హలో నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మే 29, నేడు మా ప్రియమైన తల్లిగారి జన్మదినము. ప్రతిసారి మా తల్లిగారిని తలంచినప్పుడల్లా ఆమెలో ఉన్న దాగియున్న నిశబ్ద విశ్వాసమును బట్టి ఆమెను నేను ఆనందిస్తుంటాను. అవును, ఆమె యొక్క విశ్వాసమును మరియు ప్రార్థనా శక్తి చూచి, ఆమె యొద్ద నుండి అటువంటి ఎన్నో విషయాలను గూర్చి నేను నేర్చుకున్నాను. తల్లులుగా, మనము ఎప్పుడూ భయపడుతుంటాము; మన బిడ్డల జీవితాలలో జరిగే ప్రతి విషయములను గురించి మనము పట్టించుకుంటూ, ఎంతగానో భయపడుతుంటాము కదా. నేను మా అమ్మను ఆటపట్టించేదానను, ఆమెను చూచి నేను నవ్వుకునేదానను. అప్పుడు ఆమె నన్ను చూచి ఈలాగున అనేవారు: "నువ్వు తల్లివయ్యాక, నీకే అంతా అర్థమవుతుంది.'' అవును, ఇప్పుడు నాకు అర్థమైనది; కానీ ఆమె భయాలన్నింటి వెనుక, యేసు తన పక్షమున ఉండి, అంతా మేలు జరిగిస్తాడనే అపారమైన విశ్వాసము ఆమె ఎప్పుడు కలిగియుండువారని కూడా నాకు అర్థమవుతుంది. ఆమె గొప్ప రీతిలో ఎప్పుడు దానిని బయట పెట్టకపోయినప్పటికి, ఆమె ప్రార్థనా శక్తిని తాను కలిగియుండెను. తద్వారా, ఆమె కలిగియున్న విశ్వాసమును బట్టి మా జీవితములో జరిగిన ఒక సంఘటనను మీతో చెప్పాలని నేను కోరుచున్నాను. ఆమె యొక్క ప్రార్థనా శక్తి మరియు ఆమెకున్న విశ్వాసం కారణంగానే, ఆమె ఎన్నో ఆటంకములను జయించగలిగారు. ఈ రోజు ప్రభువు అదే విషయమును మీకు వాగ్దానము చేయుచున్నాడు. మీరు కలిగియున్న సంపూర్ణ విశ్వాస్యతను బట్టి ప్రభువు మీకు తగిన ప్రతిఫలమును ఇస్తాడు. మీ జీవితంలో అనేక విషయాలను బట్టి మీరు భయపడుతూ ఉండవచ్చును. మిమ్మలి క్రిందికి నెట్టివేయాలని తలంచే మనుష్యులను బట్టి ప్రయత్నించే వారిని, మిమ్మును నాశనం చేయడానికి చూసే వారిని బట్టి మరియు మిమ్మును చెరసాలలో వేయాలని ప్రయత్నించే వారిని బట్టి మీరు భయపడుచుండవచ్చును. అయితే, ఈ రోజు ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు కదా! " మీ ఆపదలన్నింటి నుండి నేను మిమ్మును విడిపిస్తాను'' అని వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

నాకు కేవలం 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మాకు కూడా అదే సంఘటన జరిగినది. మేము కుటుంబంగా కలిసి బెంగళూరు పట్టణములో జరుగుచున్న ఒక ప్రార్థనా కూటమునకు వెళ్లియున్నాము. కనుకనే, మేము రెండు కారులలో ప్రయాణించాము. ఒక కారు నిండుగా మా తల్లిదండ్రులు మరియు పెద్దవారందరు మరియు మా బంధువులందరు కూడా ఆ కారులో ప్రయాణించుచున్నారు. అయితే, రెండవ కారు నిండుగా బంధువుల పిల్లలందరూ ఉన్నారు, మేమందరం కలిసి ప్రయాణించుచున్నాము. మేము బెంగళూరులోనికి అప్పుడే ప్రవేశిచుచుండగా, మా తల్లిదండ్రులు ప్రయాణించుచున్నటువంటి కారులో ఉన్న సిలువ గుర్తును చూసి, కొంతమంది వ్యక్తులు చూచి, మా తల్లిదండ్రులు ఉన్న కారును ఆపివేశారు. వారు మమ్మును మాత్రము ఆపలేదు; కనుకనే, మేము వారిని దాటి, అక్కడి నుండి వెళ్లిపోగలిగాము. దాదాపు, ఒక గంట తర్వాత, మా అమ్మ ఫోన్ చేసి ఇలాగున అన్నారు: 'శిల్పా, మేమందరం ఇక్కడ ఒక చోట ఆపివేయబడియున్నాము, వారందరు మమ్మల్ని చంపివేయాలని ప్రయత్నించుచున్నారు. వారు మా కారును కూడా కాల్చివేయాలని చూస్తున్నారు. కాబట్టి, కాస్త జాగ్రత్తగా ఉండండి' అని చెప్పారు. ఆ మాటలు విన్న మేము ఎంతగానో భయపడిపోయాము, మాకు ఏమి చేయాలో తెలియలేదు; దాంతో మేము వారిని వెతుక్కుంటూ తిరిగి వెనక్కి వెళ్లాము. మేము ప్రార్థనా కూడికకు వెళ్లుచున్నాము కాబట్టి, ఆ వ్యక్తులు మమ్మును ఆపివేశారు. అక్కడ దాదాపు పది మంది వ్యక్తులు ఉన్నారు, ఆ గుంపులోని ఒక వ్యక్తి మా తల్లిదండ్రులను గుర్తుపట్టాడు. వారు ఇలాగున అన్నారు: 'ఓహో, వారు తిరునల్వేలికి చెందిన ఎంతో మంచి దంత వైద్యులు. వారిని ఏమియు కూడా చేయవద్దు. వారు ఎంతో మంచి వ్యక్తులు. వారు అనేక ఆపదల మధ్యలో కూడా, దేవుని కృప మా మీద ఉన్నదని నేను గ్రహించాను. శత్రువుల ద్వారా కూడా, దేవుడు మనకు అనుగ్రహం అనుగ్రహించాడు.

మరో కారులో ఉన్నప్పుడు మేము ఎంతగానో భయపడిపోయాము. 'అయ్యో! మా కారులో సిలువ ఉన్నది, సిలువ ఉన్న టీ-షర్ట్‌ను నేను ధరించియున్నాను. అయితే, మమ్మును కూడా చంపుతారేమో? అని మేము కూడా భయపడ్డాము. కానీ, మా అమ్మ తన చేతిలో ఎరుపు రంగు బైబిల్‌ను పట్టుకుని, దేనికిని భయపడకుండా నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయములో, ప్రభువు మమ్మును విడుదల చేసి, కాపాడుతాడు అన్న విశ్వాసమును ఆమె కలిగియుండెను. అవును, ఆమెకు ఉన్న ఆ విశ్వాసమును బట్టియే దేవుడు మమ్మల్ని కాపాడి సంరక్షించి, ఆయన ఇంతకాలము వరకు మాకు తోడుగా ఉండి, మమ్మును నడిపిస్తున్నాడు. అందుకే బైబిల్‌లో సంఖ్యాకాండము 21:34వ వచనములో దేవుని వాక్యము ఈలాగున చెప్పబడియుండుట మనము చూడగలము: "అతనికి భయపడకుము; నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని...'' అని చెప్పబడినట్లుగానే, ఆ సమయములో మా తల్లిగారు కూడా ఒకవేళ భయపడి ఉండవచ్చును. అయితే, ప్రభువు శత్రువుల చేతి నుండి మమ్మును విడిపించియున్నాడు. మేము దేవుని దయను పొందుకొనియున్నాము. అదేవిధంగా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. యేసయ్యను మీరు తృణీకరించవలసిన పరిస్థితిలో మీరు తృణీకరించ లేదు. ఆయనను నిరాకరించవలసిన పరిస్థితులలో మీరు ఆయనను నిరాకరించలేదు, కాబట్టి, ప్రభువు నేటి వాగ్దానము నుండి మిమ్మును శత్రువుల చేతికి అప్పగించకుండా మిమ్మును దీవిస్తాడు.

ప్రార్థన:
కృపాకనికరము కలిగియున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, శత్రువుల చేత అణగద్రొక్కబడుచున్న మమ్మును వారి చేతికి అప్పగించకుండా, మమ్మును విడిపించుము. ప్రభువా, ప్రతి భయంలో మరియు ప్రతి శోధనలో నీవు మాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు నీకు వందనములు. దేవా, భయముతో నిండియున్న మా హృదయముతో నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, మేము నీ యందు అచంచలమైన విశ్వాసంతో ఉండునట్లుగా మమ్మును నింపుము. దేవా, నీ పక్షమున నిలబడటానికి మరియు నీ నామమును ఎన్నడూ నిరాకరించకుండా ఉండు ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ నామమును ధరించుకొనువారముగా మేము ఉండునట్లుగా మమ్మును నీవు మార్చుము. దేవా, నీ దయను మాకు అనుగ్రహించి, నీవు మాకు ముందుగా వెళ్ళి, మా యొక్క ఆపదల నుండి మమ్మును కాపాడి సంరక్షించుము. ప్రభువా, మా జీవితమును చుట్టుముట్టిన ప్రతి దుష్ట ప్రణాళిక మరియు ప్రతి సమస్య నుండి మమ్మును విడిపించుము. దేవా, మా జీవితము మీ విశ్వసనీయతకు మరియు మంచితనానికి సాక్ష్యంగా మార్చబడునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మమ్మును ఎన్నటికిని విడువకుండా, ఎడబాయవని మేము నమ్ముచున్నాము. దేవా, నేడు నీవు మా శత్రువుల చేతికి మమ్మును అప్పగించకుండా, కాపాడతావని మేము విశ్వసించుటకు కృపను అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.