నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 145:19వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " తన యందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును'' మరియు మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చాలని నేడు మీ పట్ల కోరికలను కలిగియున్నాడు. ఇంకను కీర్తనలు 20:4వ వచనములో చూచినట్లయితే, "నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక'' ప్రకారం నేడు దేవుడు మీ కోరికలను సిద్ధింపజేస్తాడు.

బైబిల్‌లో ప్రసంగి 3:11 వ వచనము ప్రకారం దేవుడు మీ హృదయ కోరికలను తీరుస్తాడు, ఆ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు'' ప్రకారం దేని కాలమందు దానిని మీ జీవితములో చక్కగా చేయాలని కోరుచున్నాడు. కాబట్టి, యేసు మీ హృదయంలో నివసించినప్పుడు ఆయన తన ఉద్దేశం ప్రకారం మీలో కోరికలను ఉంచుతాడు. మీ కోరిక దేవుని ప్రణాళికగా అవుతుంది. అప్పుడు దేవుని ప్రణాళిక మీ కోరికగా మారుతుంది. అవును, మీరు మరియు ప్రభువు ఏకమవుతారు. అందుకే వాక్యములో చూచినట్లయితే, "అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, యేసు మీ హృదయంలో నివసించినప్పుడు మరియు మీరు దేవుని యందు భయభక్తులతోను, ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ సమస్తమును చేసినప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మీ హృదయం దేవుని ప్రణాళికతో అనుసంధానించబడుతుంది, మరియు ఆయన ప్రణాళిక మీ హృదయంలో బయలుపరచబడుతుంది. అప్పుడు దేవుని ఉద్దేశం మీ కోరికగా మారుతుంది. మీరు దానిని అనుభూతి చెందరు. మీరు దానిని గ్రహించలేరు, కానీ మీరు ఏదో ఒక విధంగా, 'నాకు ఈ ఉద్యోగం కావాలి ' అని చెప్పుకుంటారు.' ఏదో విధంగా, నేను ఈ వృత్తిలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని మీలో అనుకుంటుండవచ్చును.' కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక, యేసు మీలో ఉన్నాడు కాబట్టి, అది మీ కోరికగా మారుతుంది. మరియు మీ ఆలోచనలు యథార్థమైనవి. మరియు మీ హృదయం పవిత్రమైనది మరియు బైబిల్ ఇలాగున చెబుతుంది, 'దేవుడు తన యందు భయభక్తులు గలవారి కోరికలను ఆయన నెరవేరుస్తాడు.' కనుకనే, నేడు దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక.

కారుణ్య విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై దేవుని ప్రణాళికలోనికి ప్రవేశించిన ఇద్దరు విద్యార్థుల యొక్క ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. వారి తల్లిదండ్రులు ఇద్దరూ యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా రక్షించబడ్డారు మరియు ప్రార్థన యోధులుగా సేవ చేశారు, ప్రార్థన గోపురములో స్వచ్ఛందంగా పనిచేశారు. వారు తమ పిల్లలను కారుణ్యలో స్వతంత్రంగా చేర్చాలని కోరుకున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఈ విద్యార్థులు ఒకరినొకరు తెలుసుకోలేదు, అయినప్పటికి ఇద్దరూ శ్రద్ధగా చదివి 100% మెరిట్ స్కాలర్‌షిప్‌లను పొందుకున్నారు. ఒకరు అరుణేష్, మరొకరు ఆల్ఫా. అరుణేష్ తన జీవితంలో భయాన్ని మరియు నిస్పృహను జయించి, కారుణ్యలో తన శిక్షణ ద్వారా నాయకుడయ్యాడు. అతను ఆరాధన నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. బేతెస్ద ప్రార్థన కేంద్రంలో సేవలను నిర్వహించాడు, ప్రార్థన గదులకు నాయకత్వం వహించాడు మరియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన ఉత్సవాలకు కూడా నాయకత్వం వహించాడు, ఇవన్నీ కారుణ్యలో విద్యార్థిగా ఉన్నప్పుడే చేయగలిగాడు. కారుణ్య అతనికి ఆధ్యాత్మికంగా సాధికారత కల్పించినది మరియు క్యాంపస్‌లో ఉన్నప్పుడు కూడా అతన్ని కాగ్నిజెంట్‌లో ఉదోగ్యమును పొందుకున్నాడు. అతను ఇండియాలో పనిచేశాడు మరియు తరువాత యుకెకి వెళ్ళాడు. నేడు, అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో అనిల్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ అనే తన సొంత కంపెనీని ప్రారంభించాడు. అతను కారుణ్యలో చదువుకున్న ఆల్ఫాను వివాహం చేసుకున్నాడు. ఆల్ఫా గాయక బృంద సభ్యురాలిగా, ప్రార్థన సెల్ నాయకురాలిగా శిక్షణ పొంది, సన్నద్ధమై, ప్రార్థన ఉత్సవాలలో సేవలందించుచుండెను. కారుణ్యలో ఉండగానే, ఆమె టెక్ మహెంద్రాలో ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత సిటియస్‌కు మారి, చివరికి యుకెకి మరల మార్చబడ్డారు. ఆమె అరుణేష్‌ను వివాహం చేసుకుని నేషనల్ హెల్త్ సర్వీస్‌లో, ఆ తర్వాత బ్రిటిష్ టెలికామ్‌లో పనిచేసెను.

నా ప్రియులారా, నేడు, వారికి అనిల్ మరియు ఏంజెల్ అనే ఇద్దరు చక్కటి పిల్లలు ఉన్నారు, మరియు ఒక కుటుంబంగా, వారు తమ సహవాసం మరియు వృత్తి ద్వారా ప్రభువుకు సాక్ష్యమిచ్చుచున్నారు. వారు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రభువుకు గొప్ప సాక్షిగా ఉన్నారు. ఆలాగుననే, దేవుడు మీ హృదయ కోరికలను నిశ్చయముగా నెరవేరుస్తాడు. మీరు ఆయనకు భయపడి, మీ హృదయాన్ని మరియు జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన ప్రణాళిక వేసినవన్నీ మీ కోరికగా మారతాయి మరియు అవి మీ జీవితములో తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, దేవుడు మిమ్మును కూడా ఆలాగుననే ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు ఇటువంటి ఆశీర్వాదమును నేడు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక ప్రకారం మా హృదయంలో కోరికలను ఉంచినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము పరిశుద్ధముగాను, భయభక్తులతోను నడవడానికి మరియు మేము చేయు ప్రతి పనిలో నీ చిత్తాన్ని మాత్రమే వెదకడానికి మాకు సహాయం చేయుము. దేవా, మాలోని ప్రతి కోరికను నీకు ఇష్టమైన దానితో సమలేఖనం చేయుము. ప్రభువైన యేసు, మాలో జీవించుము మరియు మా ఆత్మను నీ ఆత్మతో ఐక్యపరచుము. దేవా, ప్రతిరోజు మా ఆలోచనలను, మా ఎంపికలను మరియు మా అడుగుజాడలను నడిపించుము. ప్రభువా, మా కోరికలు మాలో నీ సన్నిధి పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, నీవు మా కొరకు వ్రాసిన ప్రతి ప్రణాళికను నీ పరిపూర్ణ సమయంలో నెరవేరునట్లుగా చేయుము. దేవా, మేము సంపూర్ణంగా లోబడునట్లుగాను, మా ఉద్దేశం నీ ఉద్దేశముగా మారునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితంలో నీ కోరికలను మా పట్ల నెరవేర్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచున్నాము తండ్రీ, ఆమేన్.