నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 23:6వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని చెప్పబడినట్లుగానే, మీ బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మీ వెంట వచ్చును. అవును, తన చిన్నతనములో నుండి దేవుని ఎంతో జాగ్రత్తగా దేవుడు వెదకియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23వ అధ్యాయము ఎంతో ప్ర్రఖ్యాతిగాంచిన కీర్తన అని మన అందరికి తెలుసు కదా. అవును, కీర్తనలు 23:1వ వచనములో కీర్తనాకారుడైన దావీదు ఈలాగున అంటున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ కాపరిగా ఉండాలని మీరు కోరుకొనవలెను. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దావీదు వలె అదే విషయమును చెప్పాలి. ప్రభువును, మీరు కాపరిగా కలిగియుండే అనుభవమును మీరు కూడా కలిగియున్నారా? దావీదు ఈ అనుభవమును కలిగియున్నందున బట్టి, దేవుడు అతనిని ఎంతగానో ఆశీర్వదించియున్నాడు. కనుకనే, మీరు ఆయనను మీ కాపరిగా ఉంచుకొనండి.

అందుకే బైబిల్ నుండి యెషయా 60:22వ వచనములో మనము చూచినట్లయితే, "వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' అని చెప్పబడినట్లుగానే, నేడు ఒంటరిగా ఉన్న మిమ్మును వేయిమందియగునట్లుగా మరియు ఎన్నికలేని మిమ్మును బలమైన జనమగునట్లుగా చేస్తాడు. పై చెప్పబడిన లేఖనానుసారముగా దావీదు కేవలము ఒక గొఱ్ఱెల కాపరిగా ఉన్నప్పటికిని, అతడు దేవుని తన పరలోకపు తండ్రిగా అతడు భావించియున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసెదను అని దావీదు చెప్పియున్నాడు. అందును బట్టి, బైబిల్ నుండి యెషయా 60:22వ వచనములో ఉన్న రీతిగానే, " ఒంటరియైనవాడు వేయిమందియగును'' అని లేఖనము చెబుతుంది. దావీదు కేవలము ఒక చిన్న గొఱ్ఱెల కాపరియైనప్పటికిని, అతని జీవితములో ఏమి జరిగింది? అందుకే బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 29:28వ వచనములో చూచినట్లయితే, "అతడు వద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను'' అని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే, ఈ లోకములో అతని యొక్క దినములు హెచ్చుగా ఉన్నవి. దేవుడు అతనిని దీవించాడు. దానికి కారణమేమై యున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అనేది అతని యొక్క నిరీక్షణయై యున్నది.

నా ప్రియులారా మరియు యౌవనస్థులారా, యేసయ్యను మాత్రము మీ రక్షకుడు అని మీరు విశ్వసించుచున్నారా? మీ యౌవ్వన వయస్సులో యేసయ్య ను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, దావీదు ఆశీర్వదించబడినట్లుగానే, మీ జీవితమంతయు దీవెనకరముగా మారిపోతుంది. ఇప్పుడే మన జీవితములను యేసుక్రీస్తునకు సమర్పించి, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములన్నిటిని పొందుకుందాము. నేడు నా ప్రియులారా, మీరు కూడా దావీదువలె ఆయనను మీరు కాపరిగా ఉంచుకొని, దేవుని వెదకినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును దావీదు వలె ఆశీర్వదించును. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నిన్ను రక్షకునిగా అంగీకరించునట్లుగాను, మాకు నీ రక్షణను అనుగ్రహించి, మా పాపముల నుండి మమ్మును విడిపించి, నీ యొక్క దైవీకమైన సమాధానమును మాకు దయచేయుము. దేవా, దావీదు జీవితమును బట్టి మరియు మా మంచి కాపరిగా ఉన్నందుకు మీకు వందనములు. ప్రభువా, ఒంటరిగా ఉన్న మేము వేయిమందిగా అభివృద్ధి అగునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మేము నీకు సమీపముగా ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము చిన్నప్పటి నుండి మిమ్మును శ్రద్ధగా వెదకడానికి మరియు మా పరలోక తండ్రిగా నిన్ను నమ్మడానికి మాకు సహాయము చేయుము. ప్రభువైన యేసయ్యా, నిన్ను మా ఏకైక రక్షకునిగా అంగీకరించి, మా బ్రతుకు దినములన్నియు నీ మందిరములో నివసించే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా పాపములన్నిటి నుండి మరియు సమస్త కీడుల నుండి మమ్మును కాపాడి రక్షించి, నీ మార్గములలో మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితములను సమాధానము, ఆనందము, ఐశ్వర్యం, ఘనత మరియు సమద్ధియైన దీవెనలతో మమ్మును నింపుము. దేవా, మా జీవితములు అభివృద్ధి పొందుచూ, అనేకులకు దీవెనకరముగా మారునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతి రోజు మమ్మును నీకు అత్యంత సమీపముగా వచ్చునట్లుగా మమ్మును మార్చుము. దేవా, దావీదు వలె మేము నిత్యము వెదకునట్లుగాను, దావీదు వలె మా జీవితములలో నీ దీవెనలను విస్తరింపజేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.