నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ మార్గములను సరాళము చేసి, మీ జీవితంలోని ప్రతి విషయములోను తన సంకల్పమును స్థిరపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన మిమ్మును నడిపించుచున్న మార్గములో ధైర్యముగా నడవండి. ప్రియులారా, ఈ నూతన మాసములో మీరు ఆయన ఆశీర్వాదములను, సమాధానమును, రక్షణను మరియు ఆయన పరిపూర్ణ చిత్తమును నెరవేరడము అనుభవించెదరు. కనుకనే, మీరు భయపడకండి. దేనిని గురించి నిరుత్సాహపడకండి, చింతించకండి, లేదా సందేహించకండి. ఆయన మార్గము ఎల్లప్పుడు సమృద్ధి జీవమునకు మరియు దీవెనలకు మరియు విజయమునకు మార్గము చూపుతుంది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 37:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును'' అన్న వచనము ప్రకారము మీరు మీ పూర్ణ హృదయంతో ప్రభువును హత్తుకుని, నిత్యము యేసు నామమును ధ్యానించుచూ, మీ ప్రతి అడుగులోనూ ఆయన నడిపింపును కోరుకున్నట్లయితే, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములను చూచినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు ఆయన మీ జీవితంలో తన చిత్తమును నెరవేరుస్తాడు.

అయితే, ప్రభువు మన యెదుట ఎలాంటి మార్గములను తెరచుచున్నాడు? మనము ఎంపిక చేసుకున్న స్వంత మార్గము నాశనమునకు దారితీయునని బైబిల్ హెచ్చరించుచున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 14:12వ వచనములో చూచినట్లయితే, " ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును'' అని చెప్పబడినట్లుగానే, మనము నిత్యము దేవుని నడిపింపును కోరుకున్నప్పుడు, మనలను నిత్యజీవములోనికి నడిపిస్తుంది. బైబిల్ నుండి కీర్తనలు 86:11వ వచనమును చూచినట్లయితే, " యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము'' అని కీర్తనాకారుడైన దావీదు ప్రార్థించియున్నాడు. అవును, నా ప్రియులారా, మన ప్రార్థన కూడా ఈలాగుననే ఉండవలెను. ఆలాగుననే ప్రార్థించాలి, ' ప్రభువా, నీ మార్గమును, మాకు బోధించుము. నీ యొక్క సత్యము ననుసరించి నడుచుటకు మాకు సహాయం చేయుము మరియు నీ నామమును ఘనపరచడానికి మా హృదయమును సమర్పించుకొనుచున్నాము' అని దావీదు వలె ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు దావీదును హెచ్చించినట్లుగానే, మిమ్మును కూడా హెచ్చిస్తాడు.

నేను నా చిన్నతనములో అనగా, ఆరు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, నాకు పుట్టినరోజు వచ్చినప్పుడు, దేవుడు మా తండ్రిగారి ద్వారా నాతో ఈలాగున మాట్లాడియున్నాడు, " నా కుమారుడా, నేను నీ యెదుట రెండు మార్గములను ఉంచియున్నాను. అవి, ఒకటి చేప మార్గము, అది ఎల్లప్పుడు చక్కగా నేరుగా ముందుకు ఈదుకుంటూ వెళ్తుంది. మరొకటి పీత మార్గము, అది ఎల్లప్పుడు వంకరగా నడుస్తుంది. కనుకనే, నీవు ఏ మార్గమును ఎన్నుకుంటావు? నీవు చేపవలె చక్కటి మార్గమును ఎన్నుకున్నట్లయితే, నీవు నా ఆశీర్వాదమును పొందుకుంటావు. అయితే, నీవు పీత మార్గము ఎన్నుకున్నట్లయితే, అది వంకర మార్గముగా ఉంటుంది. అది శాపమునకు నడిపిస్తుంది' అని తెలియజేసియున్నాడు. అవును, నా ప్రియులారా, మన స్వంత మార్గములు మరణమునకు మనలను నడిపిస్తాయి. కానీ, మనము ప్రార్థన ద్వారా ప్రభువును వెదకినప్పుడు, ఆయన మనకు తన పట్ల భయభక్తులు నేర్పించి, తన సత్య మార్గములోను మరియు జీవమార్గములోనికి మనలను నడిపిస్తాడు. అందుకే యేసు, " నేనే మార్గము, సత్యమును, జీవమునై యున్నాను'' అని అంటున్నాడు. కనుకనే, నేడు మీరు ఆయన మార్గములో నడవడానికి ప్రభువు మీకు కృపను చూపును గాక.

మొట్ట మొదటగా, ప్రభువు మార్గము పరిశుద్ధమైన మార్గము. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 1:1-2వ వచనములలో చూచినట్లయితే, " దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' అని సెలవిచ్చుచున్నది. అవును, నా ప్రియులారా, మనము దేవుని వాక్యమును ఆనందించుచూ, యేసును అనుసరించినప్పుడు, దుష్టుల ఆలోచనలకు, పాపుల మార్గమునకు మరియు అపహాసకులకు దూరముగా ఉంటాము. ఆయన పరిశుద్ధ మార్గము మనలను నాశనం నుండి కాపాడి సంరక్షించి, జీవమార్గములోనికి నడిపిస్తుంది.

రెండవదిగా, ప్రభువు మార్గము జ్ఞానయుక్తమైన మార్గము. అందుకే బైబిల్ నుండి సామెతలు 4:11వ వచనములో చూచినట్లయితే, "జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మనకు జ్ఞాన మార్గమును బోధించి, మనము సరాళమైన మరియు నీతివంతమైన మార్గములలో నడిపిస్తాడు. ఆయన దీనిని ఎలా జరిగిస్తాడు? అని బైబిల్‌లో కీర్తనలు 32:8వ వచనమును మనకు జవాబిస్తుంది. ఆ వచనము, "నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు ప్రేమపూర్వకమైన శ్రద్ధతో మిమ్మును కనిపెట్టి ఉంటాడు. ఆయన మీకు ఉపదేశము చేసి, మీకు ఆలోచనలను చెప్పుచూ, మీ అడుగు జాడలను మృదువుగా నడిపిస్తాడు. 'ఇదియే మార్గము, దీనిలో నడవండి ' అని చెప్పు ఆయన స్వరమును మీ హృదయాంతరంగములో నుండి మీకు వినబడుతుంది. కాబట్టి, ఆయన నడిపింపునకు మీరు విధేయత చూపినప్పుడు, యేసుక్రీస్తు మీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదములను మీరు పొందుకొని అనుభవించెదరు.

మూడవదిగా, ప్రభువు మార్గము క్రమశిక్షణ మార్గము. అందుకే బైబిల్ నుండి సామెతలు 10:17వ వచనములో చూచినట్లయితే, "ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును '' అని చెప్పబడినట్లుగానే, శిక్షణను అనుసరించువారు జీవమార్గమును కలిగియుంటాడు. కనుకనే, ఉపదేశమును అంగీకరించేవారు జీవమార్గములో నిలిచియుంటారు, కానీ గద్దింపునకు లోబడనివారు దేవుని యొక్క శ్రేష్ఠమైన ఆశీర్వాదముల పొందకుంటా త్రోవ తప్పిపోవుదురు. నా ప్రియులారా, ఈ దినములలో అనేకమంది క్రమశిక్షణను తిరస్కరించుచున్నారు. అనేకమంది, 'నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను. నేనే నిర్ణయములను తీసుకుంటాను. నాకు నచ్చినది నేను చేస్తాను' అని అంటుంటారు. ప్రేమతో గద్దించిననప్పుడు, వారు దానిని తిరస్కరించెదరు. అయినప్పటికి, గద్దింపును తిరస్కరించువారు ఆయన ఆశీర్వాదములను కోల్పోవుదురని దేవుని వాక్యము మనకు గుర్తుచేయుచున్నది. అందుకు బదులుగా, దైవీకమైన ఉపదేశమును అంగీకరించి, జీవమార్గంలో నిలకడగా ఉండండి. మా కుటుంబంలో, ముఖ్యమైన నిర్ణయములు తీసుకునే ముందు, మేమందర ము కుటుంబముగా కలిసి, ప్రార్థిస్తాము. దేవుడు మా పిల్లల ద్వారా కూడా జ్ఞానంతో మాట్లాడటం చూడటం మాకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మేమందరము కలిసి దేవుని నడిపింపును కోరినప్పుడు, ఆయన నమ్మకంగా మాకు బోధించిం మా హృదయాలను సమాధానముతో నింపుతాడు. అందు కే బైబిల్ నుండి సామెతలు 3:6వ వచనములో చూచినట్లయితే, " నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును '' అని చెప్పబడినట్లుగానే, మీ మార్గములన్నిటిలో ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మీ మార్గములను సరాళము చేస్తాడు. ఇంకను మీరు చేయు ప్రతి పనిలో ఆయన అధికారమునకు అప్పగించినప్పుడు, నిశ్చయముగా, ఆయన మిమ్మును సరాళమైన త్రోవలో నడిపిస్తాడు.

చివరగా, యేసు మార్గము సత్యమైనది. అందుకే బైబిల్ నుండి యోహాను 14:6వ వచనములో చూచినట్లయితే, "యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' అని సెలవిచ్చియున్నాడు. అవును, యేసు సంపూర్ణంగా విధేయత మార్గములో నడిచియున్నాడు కాబట్టి, ఆయన సిలువను సహించి, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి, మరణమును గెలిచి తిరిగి లేచియున్నాడు. అవును, నా ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితములలోను, కుటుంబములలోను, ఉద్యోగములోను, పరిచర్యలోను మరియు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆయన మార్గములను వెంబడించినప్పుడు, ఆయన మిమ్మును జీవ మార్గములో నడిపిస్తాడు. కనుకనే, నా స్నేహితులారా, ఈ రోజు, మీ జీవితంలోని ప్రతి అంశమును మరియు ప్రతి మార్గమును ప్రభువుకు అప్పగించి, ఆయనను మీ యొక్క పూర్ణహృదయంతో నమ్మినప్పుడు, ఆయన మీ మార్గములను సరాళము చేసి, మీ జీవితములో తన యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా మార్గములన్నిటిని నీ అధికారమునకు అప్పగించి, మా పూర్ణ హృదయంతో నిన్ను నమ్ముకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన, జ్ఞానవంతమైన, మరియు నీతియుక్తమైన మార్గములను మాకు బోధించి, ప్రతిదినం నీ సత్యమార్గంలో మేము నడుచునట్లుగా మా మార్గములను సరాళము చేయుము. దేవా, మా యొక్క స్వంత మార్గములను మరియు నిర్ణయములను ఎంపిక చేసుకొనకుండా, మాకు నీ యొక్క జ్ఞానమునిచ్చి, నీ మార్గములను వెంబడించుటకు మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, నీ యొక్క సత్యమార్గములోను మరియు జీవ మార్గములో మమ్మును నడిపించుము. దేవా, నీవు మేము ఉపదేశమును అంగీకరించుటకును, నీకు లోబడుటకును, నీ స్వరానికి విధేయత చూపడానికి మాకు కావలసిన నీ యొక్క దైవీకమైన జ్ఞానమును దయచేయుము. ప్రభువా, మా మార్గములను సరాళము చేసి, మా చేతి పనిని స్థిరపరచి, మా జీవితంలోని ప్రతి విషయంలో నీ పరిపూర్ణ చిత్తమును నెరవేర్చుము. యేసయ్యా, మేము నీ యందు భయభక్తులు మరియు విశ్వాసమును కలిగియుంటూ, మా ప్రవర్తన అంతటిని నీ అధికారమునకు అప్పగించుచున్నాము, నీవే మాకు ఆశీర్వాదములను, కాపుదలను మరియు దయను అనుభవించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ, యేసుక్రీస్తు యొక్క జీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.