నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మిమ్మును తన నవ్వుతో నింపవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఆయన మీ నోటి నిండ మీకు నవ్వు కలుగజేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 8:22వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండ నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపు ను'' అని చెప్పబడిన ప్రకారము ఆయన మీ జీవితములోనికి నవ్వును తీసుకొని వచ్చుచున్నాడు. కనుకనే, మీరు ప్రతి ఆశీర్వాదమును అనుభూతి చెంది, ఆనందించుటకు మీకు ఆనందమును అనుగ్రహించును. ఈ రోజున అన్నియు ముగిసిపోయినవని మీరు అనుకుంటున్నారు? అన్నియు కూడా మీరు నష్టపోయినట్లుగాను, నేను ఎంతగానో పని చేయుచున్నాను, నేను ఎంతో ప్రయత్నించుచున్నాను గానీ, నేను పని చేసిన రీతిలో నాకు ప్రతిఫలము రావడము లేదు అని అంటుండవచ్చును. అయితే, దేవుడు నవ్వును మీ యొద్దకు తిరిగి తీసుకొని రానై యున్నాడు. ఇంకను గొప్ప సాఫల్యతను తీసుకొని వచ్చుచున్నాడు. ఆలాగుననే, మీ ప్రయాసకు ప్రతిఫలము ఇచ్చుట ద్వారా, ఆలాగుననే, ప్రేమ మరియు నవ్వును మిమ్మును ఆవరించుట ద్వారా, దేవుడు మీకు ఆనందమును కలుగజేయుచున్నాడు.

ఆలాగుననే, బైబిల్‌లో నవ్వును కలిగించిన ఒక స్త్రీ ఉండెను. ఆమె పేరు శారా. ప్రభువు తన భర్తయైన అబ్రాహామునకు ప్రత్యక్షమై, ' నీ భార్య గర్భము ధరించును' అని చెప్పినప్పుడు, 'ఇది ఏలాగున సాధ్యము' అని తన మనస్సులో తలంచి ఆమెలో నవ్వు కలిగించెను. ఇంకను ఆమె తనలో, 'నేను గర్భము దాల్చు వయస్సును దాటిపోయి ఉన్నాను కదా! నా భర్త కూడా చాలా వృద్ధుడైపోయి యున్నాడు. కానీ, నేను బిడ్డను కలిగియుండడానికి ఇక ఏ మార్గము కూడా లేదు ' అని నవ్వి యుండెను. కానీ, దేవుడు, " నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందలి యిసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.'' అయితే, శారా దీనిని నమ్మలేకపోయెను. ఆమె అవిశ్వాసము చేత ఆ మాటలకు ఆమెకు నవ్వు కలుగజేసెను. కానీ, దేవుడు మహా అద్భుతంగా తన వాగ్దానమును నెరవేర్చెను. తన యొక్క వృద్ధాప్యములో నుండి యు మరియు తన స్వంత గర్భములో నుండియు దేవుడు వారికి ఒక స్వంత బిడ్డను అనుగ్రహించియున్నాడు. అవును, తద్వారా, ఆమె ఇస్సాకును కని యుండెను. ఇస్సాకు అనగా, 'నవ్వు' అని అర్థము. తన జీవిత కాలమంత యు కూడా 'నవ్వు' అని అర్ధమును కలిగించునట్లుగా తన కుమారునికి పేరు పెట్టి పిలుచుచూ ఆమె ఎంతగానో నవ్వుచుండెను. తన కుమారుని చూచినప్పుడెల్లను కూడా ఎంతగానో ఆనందముతో నవ్వుతూ, నవ్వుతూ ఉండిపోయెను.

నా ప్రియులారా, దేవుడు ఆలాగుననే మీకును కూడా జరిగిస్తాడు. ఆయన అక్కడ లేనివాటిని కూడా అక్షరాల ఉన్నట్టుగానే, పిలుచువాడై యున్నాడు. మీరు పాపమును చేసియున్నారా? మీరు దేవుని సాన్నిధ్యమును కోల్పోయి ఉన్నారా? తద్వారా, మీకు శిక్షావిధియు పలుకబడియున్నదని చింతించుచున్నారా? లేదండి. అందుకే, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'నా యొద్దకు రండి, నేను మిమ్మును క్షమించెదను, నేను మిమ్మును సమకూర్చెదను, మీ జీవితములోనికి నవ్వును మరల తీసుకొని వచ్చెదను. నేను శాపములను తొలగించెదను. పాపము యొక్క జీతమంతటిని నేను తొలగించి వేయుదును. ఆయన రక్తముచేత మిమ్మును కడిగి శుద్ధి చేసి, మిమ్మును నా బిడ్డగా చేసుకొందును' అని అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఈరోజు ఆయన మీ జీవితమును రూపాంతరపరచును. ఆయన మీ జీవితమును తిరిగి మరల నిర్మాణము చేయుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీ కుటుంబ జీవితమును మీరు కోల్పోయి ఉన్నారా? ఆయన మీలో ప్రతి ఆనందమును తిరిగి సమకూరుస్తూ, మీకు ఇక సంతోషమును తీసుకొని వచ్చుచున్నాడు. ఒకవేళ నా ప్రియులారా, బిడ్డను కనగల శక్తిని మీరు కోల్పోయి ఉండవచ్చును? డాక్టర్లు మీకు ఇక పిల్లలు పుట్టరు అని చెప్పియుండవచ్చును? అయితే, భయపడకండి, దేవుడు మిమ్మును శారాయి వలె ఆశీర్వదించును గాక. ఆయన మిమ్మును ఆలాగున మార్చుచున్నాడు అని నేను నమ్ముచున్నాను. కనుకనే, ఈ కృపను మీరు అంగీకరించండి, ఆలాగుననే, చదువుకోవడానికి, పనిచేయడానికి, రాణించడానికి శక్తిని మీరు కోల్పో యి ఉన్నారా? పని చేసి రాణింపు పొందడానికి మీరు శక్తిని కోల్పోయి ఉన్నా రా? దేవుడు ఆ శక్తిని మీకు మరల తీసుకొని వచ్చుచున్నాడు. ఆయన మర ల సమస్తమును మీ పట్ల పునరుద్ధరించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 55:12వ వచనములో చూచినట్లయితే, "మీరు సంతోషముగా బయలు వెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలము లోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మిమ్మును ఆనందముతో తోడుకొని పోవుట కొరకై ఆయన మిమ్మును పరిశుద్ధాత్మతో నింపుతాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 14:17వ వచనములో చూచినట్లయితే, "దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, భయపడకండి. ఈ కృప ఇప్పుడే మీ యొద్దకు వచ్చుచున్నది. యేసు ఈ వాగ్దానమును నెరవేర్చుటకు మీ చెంతకు వచ్చుచున్నాడు. కనుకనే, నేడు మీ హృదయమును ఆయన వైపుకు తెరవండి, యేసును మీలోనికి స్వీకరించండి, సమస్తమును మరల జీవమును సంతరించుకొనునట్లుగా, ఇట్టి శక్తిని ప్రభువైన యేసు చెంత నుండి మీరు పొందుకొనండి. ప్రతి ఆశీర్వాదము మీ యొద్దకు వచ్చునట్లుగాను, ప్రతి ఆశీర్వాదము యేసులో దాచబడియున్నది. ప్రతి జ్ఞానము యేసునందు దాచబడియున్నది, ప్రతి మంచితనము మరియు ప్రతి క్షమాపణ యేసునందు దాచబడియున్నది. కనుకనే, ఆయన మీ చెంతకు వచ్చుచున్నాడు. కనుకనే, ఆయనను స్వీకరించండి, ఆయనతో ఈలాగున చెప్పండి, 'యేసయ్యా, నీకు వందనములు, ఇప్పుడు నాకు భవిష్యత్తు ఉన్నదని నేనెరుగుదును, నా జీవితమును నీ స్వాధీనములోనికి తీసుకొనుము ' అని చెప్పినప్పుడు, సమస్తమును మీకు జీవమును కలిగించి, మీలో నవ్వును కలిగించి, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు ఒక నూతన భవిష్యత్తును ఇచ్చినందుకై నీకు వందనములు. దేవా, ఈ రోజు మా హృదయాన్ని నీ యెదుట తెరచి, నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మా పరిస్థితులు మార్పు చెందునట్లుగా చేయుము. దేవా, మా జీవితములో ఆనందమును మరల పునరుద్ధరించి, మా జీవితములో సకల ఆశీర్వాదములను కలిగియుంటూ, మేము ఎల్లప్పుడు నవ్వుతూ ఉండునట్లుగా చేయుము. ప్రభువా, ప్రజలందరి యెదుట ఏ కొదువ లేకుండా, సకల ఆశీర్వాదముల చేత నింపి, నీవు మమ్మును ఘనపరచుము. దేవా, మేము మరియు మా ప్రియులగు వారు గొప్ప ఔన్నత్యమును కలిగి ఉండడానికి సహాయము చేయుము. ప్రభువా, మేము చేయుచున్న ప్రతి ప్రయత్నమును నీవు ఆశీర్వదించి, మాకు తగిన ప్రతిఫలమును దయచేయుము. దేవా, మా నుండి ఆనందమును దూరం చేయుచున్న పోరాటాలు, నిరాశలు మరియు నష్టాలు నీకు తెలుసు. కనుకనే, దేవా, వాటన్నిటిని మా యొద్ద నుండి తొలగించుము. ప్రభువా, నీవు మా నోటిని నవ్వుతోను, మా పెదవులను సంతోషగానములతోను నింపుతావని నీ వాక్యం చెప్పినట్లుగానే, ఈ రోజు మేము ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటున్నాము. దేవా, మా పాపాలను క్షమించి, నీ అమూల్యమైన రక్తంతో మమ్మును కడిగి, మా జీవితంలో నీ సన్నిధిని పునరుద్ధరించి మరియు మమ్మును కృంగదీయుచున్న ప్రతి శాపమును, భారమును తొలగించుము. దేవా, నీవు శారాను ఆశీర్వదించి, ఆమె దుఃఖాన్ని నవ్వుగా మార్చినట్లుగానే, మా జీవితంలో కూడా ఒక అద్భుతం చేసి, మాలో ఒక నవ్వును కలిగించుము. దేవా, అది మా కుటుంబాన్ని, మా భవిష్యత్తును మరియు కోల్పోయినట్లు అనిపించే ప్రతి ఆశీర్వాదములను మరల పునరుద్ధరించుము. యేసయ్య, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపి, ఆనందం మరియు సమాధానముతో మమ్మును తోడుకొని వచ్చి నడిపించుము. దేవా, క్రీస్తులో దాగి ఉన్న ప్రతి మంచి విషయం మా జీవితంలో బయలుపరచబడునట్లుగా చేయుమని యేసు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.