నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 11:28వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' ప్రకారం ఈ నెలలో దేవుడు మీ భారములన్నియు తొలగించుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహించుచున్నాడు. అయితే, మీరు యేసు చెంతకు వచ్చుచుండగా, ఆయన మీ భారములను తొలగించి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ప్రభువు నాకు ఏమని చెప్పాడంటే, "ఈ సంవత్సరము తన సేవకులకు విశ్రాంతి కలుగు సంవత్సరము '' అని తెలియజేశాడు. కనుకనే, నేడు వారు చేయుచున్న పోరాటములన్నియు మరియు వారు ఎదుర్కొంటున్న ఆటంకములన్నియు ప్రభువు చేత తొలగించబడుచుండుట మాత్రమే కాదు, వారికి విశ్రాంతి అనుగ్రహించబడుతుంది. అది దేవుని చిత్తమును జరిగించుట కొరకైన విశ్రాంతి వారికి అనుగ్రహించబడుతుంది. ఈ యొక్క వాగ్దానము వచనము, దేవుని పిల్లలకు మరియు ఆయన సేవకులకు ఇవ్వబడినది. ఇంకను మత్తయి 11:29,30వ వచనములను మీరు చదివినట్లయితే, ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చియున్నాడు, "నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి'' ప్రకారం యేసు అను కాడిని మీరు మీదికి తీసుకున్నప్పుడు అది మీకు తేలికగా ఉంటుంది. అప్పుడు మీరు విశ్రాంతిని కలిగియుందురు.

నా ప్రియులారా, అనేక ఫర్యాయములు మన భారములను యేసు యొద్దకు మోసుకుంటూ, ఆయన చెంతకు తీసుకొని వెళ్లతాము. ప్రతిరోజు కూడా, " ప్రభువా నా బిడ్డలను గురించి, నా భర్త/భార్యను, ఉద్యోగము మరియు సేవా పరిచర్యను గురించి, నా లక్ష్యమును, చదువులను, పరీక్షలను గురించి జాగ్రత్త వహించుమని'' ప్రార్థన చేస్తుంటాము. ఆలాగుననే, మన యొక్క భారములను మోస్తుంటాము. మనము మన భారములను మోయుచున్నాము. కానీ, ప్రభువు సెలవిచ్చుచున్నాడు, "నా భారములను మోయండి. నా బిడ్డా, నా యొక్క భారమును మోయండి, అప్పుడును మీరు విశ్రాంతిని కలిగియుందురు'' అని చెబుతాడు. ఇది ఎంత అద్భుతకరముగా ఉన్నది కదా! అయితే, దేవుని యొక్క భారము అనగా ఏమిటి? ప్రభువు యొక్క భారములతో పోల్చుకున్నట్లయితే, మన భారములు అతి చిన్నవిగా ఉండేవి. మన భారములను మనము మోయలేకపోవుచున్నాము కదా! కానీ, ప్రభువు యొక్క భారములను మనము ఏలాగున మోయగలము అని మీరు ఆశ్చర్యపోవుచుండవచ్చును? ఆయన భారములు ఎటువంటివి? అని యేసు యొక్క భారము, "మానవాళిని పాపము యొక్క శాపము నుండి విమోచించుటయే.'' అందుకే, 1 తిమోతికి 2:4వ వచనములో చూచినట్లయితే, "ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు'' ప్రకారం ఇదియే దేవుని యొక్క భారమై యున్నది. ఇంకను అందరును రక్షణ పొందాలనేది ఆయన కోరిక. అదే ఆయన కలిగియున్న భారం. ఆలాగుననే, బైబిల్‌లో యోహాను 9:4-5వ వచనములు మనకు గుర్తుచేయుచున్నది: "పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను'' ప్రకారం రాత్రి వస్తుంది. చీకటి భూమిని కప్పుతుంది, అప్పుడు మనము ఏమి చేయలేము. కానీ, బైబిల్‌లో యెషయా 60:1-2వ వచనములలో ఇలాగున చెబుతుంది, " నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది'' ప్రకారం ఇంకా పగలు ఉండగానే, లోకానికి వెలుగైన యేసును ఇతరులకు తీసుకొని వెళ్లండి. అందుకే యేసు ఇలాగున అంటున్నాడు, " ఇప్పుడు మీరు నన్ను మోయండి.'' ఇది యేసు యొక్క పిలుపు: "నా పరిచర్యకు సహాయమును అందించండి. ఇంకను నా వెలుగును ప్రజలకు తీసుకురండి.'' అవును, " ప్రభువా, నేను నిన్ను ఇతరులకు మోసుకొని వెళతాను'' అని మీరు చెబుతారా? మీరు అలాగున చేసినప్పుడు, మీ జీవితంలో సమస్తమును అంతయు విశ్రాంతిగా ఉంటుంది మరియు నెమ్మదిగా మారుతుంది.

బైబిల్‌లో లూకా 22:42-44వ వచనములలో చూచినట్లయితే, గెత్సేమనేలో యేసు రక్తాన్ని చెమటలు కారుచున్నప్పుడు, రక్షణ భారాన్ని మోయుచున్నట్లుగా మనం చూడగలము. ఆయన ఈ లక్ష్యాన్ని విడిచిపెడతాడు అని ఎదురుచూస్తూ, సాతాను పక్కనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చి, ఆయనకు భవిష్యత్తును, ఆయన పునరుత్థానం, విజయం మరియు మహిమను ప్రత్యక్షపరచాడు. మరియు యేసు, " నీ చిత్తము నెరవేరును గాక'' అని ప్రకటించాడు. సాతాను అతని ముఖం మీద పడి, " నా పని సమాప్తమైపోయింది'' అని కేకలు వేసెను. ఎందుకనగా, యేసు విజయం సాధించుటకు, ధైర్యంగా సిలువ దగ్గరకు వెళ్ళాడు. యేసు విజయం సాధించి ధైర్యంగా సిలువకు వెళ్ళాడు. నేడు, ఆయన చేసిన త్యాగం ద్వారా, అందరూ రక్షింపబడటానికి మార్గం తెరవబడియున్నది. దేవుడు యేసును మృతులలో నుండి లేపడం ద్వారా ఆయనకు విశ్రాంతి కలుగజేశాడు. కనుకనే, నా ప్రియులారా, అదేవిధముగా, మీరు కూడా ఆయన పిలుపునకు లోబడినప్పుడు ఆయన మిమ్మును కూడా లేపుతాడు. యేసు ప్రజల భారాలను కూడా మోసాడు. ఇంకను మత్తయి 9:35-36వ వచనముల ప్రకారం ఆయన జనసమూహాల పట్ల కనికరపడి, వారిని స్వస్థపరచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు మరియు కుటుంబాలను ఏకం చేశాడు. ఆలాగుననే, మీరు కూడా అదే భారాన్ని మోయాలని మరియు ప్రజలకు అద్భుతాలు చేయాలని దేవుడు నేడు మీ పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, ఆయనక కలిగిన ఆ భారమును మీరు కూడా కలిగియున్నప్పుడు, నిశ్చయముగా మీ కొరకు తలుపులు తెరచి ఉంచబడతాయి.

నా ప్రియులారా, దేవుని ప్రజలను నడిపించే భారంతో మోషే గందరగోళ పరిస్థితులో చిక్కుకున్నాడు. బైబిల్‌లో సంఖ్యాకాండము 11:12-15వ వచనములో చూచినట్లయితే, అతను, " ప్రభువా, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము'' అని మొఱ్ఱపెట్టాడు. పరిచర్య ఇతరుల కన్నీళ్లను మోస్తుంది. యేసు, నా తండ్రిని పిలిచినప్పుడు, ఆయన ఇలా అన్నాడు, " వారి సమస్యలు నీవే అన్నట్లు నీవు మొఱ్ఱపెడతావు. నీవు నాకు మొఱ్ఱనప్పుడు, నేను వచ్చి నీ కన్నీళ్లను చూసి, వారి కన్నీళ్లను తుడిచివేస్తాను.'' నిజానికి, నా తండ్రి చాలా బాధలను అనుభవించారు. కానీ, దేవుడు లక్షలాది మందికి స్వస్థతను చేకూర్చడానికి ఆయన కన్నీళ్లను ఉపయోగించారు. బైబిల్‌లో, సంఖ్యాకాండము 11:16-25వ వచనములలో, దేవుడు మోషేకు ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి డెబ్బదిమంది మనుష్యులను సహాయకులుగా అందించాడు. మరియు నేడు బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:17 వ వచనము వాగ్దానం చేయుచున్నది, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ Äౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు'' ప్రకారం నా ప్రియులారా, దేవుడు తన భారాన్ని మోయడానికి మరియు అద్భుతాలు చేయడానికి మిమ్మల్ని కూడా తన ఆత్మతో నింపుతాడు. మీరు ఈ పరిచర్యలో భాగస్థులుగా మారతారా? యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ప్రార్థన యోధులుగాను లేదా రాయబారిగా మారండి. తన స్నేహితుల కొరకు ప్రార్థించి రెట్టింపు ఆశీర్వాదాలు పొందిన యోబువలె, మీరు కూడా యేసు భారాన్ని మోయుచున్నప్పుడు, ఆయన మీ భారాన్ని తొలగించి, నేటి వాగ్దానము ద్వారా మీకు విశ్రాంతినిచ్చి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము అలసిపోయి భారం మోయుచున్నప్పుడు నీ దగ్గరకు రమ్మని ప్రేమతో మమ్మును ఆహ్వానించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నేను ఈ రోజు నీ సన్నిధికి వచ్చుచున్నాము, మేము మోయుచున్న ప్రతి భారీ భారాన్ని తొలగించి, మాకు విశ్రాంతిని అనుగ్రహించుము. ప్రభువా, ఇతరులకు ప్రేమ, కనికరము మరియు రక్షణ అనే భారమైన నీ కాడిని మోయడానికి మాకు నేర్పించుము. దేవా, మా స్వంత చిత్తాన్ని కాకుండా, నీ చిత్తాన్ని చేయడానికి మమ్మును నీ కృప మరియు ధైర్యంతో నింపుము. పరిశుద్ధాత్మ దేవా, మా హృదయాన్ని యేసువలె కనికరముతో కదిలించి, నశించిన వారిని, విరిగినలిగిన వారిని మరియు సొమ్మసిల్లిపోయిన వారిని ఓదార్చడానికి మరియు పరిచర్య చేయడానికి మమ్మును నీ ఆత్మ శక్తితో నింపుము. దేవా, మేలు చేయడంలో మేము ఎప్పుడూ అలసిపోకుండా ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఇతరుల భారాలను మోయడానికి మేము నీతో కూడా ఉన్నప్పుడు, నీవు వాగ్దానం చేసిన అత్యధికమైన విశ్రాంతిని కనుగొనడంలో మాకు సహాయం చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అతిమధురమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.