నా ప్రియమైన స్నేహితులారా, నేడు దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 6:16వ వచనమును ఇవ్వబడినది. ఆ వచనము, "ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు'' అని సెలవిచ్చుచున్నది. ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! అనేకసార్లు, మన జీవితాలలో నిరుత్సాహం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మరియు భవిష్యత్తును గురించిన భయం వంటి మాటలు శత్రువుల దాడులు ఆకస్మాత్తుగా మండుచున్న అగ్ని బాణాలు వలె మన మీదికి వస్తాయి. ఒకవేళ, నేడు మీరు, 'నేను దీనిని ఇక భరించలేకపోవుచున్నాను. నా వ్యాపారం నష్టమైపోవుచున్నది మరియు నా పరిచర్య ఆటంకపరచబడుచున్నది, నా కుటుంబం విడిపోవుచున్నది ' అని మీరు అనవచ్చును. కానీ, ప్రియమైన స్నేహితులారా, ఈ పోరాటల మధ్యలో, ప్రభువు మనకు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చుచున్నాడు, అదేమనగా, విశ్వాసం అనే డాలు. అవును, విశ్వాసం మన కాపుదల మరియు సంరక్షణ మాత్రమే కాదు; అది మరల పోరాడటానికి మనకు బలమును కూడా అనుగ్రహించుచున్నది. కనుకనే మనలను భయపెట్టుచూ, దేవుని కొరకు మనం చేయుచున్న పనిని ఆటంకపరచడమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ, ' విశ్వాసం అనే డాలు పట్టుకొనండి!' అని దేవుని ఆజ్ఞ స్పష్టంగా తెలియజేయబడుచున్నది. అవును, మనం మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టినప్పుడు, మనకు విరోధంగా వచ్చు ప్రతి అగ్ని బాణాన్ని మనం ఆర్పుటకు శక్తిమంతులము అవుతాము.

పురాతన కాలములో యుద్ధాలలో, ఒక చిన్న సైన్యం తరచుగా భారీ మరియు భయంకరమైన సైన్యాన్ని ఎదుర్కొంటుంది. ఆ సైన్యాధికారియైన నాయకుడు వారి యెదుట నిలువబడి, ' బలంగా ఉండండి! మీ కేడెమును పట్టుకోండి! మనం దీనిని గెలవగలం!' అని కేకలు వేయుచూ, సైన్యమును బలపరచేవాడు. ఆ నాయకుడు ఇచ్చు ఆ ధైర్యం సైనికులలో విస్తరించుట మాత్రమే కాదు, వారిలో బలమును మరియు ధైర్యమును కలుగజేయుచున్నది. అదేవిధంగా, నా ప్రియులారా, మనము ఈ లోకములో పోరాడుచున్నప్పుడు, ప్రభువు తన వాక్యం ద్వారా మనలను బలపరుస్తాడు. విశ్వాసం మన సహజమైన దృష్టితో చూడలేని వాటిని మనకు చూపుతుంది. ఆలాగుననే, బైబిల్‌లో ఇశ్రాయేలీయులకు మరియు సిరియా రాజులకు జరిగిన యుద్ధమును మనము చూడగలము. బైబిల్ నుండి 2 రాజులు 6వ అధ్యాయములో, సిరియా రాజు ప్రవక్తయైన ఎలీషాను పట్టుకోవడానికి ఒక గొప్ప సైన్యాన్ని అతని యొద్దకు పంపించాడని మనం చదువుతాము. అక్కడ ప్రవక్తయైన ఏలీషా, సిరియా రాజు యొక్క పధకములన్నిటిని తెలియజేయుచుండెను. సిరియా రాజు యొక్క ఆ పధకములన్నిటిని ఇశ్రాయేలీయులకు ఎలీషా తెలియజేసినప్పుడు, వారు ఆ పన్నాగముల నుండి తప్పించుకొనుచుండెను. ఎలీషా ఉన్న చోటును వారు ముట్టడి వేశారు. అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. ' అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్పసైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు,' అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా ఎలీషా లెమ్ము అని చెప్పగా, ఎలీషా లేచి ఏమి చెప్పాడని తెలుసా? ' అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వానికంటె అధికులై యున్నారని చెప్పెను.' తరువాత అతను ఇలా ప్రార్థించాడు, ' యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను. '' ఇది ఎంత శక్తివంతమైన సత్యం! అవును, నా ప్రియులారా, మన చుట్టూ ఉన్న దేవుని శక్తివంతమైన కాపుదలను మరియు సంరక్షణను చూడటానికి విశ్వాసం మాత్రమే మన కళ్ళను తెరచుచున్నది. భయం మనకు శత్రువు బలాన్ని చూపుతుంది, కానీ విశ్వాసం ప్రభువు యొక్క గొప్పతనాన్ని బయలుపరచుచున్నది.

అవును నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీకు విశ్వాసం అనే అదే డాలును ఇచ్చుచున్నాడు. ఒకవేళ, నేడు మీ జీవితములో భయం, అప్పు, అనారోగ్యం లేదా వైఫల్యం అనే మండుచున్న అగ్ని బాణాలు మీపైకి వచ్చినప్పుడు, మీ యొక్క విశ్వాసము అను డాలును ఎత్తి పట్టుకొని, ' వీటన్నిటికంటె నా దేవుడు గొప్పవాడు!' అని చెప్పండి. అప్పుడు మీ విశ్వాసం మీ పోరాటాన్ని తొలగించి, అది వాటన్నిటి మధ్యలో మీకు విజయాన్ని ప్రకటిస్తుంది. ప్రియులారా, అపవాది మీ దృష్టి మరల్చనివ్వకండి లేదా మిమ్మల్ని విడిచిపెట్టునట్లుగా చేయనివ్వకండి. ప్రవక్తయైన ఎలీషా పట్ల పోరాడిన ప్రభువు నేడు మీ పోరాటాల కొరకు పోరాడుతాడు. ఆయన మీ ఇంటిని, మీ పిల్లలను మరియు మీ పరిచర్యను తన కాపుదల అను అగ్ని భాణములతో చుట్టుముడతాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు మీ జీవితములో నూతన ద్వారాలు తెరచుచున్నాడనియు మరియు శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను నిమ్మళింపజేయుచున్నాడనియు నమ్మండి. ఎందుకనగా, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్థిల్లదు. అదియుగాక, దేవుడు మీ భయాన్ని ధైర్యంగా, మీ బలహీనతను బలంగా, మీ ఓటమిని విజయంగా మారుస్తాడు. కనుకనే నేటి వాగ్దానము ద్వారా మీ విశ్వాసములో మీరు దృఢంగా నిలబడండి, మీ విశ్వాసము అను డాలును ఎత్తిపట్టుకొనండి మరియు విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం ప్రభువుదే! కనుకనే నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ పోరాటాలలో మీకు విజయము నిచ్చి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మాకు విశ్వాసమను డాలును ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని తొలగించుము, మేము ముందుకు వెళ్లకుండా, మమ్మును ఆపడానికి ప్రయత్నించే శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను నాశనం చేయుము. దేవా, మా పోరాటాల మధ్యలో మేము బలహీనంగాను మరియు నిరాశగా భావించినప్పుడు మమ్మును విశ్వాసములో బలపరచుము. ప్రభువా, మమ్మును చుట్టుముట్టిన నీ శక్తివంతమైన సైన్యాన్ని చూడటానికి మా మనోనేత్రములను తెరువుము. ఓ ప్రభువా, మా హృదయంలో బలమైన పరాక్రమశాలిగా లేమ్మని కోరుచున్నాము. యేసయ్యా, మాలో ఉన్న అనారోగ్యం, అప్పు మరియు భయం యొక్క ప్రతి మండుచున్న అగ్ని బాణం నీ విశ్వాసము ద్వారా అవి ఆరిపోవునట్లుగా చేయుము. దేవా, మా జీవితములో ప్రతి సవాలును ఎదుర్కోవడానికి మాకు నీ యొక్క దైవీకమైన బలమును, విశ్వాసమును మరియు ధైర్యాన్ని నింపుము. ప్రభువా, మాకు సంపూర్ణమైన విజయం మరియు సమాధానమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.