నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయడము నాకు ఎంతో సంతోషము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నెహెమ్యా 1:9 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...మిమ్మును కూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా'' అని చెప్పబడినట్లుగానే, మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెనని మన పట్ల కోరుచున్నాడు. అవును, నా ప్రియులారా, మనము ఈ వచనమును చదివినట్లయితే, "అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల, భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా'' అని చెప్పబడినట్లుగానే, అవును, ప్రియ స్నేహితులారా, మనము ప్రభువు యొద్దకు తిరిగి వెళ్లినప్పుడు, ఆయన మన కొరకు సిద్ధపరచిన స్థలమునకు ఆయన మనలను నడిపిస్తాడు. అది ప్రభువు మన కొరకు ఏర్పరచిన స్థలము.

నా ప్రియులారా, అనేకసార్లు మనము, మా జీవితములో మాకు మాత్రమే అంతా తెలుసు అని దూరముగా పరుగెడుతుంటాము. మన జీవితమునకు ఇది సరియైన స్థలము అని మనము పరుగెడుతుంటాము. అది ఒక ఉద్యోగమై ఉండవచ్చును, ఏదైనా పట్టణమునకై ఉండవచ్చును, లేదా మనము ఎన్నుకొను జీవన విధానమైన కూడా ఉండవచ్చును. ఇలాగున మనము ప్రభువు యొద్ద నుండి దూరముగా వెళ్లతాము. మన కొరకు ప్రభువు కలిగియున్నటువంటి ప్రణాళికలకు వ్యతిరేకంగా వెళ్లుతుంటాము. దేవుని విషయములన్నిటిని విడిచిపెట్టి వెళతాము. ప్రభువు యొద్ద నుండి దూరముగా వెళ్లిపోతుంటాము. ఆయన స్థలము నుండి దూరముగా, ప్రభువు మన కొరకు ఎన్నుకొన్న స్థలము నుండి దూరముగా వెళ్లతాము.

బైబిల్‌లో కూడా తప్పిపోయిన కుమారుని జీవితములో కూడా అదే జరిగినది. తన తండ్రి యింట నుండి అతడు దూరముగా వెళ్లిపోయాడు. ఈ లోకములో ఉన్న సంతోషములన్నిటిని నేను అనుభవిస్తాను అని అనుకుంటూ, తండ్రిని విడిచి దూరముగా వెళ్లిపోయాడు. నా యొక్క ఆస్తినంతటిని కూడా నేను అనుభవిస్తాను మరియు నేను ఆనందిస్తాను అని అనుకున్నాడు. నా జీవితమునకు ఏది మంచిది అని నాకు అనిపించుచున్నదో అక్కడికి నేను వెళ్లతాను అని అనుకున్నాడు. అయితే, అతడు తన ధనమంతటిని వ్యయపరచిన తర్వాత, తన సుఖములన్నిటిని పోగొట్టుకున్న తర్వాత, తన సమాధానమునంతటిని కోల్పోయిన తర్వాత, అప్పుడు తన తండ్రిని గురించి అతనికి జ్ఞాపకమునకు వచ్చినది. తన తండ్రి యింట ఉండియున్నప్పుడు అతడు ఎంత బాగా ఉన్నాడని అతనికి గుర్తునకు వచ్చినది. తన తండ్రి యింటిలో ఉన్నప్పుడు కలిగియున్న సుఖము మరియు సంతోషము అతనికి గుర్తుకు వచ్చినది. దేనిని గురించి చింతించనవసరము లేకుండా ఉన్నది, అతనికి గుర్తునకు వచ్చినది. కాబట్టి, అతడు తిరిగి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ పనివాడుగా పనిచేయుచు అక్కడే ఉండవచ్చును అని అతడు వెళ్లాడు. తన తండ్రి అతనిని తిరిగి చేర్చుకోడు అని భయపడుతూ అని వెళ్లాడు. కృప కొరకు ఎంతగానో అడుక్కోవాలి అని అనుకుంటూ వెళ్లాడు. అయితే, తన తండ్రి అతనిని వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను. ఒక రాజువలె అతనిని తిరిగి చేర్చుకున్నాడు. తన కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు అని తండ్రి ఎరిగియున్నాడు. కాబట్టి, ఆ తండ్రి అతనిని తిరిగి చేర్చుకున్నాడు. తనకు రావలసిన ఘనతను అతనికి మరల తిరిగి ఇచ్చియున్నాడు.

నా ప్రియులారా, అదేవిధముగా మనము తిరిగి మన తండ్రి యొద్దకు వెళ్లినప్పుడు, మన లోకాశలన్నిటిని కూడా విడిచిపెట్టి వేసినప్పుడు నూతన హృదయముతో ప్రభువు చెంతకు తిరిగి వెళ్లినప్పుడు, ఆయన మనలను తిరిగి చేర్చుకుంటాడు. ప్రభువు మన కొరకు ఏర్పరచిన స్థలములో ఆయన మనలను ఉంచుతాడు. మనము చదివిన రీతిగా ప్రభువు మనలను సమకూర్చుతాడు. ఆయన నామమును మనలను ఉంచుకొనుటకు ఆయన ఏర్పరచుకున్న స్థలమునకు మనలను తిరిగి రప్పిస్తాడు. కాబట్టి, మనము చేయవలసినదంతయు మనము ఆయన యొద్దకు తిరిగి వెళ్లాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపెట్టాలి. ఆయన చిత్తానుసారముగా మనము జీవించేవారముగా ఉండాలి. అప్పుడు ఆయన సరైన స్థలములో మిమ్మును ఉంచుతాడు. ఆయన మీ కొరకు ఏర్పరచిన స్థలములో మిమ్మును ఉంచుతాడు.

నా ప్రియమైన వారలారా, ఈ రోజు మీ లోకాశలు మరియు ఆనందమును విడిచిపెట్టివేయండి. మీ జీవితములో ఉన్న లోకాశలన్నిటిని వదిలివేయండి. ప్రభువు మిమ్మును తిరిగి చేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. ఆయన మీరు తిరిగి వస్తారని కనిపెట్టుచున్నాడు. కనుకనే, ఈ రోజు ప్రభువు యొద్దకు తిరిగి వెళ్లడానికి ఒక నిర్ణయమును తీసుకొనండి. మనము ఆ కధలో చూచిన రీతిగానే, చాచిన హస్తములతో ఆయన మిమ్మును తిరిగి చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ మీరు మీ జీవితములో అంతా కోల్పోయి, ఏమి అర్థము కానీ, స్థితిలో ఉన్నారా? మీరు ఓడిపోయిన స్థితిలో ఉన్నారా? ముందుకు ఎలా వెళ్లాలో అర్థము కానీ పరిస్థితిలో ఉన్నారేమో? మీ పనిలోను మరియు మీ వ్యాపారములోను వైఫల్యమును ఎదుర్కొంటున్నారేమో? తర్వాత, ఏమి జరుగబోతుందో తెలియక ఉన్నారా? మీరు అనుకున్నదే, సరైనది అనుకొని, వైఫల్యమును ఎదుర్కొంటున్నారా? అయితే, ప్రభువునకు ఇప్పుడే మీ జీవితములను సమర్పిస్తారా?ప్రభువు మీ కొరకు గొప్ప ప్రణాళికలను కలిగియున్నాడు.

ప్రార్థన:
ప్రేమకలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా కొరకు నీవు అద్భుతమైన స్థలమును సిద్ధపరచియున్నందుకై నీకు వందనములు. దేవా, మేము అంతా కోల్పోయి, ఏమి అర్థము కానీ, స్థితిలో, మేము మా యొక్క పాత జీవితమును విడిచిపెట్టి, నీ యొద్దకు వస్తున్నాము. దేవా, మమ్మును క్షమించి, నీ బిడ్డలనుగా మమ్మును మార్చుకొనుము. ప్రభువా, నీ ఆజ్ఞలకు మేము విధేయత చూపుచూ, నీ చిత్తమును నెరవేర్చునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మా కొరకు ఏర్పరచిన స్థలమునకు మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితములో విరిగినపోయిన ముక్కలన్నిటిని సమకూర్చి, వాటిని సరిచేయుము. దేవా, మమ్మును ఉన్నత స్థలములో నిలబెట్టుము. ప్రభువా, మేము నీతో నివసించుచున్నప్పుడు, మమ్మును సంపూర్ణులనుగా చేయుము. దేవా, నీ యొక్క వాగ్దానము చొప్పున మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మమ్మును నీ నుండి దూరం చేయుచున్న ప్రతి లోకసంబంధమైన కోరికను తొలగించి, మా హృదయాన్ని నీ శాంతితో మరియు ఉద్దేశ్యంతో నింపుము. దేవా, నీ చిత్తం మధ్యలో మమ్మును స్థిరపరచి, మా జీవితమును నీ పునరుద్ధరణ కృపకు సాక్ష్యంగా మార్చుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.