నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 19:11వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును'' ప్రకారము ఈ వచనం మనకు బోధిస్తుంది, నిజమైన జ్ఞానం మన సహనంలో కనిపిస్తుంది మరియు మనం మనకు చేసిన తప్పులను క్షమించి, వాటిని మనము పట్టించుకోనప్పుడు మన గొప్పతనము ప్రత్యక్షపరచబడుతుంది. అనేకసార్లు, మన మానవ స్వభావం మనలను త్వరగా కోపగించుకునేలా, ప్రతీకారం తీర్చుకునేలా మరియు క్షమించడానికి నిదానించునట్లుగా చేయుచున్నది. మనం మన హృదయాలలో ఇతరులపై ద్వేషాన్ని కలిగి ఉండవచ్చును లేదా మనలను బాధపెట్టిన వారికి హాని కలిగించడానికి నిశ్శబ్ద ప్రణాళికలు వేసుకోవచ్చును. కానీ ప్రియ స్నేహితులారా, మీరు ఎవరిపైన కోపపడుతుంటారా? ఎవరిపైనను పగ తీర్చుకోవాలని అంతగా కోపము ఉన్నదా? ఎవనినైనను నశింపజేయాలన్న ప్రణాళికను మీరు కలిగియున్నారా? అటువంటి ప్రజలుగా ఒకవేళ మనము ఉంటున్నామా? అయితే, బైబిల్ నుండి దానియేలు 9:9వ వచనములో చూచినట్లయితే, " మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపా క్షమాపణలుగల దేవుడై యున్నాడు'' ప్రకారము మన జీవితములో ఎంత కృతజ్ఞతలేనివారముగా ఉండినను సరే, ప్రభువు మనలను క్షమించి, అన్నిటిని మనకు అనుగ్రహించుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి యెషయా 55:7వ వచనములో చూచినట్లయితే, "భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును'' ప్రకారము నేడు మనము దేవుని వైపు తిరిగినట్లయితే, ఆయన మనలను క్షమించును. కనుకనే, మన దేవుడు ఎంతటి దయగలిగిన దేవుడై యున్నాడు కదా!

బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9వ అద్యాయములో సౌలు అను వ్యక్తిని గురించి మనము ఉదాహరణగా చూడగలుగుచున్నాము. సౌలు పౌలుగా రూపాంతరపరచబడ్డాడు. అతడు మొదట సౌలుగా ఉన్నప్పుడు, అతని యొక్క పాత్రను మనము బైబిల్ నుండి రోమీయులకు 9:22వ వచనములో చూచినట్లయితే, "ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? '' ప్రకారము సౌలు ఉగ్రతా పాత్రగా ఉండెను. అతడు దేవుని ప్రజలందరిని కూడా సంహరించేవాడు. వారి జీవితాలలో అనవసరమైన కార్యాలను జరిగించేవాడు. ఇంకను వారి జీవితాలను నశింపజేస్తుండేవాడు. అతడు ఉగ్రతపాత్రగా ఉండేవాడు. అయితే, ఒకరోజు అతనికి యేసయ్య ప్రత్యక్షమై, రోమీయులకు 9:23వ వచనములో చూచినట్లయితే, " ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక'' ప్రకారము ఉగ్రతా పాత్రగా ఉన్న అతనిని దేవుడు కరుణాపాత్రగా మార్చియున్నాడు. నా ప్రియులారా, మీరు కూడా ఆలాగుననే ఇప్పుడే మార్చబడగలుగుతారు. నా ప్రియులారా, నేడు మీరు ఎవరిపైనను కోపముగా ఉన్నారేమో? ఎవరినైనను నశింపజేయాలని ఇంతగా కోపమును కలిగియున్నారేమో? అయితే, కృపగల దేవుడు అటువంటి మిమ్మును ఇలాగున అంటున్నాడు, 'లేదు, నా కుమారుడా/కుమార్తె, ఆలాగున చేయవద్దు, ప్రతి ఒక్కరిని మనము క్షమించి, మరచిపోయేవారముగా ఉండాలి' అని చెబుతున్నాడు. అయితే, మనము ఆ విధంగా ఎలాగున రూపాంతరపరచబడగలుగుతాము? మనము క్షమించి, ఏలాగున మరచిపోగలము? అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 9:22వ వచనములో చూచినట్లయితే, " మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును'' ప్రకారము మన కొరకు యేసుక్రీస్తు సిలువలో తన రక్తమును చిందించియున్నాడు. కనుకనే, మనము పాపక్షమాపణను పొందుకొనియున్నాము. ఆయన చిందించిన రక్తము ద్వారా మనము కడుగబడి, కరుణాపాత్రగా మార్చబడుచున్నాము. యేసు రక్తం ద్వారా మాత్రమే ద్వేషాన్ని తొలగించి దైవిక ప్రేమతో నింపబడగలము.

ఆలాగుననే, నా ప్రియులారా, సౌలు రూపాంతరపరచబడిన జీవితమును కలిగియున్నందున అతడు పౌలుగా మార్చబడెను. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు అంటున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము కూడా ఆలాగుననే, చెప్పగలగాలి. అంతమాత్రమే కాదు, మనము కూడా ఆ విధంగానే చేయాలి. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 4:32వ వచనమును మనము చూచినట్లయితే, "సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి'' ప్రకారము మనము కరుణా హృదయముగలవారమై ఒకరినొకరు క్షమించుకోవాలి. మరియు కొలొస్సయులకు 3:13 వ వచనమును మనము చూచినట్లయితే, "ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి'' ప్రకారము ప్రభువు మనలను క్షమించినట్లుగా మనము కూడా క్షమించాలి. నా ప్రియ స్నేహితులారా, మనము ఆ విధంగా మార్చబడాలి అంటే, నేడు మనలను మనము తగ్గించుకోవాలి. మరియు పట్టదలతో ప్రార్థన చేయాలి. కోపాన్ని పట్టుకోనకుండా ఉందాం. కీడుకు ప్రతిగా కీడు చేయకుండా ఉందాం. బదులుగా, దయ చూపిద్దాం. ఎందుకంటే, దయ తీర్పుపై విజయం సాధిస్తుంది. యేసు ప్రేమ మీ హృదయాన్ని పూర్తిగా నింపనివ్వండి, తద్వారా, మీ జీవితాలలో చేదుకు చోటు ఉండదు. నేడు, మీరు దేవుని యెదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని, యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే, ఆయన తన రక్తం ద్వారా మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, తన పరిశుద్ధాత్మతో నింపుతాడు మరియు ప్రేమ, సమాధానము మరియు క్షమాపణతో నిండిన ఒక నూతన జీవితాన్ని మీకు అనుగ్రహించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, కోపముతోను, ద్వేషముతోను, క్షమించలేని నిండియున్న మా హృదయాలను చూడుము. ప్రభువా, ఎవరిపైన మేము ద్వేషమును కలిగియున్నట్లయితే, ఇప్పుడే మమ్మును క్షమించుము, మా మీద కృపను చూపింపుము. యేసయ్య, నీవు మమ్మును క్షమించుట కొరకు మా కొరకు నీవు ప్రశస్తమైన రక్తమును కార్చినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ యొక్క ప్రశస్తమైన రక్తముతో మమ్మును కడిగి శుద్ధీకరించుము. దేవా, నీ మార్పులేని దయ మరియు ప్రేమకు వందనాలు. ప్రభువా, మా హృదయంలో మేము ఉంచుకున్న కోపం మరియు చేదు తొలగించి, మమ్మును క్షమించుము. యేసయ్య, నీ రక్తంతో మమ్మును శుద్ధి చేసి, నీవు మమ్మును క్షమించినట్లుగానే, మమ్మును బాధపరచిన వారిని క్షమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నీ సమాధానము మరియు కనికరముతో మమ్మును నింపుము. ప్రభువా, మాలో క్రీస్తు ప్రతిబింబించేలా మా హృదయాన్ని మార్చుము. దేవా, తగ్గింపు, ఓర్పు మరియు ప్రేమతో అందరి పట్ల నడుచుకోవడానికి మాకు నేర్పించుము. దేవా, మా జీవితం ఇతరులకు కనికరమును మరియు దయగల పాత్రగా ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మాకు నూతన జీవితమును మరియు క్రీస్తుతో నింపబడిన జీవితమును మాకు దయచేయుమని మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.