నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హోషేయ 14:6 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును'' అని చెప్పబడిన ప్రకారం ఇది ఎంత మహిమాన్వితమైన జీవితము కదా! వికసించుచున్న ఒలీవ చెట్టువలె సౌందర్యం, సువాసన మరియు ఉద్దేశ్యాన్ని కలిగి ఉండే ఒక జీవితం అది. కానీ, ఎటువంటి వారికి ఇలాంటి జీవితము ఇవ్వబడుతుంది? అందుకే బైబిల్‌లో సామెతలు 28:25వ వచనమును చూచినట్లయితే, "యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' ప్రకారం మీరు వర్థిల్లాలి అంటే, మీరు ఆయన యందు నమ్మకముంచండి. నా ప్రియ స్నేహితులారా, ఎక్కడ మీ నమ్మకమును ఉంచి యున్నారు? మాదక ద్రవ్యములపై లేక ఈ లోకాశల మీద మీ నమ్మకమును ఉంచియున్నారా? ఆలాగైతే, మీ జీవితములో ఏ మాత్రము సౌందర్యము ఉండదు. కేవలము చీకటి మాత్రమే ఉంటుంది. మీ జీవితములో సమాధానము మరియు సంతోషము మీకు ఉండదు. కానీ, అదే సమయములో దేవుడు మీకు సౌందర్యమును ఇచ్చినప్పుడు, చెప్పనాశక్యము కానీ సంతోషముతోను మరియు మహిమతోను మీ జీవితము నింపబడుతుంది.

బైబిల్ నుండి కీర్తనలు 66:10,12వ వచనములను మనము చదివినట్లయితే, "దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు'' ప్రకారం ఆయన మనలను పరిశీలించు దేవుడై యున్నాడు. ఆలాగుననే, మన జీవితము ఆరంభములో యేసును గూర్చి, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను గురించి మనకు తెలియదు. మనము అప్పుడప్పుడే ఆయనను వెంబడించడము ప్రారంభించాము. మన జీవితము ఇంకను చీకటి మయముగా ఉండెను. మన జీవితములో సంతోషము మరియు సమాధానము లేదు. అయితే, ఎప్పుడైతే, యేసయ్యను మన స్వంత రక్షకునిగా అంగీకరించి, అనుదినము ఆయనతో నడవడము ప్రారంభించినప్పుడు ఈ లోకమునకు వెలుగైయున్న యేసయ్య తన వెలుగుతో మన జీవితాలను నింపుతాడు. ఎందుకంటే, ఆయన ఈ లోకానికి వెలుగై యున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు'' అని కీర్తనాకారుడైన దావీదు రాజు తెలియజేసియున్నాడు. మనము ఆయనను మన కాపరిగా ఉంచుకున్నప్పుడు, మనకు ఏమియు కొదువ ఉండదు.

అయితే నా ప్రియ స్నేహితులారా, మీరు ఏ విధంగా ప్రభువును వెదకుచున్నారు? నేడు మీ హృదయమంతటితో ఆయనను వెదకుచున్నారా? ఎల్లవేళల ఆయనను మీ పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిని వెదకుచున్నారా? ఒకవేళ ఆలాగున వెదకనట్లయితే, ఇప్పుడే, ఆయనను వెదకుటకు ప్రారంభించండి. అప్పుడు మీరు అటువంటి వెలుగు జీవితమును కలిగియుంటారు. ఆ విధంగా మీరు ప్రభువును వెదకినట్లయితే, ఏమి జరుగుతుంది? అని చూచినట్లయితే, బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనమును చదివినట్లయితే, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' ప్రకారం యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యమును కలుగుజేస్తుంది. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ప్రభువును గట్టిగా పట్టుకొనండి, ఇప్పుడే ఆయనను వెదకుచూ, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములన్నిటిని పొందుకుందామా? ఆయన ఆశీర్వాదములను పొందుకోవాలంటే, ప్రతిరోజు ఆయనతో నడిచినప్పుడు, ఆయన మీ జీవితాన్ని సువాసనగా, సౌందర్యముగాను, ఆనందముతో నింపి, మహిమగా చేస్తాడు, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులారా, నేడు ఇది దేవుడు మీకు ఇవ్వాలని కోరుకునే జీవితం. కనుకనే, దిగులుపడకండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమాన్వితుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, ఈ రోజు నీ వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, సౌందర్యమైన, పరిమళ సువాసనగల మరియు నీ యొక్క ఆశీర్వాదంతో నిండిన జీవితాన్ని ఇచ్చుటకు నీవు మమ్మును పిలిచినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోక విషయాలలో కాదు, నీ శాశ్వతమైన ప్రేమలో మేము నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము చీకటిలో నడిచి, వేరొకచోట సమాధానమును కోరుకున్న సమయాలకు మమ్మును క్షమించుము. యేసయ్యా, నీవు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నావు గనుకనే, మమ్మును నీ యొక్క వెలుగు మరియు ఆనందంతో నింపుము. దేవా, నీవు మమ్మును బాగుగా పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులనుగా చేసి, మమ్మును నీ గొప్ప నెరవేర్పులోనికి తీసుకొని రమ్ము. ప్రభువా, ఈరోజు మమ్మును నీ సన్నిధితో మరియు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, మమ్మును నూతనపరచుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదము మాకు ఐశ్వర్యమును ఇచ్చునట్లుగా అటువంటి గొప్ప కృపను అనుగ్రహించుము. దేవా, నీ మహిమార్థమై మమ్మును వాడుకొనుము. ప్రభువా, మా పూర్ణ హృదయంతో, ప్రతిరోజు, ప్రతి గంట నిన్ను వెదకాలనుకుంటున్న మా జీవితాలలో, నీ యొక్క సౌందర్యాన్ని, నీ సువాసనను మరియు నీ మహిమను ప్రతిబింబించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.