నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మిమ్మును తన సమాధానముతో నింపుతానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 32:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు'' అని చెప్పబడినట్లుగానే, నేడు దేవుడు మీకు తన యొక్క నీతిని, సమాధానమును కలుగజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, అనేకసార్లు ఈ యొక్క సమాధానమును మనము చులకనగా చూస్తుంటుంటాము. అయితే, ఇతరులు అనుభవించుచున్న కష్టములను గురించి చూచినప్పుడు మాత్రమే ప్రభువు మీకిచ్చిన సమాధానము యొక్క విలువ మీకు తెలుస్తుంది.
ఈ మధ్యన నా జీవితములో జరిగిన ఒక సంఘటనను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. పది లేక పదిహేను సంవత్సరముల తర్వాత, నేను మా యొక్క ప్రొఫెసర్‌గారిని కలిశాను. ఆయన తన రంగములో ఎంతో ప్రసిద్ధి చెందిన శస్త్ర వైద్యులుగా ఉంటున్నారు. అయితే, అతడు దేవునిని అస్సలు నమ్మనటువంటి ఒక వ్యక్తి. అతడు నన్ను చూచి, 'శిల్పా, నిజంగా దేవుడు ఉన్నాడు అని ఏ నిశ్చయతతో చెబుతున్నావు అని నన్ను అడిగారు.' నా చదువు గురించి ఆయన నన్ను ఏదైనా ప్రశ్నిస్తారు అని నేను అనుకున్నాను. కానీ, ఆకస్మాత్తుగా ఆయన, 'నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఒక ఋజువు నాకు చూపించు అని నన్ను అడిగారు.' వెంటనే, నా మదిలో తట్టిన ఒక గొప్ప విషయము, అది దేవుని యొక్క సమాధానము. అందుకే ఆయనతో, 'సార్, దేవుడు మనకు ఇచ్చే సమాధానముకంటె ఈ లోకము ఇచ్చునటువంటి సమాధానము ఎంతో వ్యత్యాసముగా ఉంటుంది అని చెప్పాను.' అది మన జీవితములో దేవుడు అన్నిటిని చూసుకుంటాడు అను ఒక గొప్ప సమాధానము. పరిస్థితులు చెడుగా ఉన్నప్పటికిని, వృత్తిలో ఏదైనా చాలా ఆలస్యమైనప్పటికిని, గృహములో మరియు యింటిలో సమస్యలు ఉన్నప్పటికిని, దేవుడు అన్నిటిని చూసుకుంటాడు అని దేవుని సమాధానము మనతో చెబుతుంది. అతనితో నేను అదే విషయమును చెప్పియున్నాను. ఆ మాటలకు ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయి, ఆయన ఏమియు కూడా చెప్పలేదు.
అవును, నా ప్రియులారా, అటువంటి సమాధానముతో ప్రభువు మిమ్మును నింపుతానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే యెషయా 32:17వ వచనములో చూచినట్లయితే," నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును '' అని చెప్పబడినట్లుగానే నీతి వలన మనకు నిత్యము సమాధానము కలుగుతుంది. అవును, దేవుడు మనకు అనుగ్రహించు సమాధానము నిమ్మళము మరియు నిబ్బరమును కలుగజేయుచున్నది. నా ప్రియులారా, ఈ సమాధానముతో మీరు నింపబడినప్పుడు, మీ చుట్టు ఉన్న ప్రజలు కూడా దానిని తెలుసుకొనగలుగుతారు. మిమ్మును చూచిన వారు, 'ఈ వ్యక్తిలో ఏదో ఒక వ్యత్యాసము ఉన్నది' అని అనుకుంటారు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 15:13వ వచనములో చూచినట్లయితే, " కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణగలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక '' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును తన యొక్క సమధానముతో నింపుతాడు. కనుకనే, మీరు కూడా ఇటువంటి సమాధానమును పొందుకొనుటకు మీ జీవితములను మరియు మీ బిడ్డల యొక్క జీవితములను సమాధానకర్తయగు దేవుని హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. అవును, ప్రియ స్నేహితులారా, ప్రభువు ఇట్టి సమాధానముతో మిమ్మును మరియు మీ గృహములను ఇప్పుడు నింపుచున్నాడని నేను నమ్ముచున్నాను. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమాధానమునకు కర్తయగు మా ప్రియ పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితాల పట్లను మరియు మా పిల్లల జీవితాల పట్లను నీవు బాధ్యతను వహించి, మమ్మును మరియు మా పిల్లలను కాపాడి సంరక్షించుచున్నందుకు నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీ యొక్క సమాధానముతో మేము నింపబడునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క సమాధానమును మేము పొందుకొనుటకు మా జీవితములను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము, అన్నిటికంటే శ్రేష్ఠమైన నీ సమాధానముతో మమ్మును నింపుము. దేవా, సమస్త జ్ఞానమునకు మించిన నీ యొక్క దైవీక సమాధానముతో మమ్మును మరియు మా కుటుంబములను నింపుము. తండ్రీ, మా చుట్టూ పరిస్థితులు వ్యతిరేకముగా జరుగుచున్నప్పటికిని, మేము నిబ్బరముగాను, నిమ్మళముగాను ఉండుటకు నీ యొక్క సమాధానముతో మమ్మును నింపుము. దేవా, మేము అనుకున్న రీతిగా మాకు పనులు జరగనప్పటికిని, మేము నీ యొక్క శాంతి సమాధానముతో నింపబడునట్లు మాకు నీ కృపను చూపుము. ప్రభువా, మా జీవితములను, నీ చేతులకు అప్పగించడానికి మరియు మా పిల్లల జీవితములను నీ యొక్క అధికారములో ఉంచడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా గృహములోను నీ యొక్క సమాధానము ఎల్లప్పుడు ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, మా ఉద్యోగ స్థలములోను మరియు మేము ఎక్కడికి వెళ్లినను సరే, నీవిచ్చు సమాధానమును మేము మోసుకొని వెళ్లువారముగా ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క సమాధానము ద్వారా మా కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


