నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 6:14వ వచనమును మీ కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు'' అని చెప్పబడిన ప్రకారం యేసు మీ యొక్క జీవితమునకు ప్రభువుగా ఉండును. పాపమే ఎరుగనివాడు ఆయన. మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథము ఈలాగున చెబుతుంది, "పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను'' అని చెప్పబడియున్నది. దేవుని యొక్క విస్తరించుచూ ఉండియున్న కృప. అందుకే బైబిల్‌లో యోహాను 1:16వ వచనములో చూచినట్లయితే, "ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి'' ప్రకారము ఆయన పరిపూర్ణతలో నుండి అత్యధికమైన కృప విస్తరిస్తుంది. అది యేసు యొక్క పరిపూర్ణమైన కృప, అది అత్యధికముగా విస్తరించుచుండు కృప. ఎందుకనగా, పాపము మన వెంబడి వస్తూనే ఉంటుంది. అది మన విశ్వాసమును నాశనము చేయడానికే వస్తూనే ఉంటుంది. అది మన బలాన్ని నాశనము చేయడానికి వస్తూనే ఉంటుంది. అది మనలను యేసు నుంచి దూరముగా తీసుకొని వెళ్లిపోవడానికి వస్తూనే ఉంటుంది.

కానీ, నా ప్రియులారా, మరొక వైపు దేవుని కృప విస్తరించునట్లుగా మన యొద్దకు వస్తూనే ఉంటుంది. ప్రభువు తన కృపను మరియు కనికరమును మన వెంబడి పంపిస్తాడు. ఆయన కృప ద్వారా మనము ఇంకను నిర్మూలము కాకున్నాము. ఆయన కనికరమును బట్టి మనము ఇంకను లయము కాకుండా ఉన్నాము. ఆయన కనికరము ప్రతి ఉదయమున మనకు నూతనముగా పుట్టుచున్నది. ప్రతి ఉదయమున ఆయన వాత్సల్యత మన మీద నూతనముగా ఉండి యున్నది. కనుకనే, ప్రతి రోజున దేవుడు మీ కోసము కనికరమును ఉత్పత్తి చేయుచున్నాడు. నూతనముగా ఈ కనికరము ఎక్కడ నుండి వస్తుంది? ఇటువంటి కృప యేసు యొక్క కరుణా పీఠము చెంత నుండి వస్తుంది. మనము ఆ యొక్క కరుణాపీఠము చెంతకు ధైర్యముగా వెళ్లవచ్చును. ఇంకను దేవునిని అడగండి, 'మాకు కనికరమును చూపుము' అని దేవుని మనము అడుగగలము. దేవుని కృప మన యొద్దకు వస్తుంది, ఆ కృప మనలను భద్రపరుస్తుంది మరియు కాపాడుతుంది. తద్వారా, మనము ఇక మీదట ఏ మాత్రము పాపమునకు బానిసలము కాము, పాపము మరియు దానికి సంబంధించిన అంధకార సంబంధము యొక్క శక్తిని నాశనము చేయుట ద్వారా మనము దాని మీద ప్రభుత్వము చేయుదము.

నేను నా జీవితమును యేసునకు సమర్పించుకున్నప్పుడు, నాకు 18 సంవత్సరముల వయస్సు. యేసు తన రక్తము చేత నా పాపములను కడిగివేసియున్నాడు. 'దేవా, నా పాపములను కడిగివేయుమని' ప్రార్థించుట ద్వారా నాకు ఆలాగున చేయమని ఆయనను అడిగినప్పుడు, ఆయన నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధునిగా చేశాడు. అయితే, కొద్ది కాలము తర్వాత, నేను సైకిళ్లులో కళాశాలకు వెళ్లుచున్నప్పుడు, నేను ఆ యొక్క చిత్రాలను చూచి యున్నప్పుడు, వీధులలో ఉన్న సంగీతాలను ఆలకించుచున్నప్పుడు, లోకపరమైన శోధనలు తిరిగి మరల నా ఆత్మలోనికి రావడానికి ఆరంభిస్తున్నట్లుగా ఉండేది. అవి నా యొక్క మనస్సును యేసు నుండి దూరముగా లోకపు భోగేచ్ఛలకు ఆకర్షించునట్లుగా ఉండేది. 'ప్రభువా, నేను బలహీనుడను, నేను పడిపోతానేమో?' అని నేను మొఱ్ఱపెట్టేవాడను. కానీ, ఆ సమయములోనే, పరిశుద్ధాత్ముడు నాలో నుండి పైకి లేచాడు. పరిశుద్ధాత్ముడు నాలోనికి పైకి లేచి, ఆయన ఏమని చెప్పేవాడంటే, 'నా కుమారుడా, యేసు పాపమునకున్న శక్తిని నాశనము చేసియున్నాడు. కనుకనే, ఆయనను స్తుతించు, స్తుతించు' అని చెప్పాడు. ఆలాగున నేను పరిశుద్ధాత్మ దేవుని స్తుతించునట్లుగా చేశాడు. క్రొత్త భాషలతో మాట్లాడునట్లుగా, దేవుని యందలి ఆనందము నన్ను నింపి ఉండేది. నూతనమైన ఆత్మ నాలోనికి వస్తుంది. అప్పుడు నేను, నన్ను శోధించుచున్న, అపవాదిని చూచి, 'యేసు నామమున నన్ను విడిచిపెట్టి వెళ్లిపో ' అని ధైర్యముగా చెప్పగలుగుతాను. వెంటనే, దైవ శక్తి నాలోనికి వచ్చి, నన్ను నింపుతుంది, నాకు విడుదలను అనుగ్రహించుట జరుగుతుంది. నా ప్రియులారా, ఆలాగుననే, ఈ రోజున మీరు అన్ని విషయాలలో విడుదల పొందుకుంటారు. కారణము, మీరు కృప క్రింద ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీ పక్షమున పోరాడుతాడు. కనుకనే మీరు భయపడకండి. ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వము చేయనేరదు. కేవలము యేసు మాత్రమే మీ మీద ప్రభుత్వము చేయును, ఆయన మీకు ప్రభువుగా ఉండి, నేటి వాగ్దానము ద్వారా మీ పాపము నుండి విడుదలను అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము గల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, పాపం ఇకపై మాకు యజమానిగా ఉండదని నీవు ఇచ్చిన వాగ్దానానికై నీకు వందనాలు. ఎందుకంటే , మేము ధర్మశాస్త్రం క్రింద కాదు, కృప క్రింద ఉన్నాము. దేవా, మా మీదికి నీ యొక్క బలమైన అభిషేకము, కృప దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మాకు దురాత్మలను త్రోలివేయు అధికారమును అనుగ్రహించుము. యేసయ్యా, శోధించు దురాత్మలు, మా ఆత్మను , మా మనస్సులను, మా దేహములను, మా భోగేచ్ఛల నుండి బయటకు వచ్చునట్లుగా యేసు నామమున మేము విడుదల పొందుకొనునట్లుగా అటువంటి కృపను నేడు మాకు దయచేయుము. దేవా, మమ్మును నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా మమ్మును రక్షించడానికి వచ్చే పరిపూర్ణమైన కృపకు మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, ప్రతి ఉదయం మీ కనికరము నూతనముగాను ఉండునట్లుగా మేము ఈ రోజు ధైర్యంగా నీ యొక్క కరుణాపీఠం వద్దకు వచ్చుచున్నాము. యేసయ్యా, నీ యొక్క విలువైన రక్తంతో మమ్మును కడిగి, నీ కృపతో మమ్మును కప్పి, రక్షించుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో లేచి మా బలహీనతలో మా కొరకు పోరాడునట్లుగా చేయుము. ప్రభువా, పరలోక మహిమ మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క శాంతి మా జీవితములో వర్థిల్లునట్లుగాను, విజయము వెంబడి విజయమును మాకు దయచేయుము. దేవా, మా జీవితములో ప్రతి కోణములో మేము లేవనెత్తబడి, ప్రకాశవంతముగా రాణించే కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీవు మాతో ఉన్నావనియు, ఆయన మమ్మును ప్రేమించునట్లుగా మేము గుర్తెరగునట్లుగా చేయుము. దేవా, యేసు పాప శక్తిని నాశనం చేశాడని నమ్ముతూ బలంగా నిలబడటానికి మాకు సహాయం చేయుము. దేవా, యేసు మాత్రమే మా జీవితానికి ప్రభువు అని మేము ప్రకటించునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీ యొక్క ఆనందంతో మమ్మును నింపి, మా ఆత్మను మరల పునరుద్ధరించి మరియు మమ్మును స్వాతంత్య్రములోనికి నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.