నా ప్రియ స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగుపెట్టిన మీకందరికి నా శుభములు తెలియజేయుచున్నాను. నేటి నుండి మనం క్రిస్మస్ పండుగ కాలమును జరుపుకుంటున్నప్పుడు, మన యొద్దకు వచ్చే గొప్ప సత్యం ఇది: 'దేవుడు ప్రేమా స్వరూపి' అని మనకు గుర్తు చేయుచున్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 4:7,8వ వచనములలో చూచినట్లయితే, "ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు'' అని చెప్పబడిన ప్రకారము ఈ ప్రేమ క్రిస్మస్ రోజున మానవ స్వరూపం ధరించి, యేసు రూపములో మన కొరకు దిగివచ్చినది. అందుకే బైబిల్ నుండి యోహాను 3:16వ వచనములో చూచినట్లయితే, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను'' అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, యేసు దేవుని ప్రేమకు ప్రతిరూపం. ఆయన ప్రేమతో నింపబడియున్నాడు. ఇంకను 1 యోహాను 4:9వ వచనములో చూచినట్లయితే, " మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను'' ప్రకారం, యేసు ప్రేమ స్వరూపియైన దేవుని మన ముందుకు తీసుకు రావడానికి వచ్చాడని చెప్పబడియున్నది. ప్రేమ మనకోసం మానవ రూపంలో దిగి వచ్చినది. ఈ ప్రపంచం ద్వేషం, దురాశ మరియు స్వార్థంతో నిండియున్నది. కానీ, ప్రేమ మనలను నిజమైన ప్రేమను ఆనందించునట్లుగా చేయడానికి దిగి వచ్చినది, అదియే దేవుని ప్రేమయై యున్నది. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 6:23వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము'' ప్రకారము మన పాపాలను క్షమించి ప్రాయశ్చిత్తం చేయుటకు ఈ ప్రేమ బహుమానముగా యేసు ద్వారా మన యొద్దకు దిగివచ్చినది. బైబిల్ నుండి యెషయా 53:5 వ వచనములో చెప్పబడినట్లుగానే, " మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' ప్రకారము మనం క్షమించబడటానికి సిలువపై ఆ ప్రేమ తనను తాను తీర్పు తీర్చుకొనెను.
అదేవిధముగా, బైబిల్ నుండి 1 కొరింథీయులకు 13:4వ వచనములో చూచినట్లయితే, " ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు'' అని చెప్పబడిన ప్రకారము అవును, మన పాపములకు క్షమాపణ తీసుకురావడానికి మరియు ద్వేషం, శరీరాశ మరియు జీవడంబము నుండి మన హృదయాలను శుద్ధి చేయడానికి యేసు సిలువపై బాధను అనుభవించాడు. కనుకనే, ఆ ప్రేమ మనలను బాగుపరుస్తుంది. మనం చేయవలసిందల్లా ఈ ప్రేమ దగ్గరకు, యేసు దగ్గరకు వచ్చి, 'ప్రభువా, నన్ను క్షమించు మరియు నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించుము' అని చెప్పి ఆయనకు విధేయత చూపుటకు మిమ్మును మీరు తగ్గించుకోవాలి. కనుకనే, మీరు ఇలాగున పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన మిమ్మల్ని క్షమించి తన ప్రేమతో నింపడానికి నమ్మదగినవాడుగా ఉన్నాడు. ఈ ప్రేమ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది మరియు మీకు జీవితాన్ని ఇస్తుంది. ఈ ప్రేమ మిమ్మల్ని భద్రంగా కాపాడుతుంది మరియు మీకు జీవమును కలుగజేయుచున్నది. డైసీ అనే సహోదరి ఈ ప్రేమను అనుభవించినట్లుగా మనము చూడగలము. పువ్వులు అమ్ముకునే ఒక స్త్రీ, ఆమె ఒక పేదరాలు, ఆమె భర్త ఒక త్రాగుబోతు. ఒకరోజు, యేసు పిలుచుచున్నాడు కూటములో, ప్రభువు నా తండ్రిగారైన సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారి ద్వారా ఆమె పేరును పెట్టి పిలిచారు. ఇంకను తాగి బయట నిలబడి ఉన్న ఆమె భర్తను లోపలికి పిలిచారు. అతడు లోపలికి వచ్చినప్పుడు మా తండ్రిగారు అతనిని కౌగిలించుకున్న మరుక్షణంలోనే, 28 సంవత్సరాల త్రాగుడు వ్యసనం ఆ తర్వాత, అతను విడుదలను పొందుకున్నాడు. దేవుని ప్రేమ అతనిని పరిపూర్ణంగా బాగుపరచినది. అంతమాత్రమే కాదు, దేవుడు వారి కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాడు, వారికి ఒక ఇల్లును కూడా దయచేశాడు మరియు వారిని తన ప్రేమలో స్థిరపరచాడు.
నా ప్రియులారా, యేసు ద్వారా ప్రేమ ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు, ఆయన రోగులను స్వస్థపరచి, వెనుకబడిన వారిని విడిపించాడు. బైబిల్ నుండి మత్తయి 9:35 వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రజల పట్ల గొప్ప కనికరమును కలిగియున్నాడని చెప్పబడియున్నది. ఇంకను బైబిల్ నుండి మార్కు 1:41వ వచనములో మనము చూచినట్లయితే, ఒక కుష్ఠురోగి కేకలు వేసినప్పుడు, ఆయన వాని మీద కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. యేసు ప్రేమతో కదిలి, అతనిని స్వస్థపరచాడు. మరియు అపొస్తలుల కార్యములు 10:38వ వచనములో చూచినట్లయితే, "అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను'' ప్రకారం, యేసు ప్రేమ అభిషేకం తనపై ఉన్నందున ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచాడు. బైబిల్ నుండి మత్తయి 8:17వ వచనములో చూచినట్లయితే, "ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను'' ప్రకారము యేసు మన రోగములను భరించి, మన బలహీనతలను తన మీద భరించాడని మనకు గుర్తు చేయుచున్నది. ప్రేమ మనలను బాగుచేయడానికి ఈ లోకమునకు వచ్చినది.
ఇటానగర్‌కు చెందిన శ్రీమతి నబమ్ హనియా అనే సహోదరిని ఒక పురుగు కుట్టడముతో ఆమె కాలు పక్షవాతానికి గురైనది. ఆ కాలును తొలగించాలని వైద్యులు చెప్పారు. కానీ ఆమెను యేసు పిలుచుచున్నాడు కూటానికి తీసుకెళ్లినప్పుడు, పరిశుద్ధాత్మ ఆమెను తాకింది. దేవుని ప్రేమ ఆమె మీదికి దిగి వచ్చినది, మరియు ఆమె కాలు తక్షణమే బాగుపరచబడినది. నా ప్రియులారా, ఈ రోజు, ఆమె పరిపూర్ణంగా స్వస్థపరచబడి, చక్కడ నడవసాగినది. అవును, ప్రేమ మనలను బాగు చేయును. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ కాలములో ఈ పరిపూర్ణమైన ప్రేమాస్వరూపియైన యేసు యొద్దకు మీరు ఉన్న పక్షముగానే రండి. ఆయన ప్రేమ మిమ్మును క్షమించును, స్వస్థపరుచును మరియు పునరుద్ధరించును. కనుకనే, నా ప్రియులారా, దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబాన్ని ఈ ప్రేమతో నూతన మాసమంతయు ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల మా ప్రభువైన యేసు, ఈ లోకంలోనికి నీవు ప్రేమను ధరించుకొని వచ్చినందుకై నీకు వందనాలు. దేవా, నీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ అంటే ఏమిటో తాను చేసిన త్యాగం ద్వారా మాకు చూపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని పాపములన్నిటి నుండియు, ద్వేషం మరియు స్వార్థం నుండి పరిశుద్ధపరచుము. దేవా, మమ్మును నీ యొక్క ప్రేమతో నింపుము మరియు నీ తాకుదల కొరకు ఎదురు చూస్తున్న మా పట్లను మరియు ఇతరులకు నీ కనికరము మా ద్వారా ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మా హృదయంలోనికి ప్రతి గాయాన్ని మరియు మా శరీరంలోని ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచుము. దేవా, ఈ బాధ మరియు విభజన లోకములో మమ్మును నీ ప్రేమ యొక్క పాత్రగా మార్చుము. యేసయ్యా, ఇమ్మానుయేలు (మనకు తోడుగా ఉన్న దేవుడు) అని చెప్పబడినట్లుగానే, నీ సన్నిధిని యొక్క నిశ్చయతలో అనుదినము మేము జీవించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, ఈ క్రిస్మస్, మా జీవితంలో మరియు మా కుటుంబంలో నీ ప్రేమ పొంగిపొర్లునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


