నా ప్రియమైనవారలారా, ఈ రోజు ప్రభువు మిమ్మును తన విజయవంతమైన ప్రేమతో నింపాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ మీ మీద ఒక గొప్ప ప్రవాహము వలె కుమ్మరించబడుతుంది. కారణము, ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. నేడు, ఆయన ప్రేమ ప్రతి గాయపడిన హృదయమునకు, నిరుత్సాహపడిన ప్రతి ఆత్మకు మరియు ఆయన సన్నిధిని ఎదురు చూచుచున్న ప్రతివారికి చేరుతుంది. మా నాన్నగారు ప్రభువును ముఖాముఖిగా దర్శించినప్పుడు, యేసు కళ్ళ నుండి ప్రవహించుచున్న ప్రేమ మా నాన్నగారి హృదయమును పూర్తిగా నింపినది. దాదాపు మూడు గంటల పాటు, ఆయన ఆ దైవీకమైన ప్రేమలో మునిగిపోయారు. ఆ సమయములో మా తండ్రిగారి జీవితములో నింపబడియున్న ఆ దుఃఖము, కన్నీళ్లు అదృశ్యమైపోయినవి; వెంటనే, దేవుని సన్నిధిలో నవ్వుతూ, ఆనందిస్తూ ఆయన చెప్పశక్యము కానీ ఆనందముతో నిండిపోయాడు. మరొక సందర్భంలో, యేసు నా భార్యకు మరియు నాకు మధ్య నిలబడి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాదాపు గంటన్నర సేపు మమ్మల్ని చూస్తూ ఉండిపోయాడు. ఆయన ప్రేమపూర్వకమైన కళ్లు మా మీద నిలిచియున్నప్పుడు, ఆయన సన్నిధిలో మేము పరవశించిపోయాము మరియు ఆనందబాష్పాలు వచ్చినవి. అవును, నా ప్రియులారా, ఈ రోజు, అదే ప్రేమ మీ వైపు ప్రవహిస్తుంది. యేసు మిమ్మును మర్చిపోలేదు. ఆయన మీ వైపు కనికరంతో చూస్తూ, 'నా ప్రియ బిడ్డలారా,' అని ఆయన తన యొద్దకు మిమ్మును పిలుచుచున్నాడు. ఆయన ప్రేమ మీ హృదయమును నింపి, మీకు విజయమును అనుగ్రహించుచున్నది.

అవును, అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 63:3వ వచనములో చూచినట్లయితే, " నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును'' అని చెప్పబడినట్లుగానే, క్రీస్తు ప్రేమ జీవముకంటే గొప్పది. మన జీవితములో ఎదుర్కొంటున్న ప్రతి శోధనను జయించడానికి ఆయన ప్రేమ మనకు బలమును అనుగ్రహించుచున్నది. కనుకనే, శ్రమ, ఇబ్బంది, హింస, కరువు, ప్రమాదం లేదా మరే ఇతర పరిస్థితులు కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవని బైబిల్ నుండి రోమీయులకు రాసిన పత్రిక 8:35-39 వ వచనములు మనకు గుర్తుచేయుచున్నది. అందుకే, ఆ వచనములో చూచినట్లయితే, " క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నా ము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను '' అని చెప్పబడినట్లుగానే, పై చెప్పబడినవేవియు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్మవలెను. అవును, నా ప్రియులారా, ఈ రోజు మీరు ఎలాంటి పోరాటములను ఎదుర్కొంటున్నను సరే, యేసు ప్రేమ మిమ్మును వాటన్నిటిలో నుండి విజయవంతులనుగా నడిపించుచున్నది. కారణము, ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు కాబట్టి, మీరు ప్రతి సవాలును జయించి, అత్యధికమైన విజయవంతులుగా స్థిరముగా నిలువబడతారు.

మా చెల్లెలు ఏంజల్ మరణించిన ఆ బాధాకరమైన సమయం కూడా నాకు గుర్తుకు వస్తుంది. ఆ సమయములో మా కుటుంబం దుఃఖముతోనూ, కన్నీళ్లతోనూ నిండిపోయినది. ఒక ఉదయం, మేము కుటుంబముగా ప్రార్థన చేయుచుండగా, యేసు మా మధ్యలో ప్రత్యక్షమై, ఎంతో ప్రేమతో ఇలా అన్నాడు: "నా పిల్లలారా, ఇతరులు మాట్లాడుచున్న మాటలను మీరెందుకు నమ్ముచున్నారు? ఏంజల్ మరణం తర్వాత కూడా, నేను మంచివాడననే నమ్మకాన్ని మీరు కొనసాగించారు. మీరు ప్రతిరోజూ కుటుంబంగా నా దగ్గరకు వచ్చియున్నారు. నేను మిమ్మల్ని ఎలా విడిచిపెట్టగలను? మీరు నాకు ఎంతో విలువైనవారు'' అని చెప్పాడు. ఆయన యొక్క ఆదరణపూరితమైన మాటలు మాకు బలమును ఇచ్చినవి. ఆయన మమ్మును అత్యంత సమృద్ధితో ఆశీర్వదిస్తానని ప్రభువు మాకు వాగ్దానము చేసియున్నాడు. ఆలాగుననే, గడిచిన నలభై సంవత్సరాలుగా, మేము ఆయన విశ్వసనీయతను చూసియున్నాము. ఇంకను ఆయన మాకు ఒకదాని వెంబడి ఒకటిగా విజయమును అనుగ్రహించియున్నాడు మరియు లక్షలాది మంది ప్రజలను ఆశీర్వదించడానికి ఈ పరిచర్యను ఉపయోగించుచున్నాడు. అదే నమ్మకమైన దేవుడు మీకు కూడా విజయాన్ని అనుగ్రహిస్తాడు.

రెండవదిగా, యేసు ప్రేమ మనలను పాపం నుండి విడిపించుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 3:16వ వచనములో చూచినట్లయితే, దేవుని ప్రేమ యొక్క లోతును తెలియజేయుచున్నది. ఆ వచనము, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, '' అని చెప్పబడినట్లుగానే, దేవుడు లోకములో ఉన్న మనలను ఎంతగానో ప్రేమించియున్నాడు. కనుకనే, మనము యేసునందు విశ్వాసముంచినట్లయితే, మనము నశింపక నిత్యజీవము పొందునట్లు కృపను అనుగ్రహించియున్నాడు. అవును, నా ప్రియులారా, ప్రతి పాపి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది కదా.

నేను పదహారేళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఈ లోకాశలకు ఈడ్వబడి, నేను దేవునికి దూరమయ్యాను. మా తల్లిగారు ప్రతి మంగళవారం నా కొరకు ఉపవాసం ఉంటూ ప్రార్థించడం ప్రారంభించారు. ఇప్పటికి నలభై ఆరు సంవత్సరములు గడిచినప్పటికిని, మా అమ్మగారు నేటికిని కూడా నా కొరకు ప్రార్థించుచూనే ఉన్నారు. మా తల్లిగారు నా కొరకు ప్రార్థించుటకు ప్రారంభించిన కొన్ని వారములలోనే, దేవుడు మా అమ్మగారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఆయన నా జీవితమును పూర్తిగా మార్చివేశాడు. ఆయన నన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు, తన సేవలోనికి నన్ను పిలుచుకున్నాడు, మా కుటుంబమును ఆశీర్వదించియున్నాడు మరియు పరిచర్యలో నన్ను ఉన్నతస్థాయికి చేర్చాడు. నా ప్రియులారా, అదే యేసు ఈ రోజు మిమ్మును కూడా పిలుచుచున్నాడు. ఆయన మీ పాపముల కారణంగా ఆయన మిమ్మును ఎన్నటికిని త్రోసివేయడు. ఆయన అమూల్యమైన రక్తం మీ యొక్క సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని శుద్ధి చేయుచున్నది. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు ఉన్న పక్షముననే, ఆయన యొద్దకు రండి; అప్పుడు ఆయన తన శాశ్వతమైన ప్రేమతో మిమ్మును హత్తుకుని, మీ పాపములను క్షమించి, మీ జీవితమును కూడా రూపాంతరపరుస్తాడు.

చివరగా, దేవుని ప్రేమ ఎన్నటికిని మారనిది. అది మిమ్మును నిరంతరము హత్తుకునే ప్రేమ. అందుకే బైబిల్ నుండి యెషయా 54:10వ వచనములో చూచినట్లయితే, " పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు '' అని చెప్పబడినట్లుగానే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను సరే, ఆయన అచంచలమైన ప్రేమ మీ నుండి ఎన్నటికిని తొలగిపోదని లేఖనము మనకు గుర్తుచేయుచున్నది. నా ప్రియులారా, ఒకవేళ, మీరు మీ తల్లిదండ్రులను, మీ ఉద్యోగమును, మీ ఆర్థిక వనరులను, లేదా మీ సంబంధాలను కోల్పోయి ఉండవచ్చును. మీరు ప్రేమించిన, మీకు సహాయపడిన మరియు ఎవరి కొరకైతే త్యాగము చేసియున్నారో, వారు కూడా మీకు వ్యతిరేకంగా లేచి ఉండవచ్చును. అయినప్పటికీ యేసు మిమ్మును ఎన్నటికిని విడిచిపెట్టడు. ఆయన శాశ్వతమైన ప్రేమ మిమ్మును ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఘనపరచుచున్నది మరియు మీరు కోల్పోయిన సమస్తమును తిరిగి అనుగ్రహించుచున్నది. అవును, నా ప్రియులారా, ఆయన తన ప్రేమతో మీ హృదయాలను నింపుతాడు, అలాగే ఇతరులను ప్రేమించడానికి మరియు క్షమించడానికి మిమ్మును యోగ్యులనుగా చేస్తాడు. కనుకనే, ఈ రోజు, క్రీస్తు యొక్క అచంచలమైన ప్రేమను పొందండి. ప్రతి నష్టము సమృద్ధితో నింపబడి, ప్రతి దుఃఖమునకు ఆదరణను కలిగించి, ప్రతి భారము తొలగిపోవును; అలాగే మీ జీవితంలోని ప్రతి రంగములోను ఆయన యొక్క సమాధానము, పరిశుద్ధత, సమృద్ధి మరియు విజయంతో నింపబడుతుంది. అందుకే, ఆయన ప్రేమ నిజంగా జీవముకంటే ఉత్తమమైనది అని చెప్పబడినది. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ యొక్క శాశ్వతమైన మరియు మారని ప్రేమతో మమ్మును ప్రేమించుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క ప్రేమ మా హృదయంలోని ప్రతి ఖాళీ స్థలమును నింపి, ప్రతి భయమును, దుఃఖమును మరియు నిరుత్సాహమును తొలగించుము. దేవా, నీ యొక్క ప్రేమ నుండి మమ్మును ఏదియు ఎడబాపనేరవు అన్న విశ్వాసంతో మేము నిలిచియుండునట్లుగా మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీవు చిందించిన రక్తము ద్వారా మా యొక్క పాపములను పవిత్రపరచి మరియు నీ యొక్క చిత్తానుసారంగా మా జీవితమును రూపాంతరపరచుము. దేవా, మా యొక్క ప్రతి నష్టమును మరల పునరుద్ధరించి, దుఃఖముతో ఉన్న మా హృదయమును ఆదరించి, నీ యొక్క గొప్ప సమాధానముతోను, కృపతో మమ్మును మరియు మా కుటుంబమును బలపరచుము. దేవా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను సరే, నీ యొక్క అచంచలమైన ప్రేమ మా నుండి ఎన్నటికిని తొలగిపోకుండా చేయుము. ప్రభువా, నీ యొక్క నిత్యమైన ప్రేమ ద్వారా, మా శోధలన్నిటి మీద మాకు విజయమును అనుగ్రహించి, ఇతరులకు నీ యొక్క మంచితనమునకు సాక్షులముగా మార్చబడడానికి నీ కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.