నా ప్రియ స్నేహితులారా, మీకందరికి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 3:16వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను'' ప్రకారము దేవుడు చిన్నవారైన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. దేవుడు లోకమునంతటిని ప్రేమించాడు అని ఊహించడముకంటె, 'నిన్ను ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా ప్రేమించుచున్నాడు. అందుకే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించియున్నాడు. యేసుక్రీస్తు అనే చెప్పనశక్యముకానీ, గొప్ప బహుమానమును బట్టి, తండ్రికి మనము ఎల్లప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఈ క్రిస్మస్ సమయములలో నూతన వస్త్రములను కొనుక్కొనుటకు మనమందరము దుకాణములకు వెళ్లుతుంటాము కదా. సాధారణంగా, 3 చొక్కాలను కొనుక్కున్నట్లయితే, ఒక చొక్కా మీకు ఉచితముగా లభిస్తుంది అనే కొన్ని బోర్డులను మనము అక్కడ చూస్తుంటాము. ఉచితముగా మనము ఆ చొక్కాను కొనుక్కోవడములో మనకు ఎంతో ఆనందము కలుగుతుంది కదా! దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితమైన బహుమానమును బట్టి, మరి ఇంకా ఎంత అధికముగా మనము సంతోషించాలి కదా. కనుకనే, నా ప్రియులారా, మీపై ఉన్నటువంటి ప్రేమను బట్టి, యేసయ్యను తండ్రియైన దేవుడు మీ కొరకు అనుగ్రహించియున్నాడు. అందుకే ఆయన మీ పట్ల కలిగియున్న గొప్ప ప్రేమకు ఇదే ఋజువై ఉంటున్నది.

ఒకసారి, సౌత్ అమెరికా ఖండము యొక్క తీరములో ఒక నౌక ప్రయాణించుచుండెను. మేము ఇక్కడ నీళ్లు లేక చనిపోతున్నాము అని ప్రక్కన ప్రయాణిస్తున్నటువంటి మరొక ఓడకు వారు సూచనలు పంపుచున్నారు. అయితే, ప్రక్కన ఉన్న నీటిని తీసుకొని ముంచుకొని మీరు త్రాగండి అని వారు తిరిగి సమాధానము ఇచ్చారు. అమెజాన్ నది యొక్క ముఖ ద్వారమున మీరు ఉండియున్నారు. వారి చుట్టూర కూడా మంచి నీరు ప్రవహించుచున్నది, వారు చేయవలసిందంటూ ఏమి లేదు. వారు ఆ నీటిని ముంచుకొని, తీసుకొని త్రాగడమే. అయితే, వారు దాహముతో చనిపోతూ ఉండగా, వారి చుట్టూర కూడా సముద్రము యొక్క ఉప్పు నీరు ఉన్నది అని వారు అనుకున్నారు. వారు ఆలాగుననే అనుకున్నట్లయితే, దాహముతో చనిపోతారు. నా ప్రియులారా, అనేక సార్లు మనము కష్టసమయాలలో కూడా, ప్రభువు మన ప్రక్కనే మనకు తోడుగా ఉన్నాడు అని తెలియక మనము ఎంత తప్పు చేస్తుంటాము కదా. ప్రభువు మన చుట్టు మనకు తోడుగా ఉంటాడు అనే సంగతి మనము గ్రహించకుండా, ఎన్నిసార్లు తప్పు చేస్తుంటాము కదా! మరి ముఖ్యంగా కష్ట సమయాలలో ఆయన మన ప్రక్కన ఉన్నాడను సంగతిని మరచిపోయి, 'ప్రభువా, నీవు ఎక్కడ ఉన్నావు?' అని మొఱ్ఱపెడుతుంటాము. 'మేము నశించిపోతున్నాము లేక మేము మునిగిపోతున్నాము' అని అంటుంటాము. నా ప్రియ స్నేహితులారా, మనకు ఆయనను గూర్చిన జ్ఞానము లేకుండా మనము నశించిపోకూడదు. నేడు యేసయ్య మనకు అతి సమీపముగా ఉన్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, కేవలము మనము వంగి, ముంచుకొని, ఆ జీవజలములను తీసుకొని త్రాగి జీవించాలి. ఎందుకంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి, ఈ లోకములో ఎవ్వరు కూడా నశించిపోవడము ఆయనకు అస్సలు ఇష్టము లేదు. అందుకే మనలను రక్షించుట కొరకై ఆయన తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకమునకు పంపించెను. కనుకనే, మనము ఆయనను వెదకి కనుగొనులాగున ప్రభువు మన కొరకు ఇంత గొప్ప రక్షణ కార్యమును జరిగించియున్నాడు. కాబట్టి, ఆయన మనకు ఎంతో దూరముగా ఉన్నాడని తలంచకండి. యేసు మనకు దూరముగా ఎంత మాత్రము లేడండి. ఆయన మీకు అతి సమీపముగా ఉన్నాడు. ఇప్పుడే, మీరు ఆయనను కనుగొంటారా? మీరు యేసు వైపు చూస్తారా? ఆయన మిమ్మును జీవింపజేస్తాడు నా స్నేహితులారా. మీరు అవసరతలతో చనిపోనక్కర లేదు. ఈ లోకములో ఎవ్వరు నశించిపోవడము ప్రభువుకు అస్సలు ఇష్టము లేదు. మీరు నశించిపోవడానికి ఆయన అస్సలు అనుమతించడు. కనుకనే, మీరు జీవిస్తారు. యేసును బట్టి, మీరు నిశ్చయముగా జీవిస్తారు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ఉన్నపాటున మీరు యేసు నొద్దకు రండి, ఇప్పుడే, యేసుక్రీస్తు యొక్క రక్తము మిమ్మును శుద్ధులనుగా చేయుచున్నది. మీ గత పాపములను ఇక తలంచకుండా, మీరు యేసు నొద్దకు రండి, మీ పాపముల నుండి మిమ్మును విడిపించగల సమర్థుడై యున్నాడు. కనుకనే, ఆయన మీ పట్ల ఉన్న ప్రేమ చేత మీకు నిత్యజీవమును అనుగ్రహించియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానమును ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు మాపైన ఎంత ప్రేమను కలిగియున్నావు. దేవా, నీ యొక్క ప్రేమను బట్టి, నీవు ఈ లోకమునకు వచ్చియున్నందుకై నీకు వందనాలు మరియు నీవే మాకు లోక రక్షకుడుగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, పాపములోను, అనారోగ్యముతోను నశించిపోయే మమ్మును జ్ఞాకపకము చేసుకొని, నీ ప్రేమచేత మమ్మును జీవింపజేయుము. దేవా, మాకున్న శోధనలన్నిటిని నుండి నీవు మమ్మును విడిపించుము. యేసయ్యా, మా యొక్క హృదయాలలో నీవు ఇప్పుడే జన్మించుము. దేవా, నీవు మాకు నిత్యజీవమును అనుగ్రహించుము. తండ్రీ, మేము నిత్యజీవమును పొందగలిగేలా నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపినందుకు ధన్యవాదాలు. ప్రభువా, మేము ఈ లోకంలో భాగస్థులము కాకుండా, నీ స్వంత అమూల్యమైన బిడ్డలనుగా మమ్మును వ్యక్తిగతంగా ప్రేమించినందుకు వందనాలు. దేవా, నీ ప్రేమ యొక్క లోతును నిజంగా మేము అర్థం చేసుకోవడానికి మరియు యేసు యొక్క చెప్పశక్యముకానీ బహుమానమును పొందుకొని, కృతజ్ఞతతో జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము ఊహించిన దానికంటే అత్యధికముగా నీవు మాకు ఎంతో సమీపముగా ఉన్నావని మాకు గుర్తు చేసినందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, మేము నిన్ను చేరుకోవడానికి, లోతుగా ఉన్న నీ జీవజలమును ముంచుకొని త్రాగడానికి మరియు నీ సన్నిధిలో జీవితాన్ని కనుగొనడానికి మాకు నేర్పుము. యేసయ్యా, మా హృదయం ఎల్లప్పుడూ నీయందు నమ్మిక కలిగి జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా చుట్టు నీవు మాకు తోడుగా ఉన్నావని మేము గుర్తించునట్లుగా కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీవు మాలో ఉన్నప్పుడు జీవితంలో మాకు అవసరమైనవన్నియు మేము పొందుకొనియున్నామని నమ్మునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.