశీర్వదించియున్నాడు. అయినప్పటికిని, ప్రభువు ప్రతి త్యాగమును ఘనపరచి; నేడు శ్యామ్ జీవితములో ఆయన సమృద్ధియైన ఆశీర్వాదములను మనం చూడగలము.

నా ప్రియులారా, మీరు ఎన్నుకొనబడినవారు, కనుకనే, ప్రభువు మిమ్మల్ని దున్నబడి విత్తబడునట్లుగా చేస్తాడు. మీరు కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే, చివరిలో ప్రభువు మిమ్మను గొప్పరీతిగా దీవిస్తాడు. కలిసి ప్రార్థించుకుందాము. మీ విషయంలోనూ ఇదే జరుతుంది. మీరు దేవునిచే ఎన్నుకోబడిన బిడ్డలైతే, మిమ్మల్ని సిద్ధపరచే సమయము ద్వారా వెళ్లునట్లుగా, ఆయన అనుమతించవచ్చును. ఆ సమయంలో శోధనలు, నిరాశలు మరియు ఆయన మార్గాలు మీకు అర్థం కాని సందర్భాలు ఎదుర్కొనవచ్చును. కానీ, ధైర్యం కోల్పోకండి. భూమిని దున్ని విత్తనములు విత్తువాడు దేవుడే, పంటను పండించి చేతికి అందించువాడు కూడా దేవుడు. ఆయన అనుకూలమైన సమయంలో, మీరు ఊహించినదానికంటె మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు; ఎందుకంటే ఆయన దయ మీ మీద ఉన్నది. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మనలను ఎన్నుకోవడము మనకు అది ఆశీర్వాదకరము. ఈ రోజు శ్యామ్ కొరకు మరియు మా కుటుంబము కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనండి. మీ ప్రేమ, ప్రోత్సాహము మరియు ప్రార్థనలకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. ఎటువంటి లౌకిక సాధనకంటెను ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకోవడంలో మనమందరము ముందుకు సాగుదము. అలాగే, ఆయన దయ కూడా ఎల్లప్పుడూ మన జీవితముల మీద ఉండునట్లుగా దేవుడు కృపను చూపును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దే వా, ఈ అద్భుత వాగ్దానమును బట్టి, నీకు వందనములు. దేవా, నీ యొక్క గొప్ప ప్రణాళిక కొరకు నీవు మమ్మును ఎన్నుకొన్నందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మమ్మును ఎన్నుకుని, నీ దయతో మా మీద దృష్టి ఉంచినందుకు నీకు వందనములు. ప్రభువా, నీవు మమ్మును ఎన్నుకొనునట్లుగా మా జీవితములను నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, ఈ రోజు మా జీవితములను మరియు మా పిలుపును నీ హస్తములకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, మేము నీకు ప్రీతిగాను జీవించునట్లుగా మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా జీవితములో కష్టాలు మరియు శ్రమలు కొద్దికాలము ఉన్నప్పటికిని, మేము నీ యొక్క గొప్ప ఆశీర్వాదములను పొందుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ కృపచేత మేము రెండంతలుగా మేలులను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ఈలోకములో ఉన్న విజయముకంటె నీ సన్నిధిని ఎన్నుకొని, మరియు ప్రతిరోజు నీ యెదుట భయభక్తులతో నడుచునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి శోధన సమయములో మమ్మును బలపరచి, ప్రతి శోధన మా జీవితంలో గొప్ప విశ్వాసాన్ని, లోతైన నమ్మకాన్ని మరియు నిత్యమైన ఫలములను కలుగజేయునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబమును ఆశీర్వదించి, నీ పరిపూర్ణ చిత్తంలో మమ్మల్ని నడిపించి, మా తరములు మీద నీ దయాకనికరము నిలిచియుండునట్లుగా చేయుమని యేసు క్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.