నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 22:29వ వచనములో చెప్పబడినట్లుగానే, సర్వశక్తిమంతుడైన దేవుడు తానే మనలను ఆయన యొక్క ఆశీర్వాదాలలోనికి నడిపిస్తాడు: ఆ వచనము, "తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును'' ప్రకారం పనిలో నిపుణత అంటే కేవలం తలాంతులు లేదా నైపుణ్యం గురించి కాదు, కానీ ప్రభువుకు తెరచియున్న ఆత్మను కలిగి ఉండటం, ఆయన నడిపింపును వినడం మరియు ఆయన జ్ఞానంలో నడవడం. మా సంస్థలో డిజిటల్ మార్కెటింగ్‌ను బోధిస్తున్న ఒక వ్యక్తి అంతటి ఆసక్తి చూపింది-ఆమె ఆలోచనలు మరియు దృష్టికోణం నాయకుల దృష్టిని ఆకర్షించాయి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నా నాన్నగారిని ఆమెను కలవాలని మార్గనిర్దేశించాడు, ఫలితంగా ఆమెకు డిజిటల్ మార్కెటింగ్ మరియు మీడియా నాయకత్వ బాధ్యత అప్పగించబడినది. మనం దేవుని నడిపింపును అనుసరించి, విధేయతతో పనిచేసినప్పుడు, ఆయన మనలను రాజుల యెదుట మరియు నాయకుల యెదుట నిలువబెడతాడు. అంతమాత్రమే కాదు, మన స్వంత ప్రయత్నాలకు మించిన అవకాశాలను దేవుడు మనకు దయచేస్తాడు అని ఈ వచనము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. కనుకనే ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, ప్రతిరోజు దేవునిని వెదకడం మరియు ఆయన నడిపింపు కొరకు అడగడం ద్వారా నిపుణత కలుగుతుంది. కనుకనే, ఈ విధంగా ఆయనను అడగండి, 'ప్రభువా, ఈ రోజు మేము ఏమి చేయాలి?' అని మనం ప్రార్థించి మన హృదయాలను ఆయన స్వరానికి తెరచినప్పుడు, పరిశుద్ధాత్మ మన స్వంత ఊహకకు మించిన జ్ఞానాన్ని మరియు తలంపులను మనకు దయచేస్తాడు. అవును, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము అని చెప్పబడియున్నది మరియు ఆయన మనలో నాటుచున్న ఆలోచనలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఆ నిపుణతను మీలో నింపుతుంది.
నా ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయుచున్న ఒక ప్రేరేపించబడిన ఆలోచన నాయకులను ప్రభావితం చేయగలదు మరియు సంస్థలను ఆకర్షించగలదు. మన పని కేవలం పనులుగానే కాకుండా, దేవుడు తన మహిమను ప్రకటించడానికి ఒక వేదికగా మారుతుంది. దేవుడు మనకు బలాన్ని, నైపుణ్యాన్ని, దివ్యమైన జ్ఞానాన్ని సమకూర్చుతాడు, తద్వారా ఆయనకు ఘనతను తీసుకొని వచ్చే విధంగా మరియు ఇతరులను సేవ చేసే మార్గాలలో మనం అత్యుత్తమంగా ఎదగడానికి అనుమతిస్తాడు. కనుకనే, నేడు మీ పనులను ఎవరు గుర్తించలేదనియు, మీ పనిలో నిపుణత లేదని చింతించకండి, మీ హృదయాలను దేవునికి ఇచ్చినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీ పనిలో మీకు నిపుణతను దయచేసి, మిమ్మును రాజుల యెదుట నిలువబెట్టి మిమ్మును ఘనపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ జ్ఞానం లేకుండా మేము ఏమియు కూడా చేయలేము. దేవా, నీ యొక్క గొప్ప శక్తి లేకుండా మేము బలహీనులముగా ఉన్నాము. కాబట్టి, ప్రభువా, నీ కృప లేకుండా మాకు రాజుల యెదుట నిలువబడే నిపుణత లేదు. కనుకనే దేవా, మాకు రాజుల యెదుట నిలువబడే గొప్ప నిపుణతను దయచేయుము. ప్రభువా, నీ తలంపులు మరియు నడిపింపుతో మమ్మును నింపుము. దేవా, నీ బలం మరియు సామర్థ్యంతో మమ్మును బలవంతులనుగా చేయుము. పరిశుద్ధాత్మ మా పనిని నడిపించును గాక. దేవా, మా నాయకులను ఆశ్చర్యపరచుటకు మమ్మును ఉపయోగించుకొనుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పని కూడా నీ మహిమను ప్రదర్శించును గాక. ప్రభువా, మా ద్వారా అద్భుతాలు చేసి, మమ్మును నిపుణత కలిగి ఉండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ఇంకను దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలో నీ మంచితనాన్ని ప్రకాశింపజేయునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.