నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుడంలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 34:19వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును'' అని చెప్పబడిన ప్రకారముగా, నేడు దేవుడు మీ ఆపదలన్నిటిని విడిపించాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, నా ప్రియులారా, నీతిమంతులు అనగా అర్థము ఏమిటి? ప్రభువును వెంబడిస్తూ, మంచి పనులను చేయుచూ, నీతికార్యములను జరిగించువారు మాత్రమే నీతిమంతులుగా ఉంటారు. ఒకవేళ మీరు, 'నేను పరిశుద్ధంగాను, నీతివంతమైన జీవితమును జీవించుచూ, మంచి పనులను మాత్రమే చేయుచున్నాను అని అంటున్నారేమో? నేను ఎవరిని బాధపెట్టలేదు, ఎవరికిని ఏ నష్టము కూడా చేయలేదు అని అంటున్నారేమో? అయినను నా మీద తప్పుడు నేరారోపణలు మరియు నిందలు మోపుతూ, నన్ను క్రిందకు నెట్టివేయాలని చూచేవారు ఎంతో మంది ఉన్నారు? నా పేరు పాడు చేసి, నా జీవితమును నాశనము చేయాలని అనుకుంటున్నారు?' అని అంటున్నారు. అవును, నా ప్రియ స్నేహితులారా, అందు మూలముగా మీ మనస్సు విరిగిపోయి, బాధపడుచున్నట్లయితే, ఈ రోజు వాగ్దానము చొప్పున మీ ఆపదలన్నిటిలో నుండి మిమ్మును విడిపిస్తాడు.
బిలాస్‌పూర్ పట్టణములో ఉన్న సహోదరులు అనిల్ ప్రసాద్‌గారికి అదే జరిగినది. అతడు ముప్పై సంవత్సరములుగా ఒక ప్రభుత్వ కార్యాలయములో పిహెచ్‌డి విభాగములో పనిచేయుచుండేవాడు. అయితే, ఒక పాత్రికేయుడు (జర్నలిస్ట్) అతనికి వ్యతిరేకముగా కుట్రచేసి, అతని మీద లేనిపోని అపనిందలు, అంబడాలన్నిటిని మోపి, అతని పేరును పాడు చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే, ప్రభుత్వము వారు, వివరణలు కోరుతూ, అతనికి ఎన్నో ఉత్తరాలు పంపించియున్నారు. ఇంకను కలెక్టర్ మరియు కమీషనర్ వారు మరుసటి దినమే, మాకు జవాబు కావాలని అతనిని ఒత్తిడి చేశారు. ఆ సహోదరునికి ఇది ఎంతగానో, ఒత్తిడి కలుగజేసినందున అతడు ఎంతగానో విచారించాడు. అతనికి వ్యతిరేకంగా, న్యాయపరంగా ఒక కేసును కూడా పెట్టడము జరిగింది. అదంతయు అతనికి ఎంతగానో వేదనను కలుగుజేసినది. ఉత్తరాలు పొందుకోవడము, కేసును ఎదుర్కోవడము ద్వారా అవన్నియు అతనిని ఎంతగానో కృంగదీసినది. ఏ తప్పు చేయకుండానే, కుటుంబముగా వారు ఎంతో కష్ట్టకాలమును ఎదుర్కొన్నారు. తద్వారా, వారి జీవితాలలోను మరియు కుటుంబములోను సమాధానము లేదు. ఐదు సంవత్సరములు వారు ఈలాగున ఎన్నో కష్టములను ఎదుర్కొన్నారు. వారు ఎంతగానో భారమును భరించారు. ఐదు సంవత్సరముల తర్వాత, ఆఖరి తీర్పు కొరకు ప్రభుత్వము వారు సచివాలయమునకు అతనిని పిలిచియున్నారు. అయితే, రాయపూర్‌నకు వెళ్లిన ప్రతిసారి కూడా అతడు యేసుపిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తప్పకుండా సందర్శించేవాడు. ఆలాగుననే, ఈసారి కూడా అతడు రైలు ఎక్కి, రాయపూర్‌నకు ప్రయాణమవుతూ, ఉదయముననే, మొట్టమొదటగా, ప్రార్థనా గోపురమునకు వెళ్లవలెనని అనుకున్నాడు. అతడు రైల్‌లో ప్రయాణము చేయుచుండగానే, అతనికి యేసు పిలుచుచున్నాడు పరిచర్య నుండి ఒక వర్తమానము అందింది. ఆ వర్తమానములో బైబిల్ నుండి కీర్తనలు 112:5వ వచనము అతనికి పంపబడినది. ఆ వచనము, "దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును'' అన్న వచనము అది అతనికి ఎంతో సంతోషమును ఇచ్చినది. ప్రభువు నిశ్చయముగా అతనికి గెలుపును ఇస్తాడు అని నమ్మాడు. ఇంకను అతనికి న్యాయము చేస్తాడు అని విశ్వసించాడు. కాబట్టి, అతడు ప్రార్థన గోపునకు వెళ్లి, ప్రార్థించుకున్నాడు. ఆ తర్వాత, సచివాలయమునకు కూడా వెళ్లాడు.
అతడు అక్కడు వెళ్లి చూడగానే, అతనిలాంటి కేసును కలిగియున్న మరొక ఐదుగురు వ్యక్తులు అతనికి ముందుగా ఉన్నారు. అయితే, వారందరికి పెద్ద పెద్ద న్యాయవాధులు ఉన్నారు. వారికి సహాయము చేయుటకు ఒక బృందము కూడా ఉన్నది. కానీ, ఇతడు మాత్రము ఒంటరిగా వెళ్లాడు. కానీ, దేవుడు తనతో కూడా ఉన్నాడని ఇతనికి తెలుసు. కనుకనే, తన కొరకు ప్రభువే పోరాడుతాడు అని అతను గుర్తించాడు. అయితే, కోర్టు లోపలికి వెళ్లవలసిన సమయము వచ్చినది. అక్కడ ఉన్నతాధికారులందరు కూర్చుని ఉండడము అతడు చూచియున్నాడు. అతని కేసు చెప్పమని వారు అడిగారు. అతడు జరిగిన నిజనిజాలన్నిటిని వారితో చెప్పి, తన పరిస్థితినంతటిని అతను తన కేసులోని వాస్తవాలన్నింటిని, యోగ్యతలను కూడా వివరించెను. అతడు అంతటిని వివరించగానే, వెంటనే ప్యానల్‌లో ఉన్న అధికారులలో ఒక వ్యక్తి ఈలాగున తీర్పును ప్రకటించాడు, " నీవు ఏ తప్పు కూడా చేయలేదు కనుకనే, నీవు ఈ రోజు నీ కేసు నుండి నీవు విడిపించబడియున్నావు. ఈ రోజు నుండి నీవు స్వతంత్రుడవే '' అని తెలియజేసియున్నాడు. తద్వారా, అతడు ఆ కేసును గెలిచాడు. వెంటనే, సహోదరులు అనిల్‌గారు ఇలాగున అన్నారు, 'ప్రభువే, ఉన్నత అధికారుల మనస్సులతో మాట్లాడియున్నాడు. ఈ కేసును నాకు అనుకూలముగా మార్చియున్నాడు. ఈ రోజు నేను పూర్తిగా విడుదల పొంది, స్వతంత్రడనుగా ఉన్నాను మరియు నా కుటుంబము ఇంకను నేను కూడా ఎంతో సమాధానముగా ఉన్నాను. ప్రభువే మా పక్షమున యుద్ధము చేసియున్నాడు. ఈ రోజు నేను స్వతంత్రుడను. శ్రమలన్నిటి నుండి విడుదల పొందియున్నాడు. అవు ను, నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మీరు నీతిమంతులుగా జీవించుచుండగా, మీ చుట్టు ఆపదలు ఎన్ని వచ్చినప్పటికిని సరే, ప్రభువు వాటన్నిటి నుండి మిమ్మును విడిపిస్తాడు. సహోదరులు అనిల్‌గారిని ప్రభువు ఎలా విడిపించియున్నాడో, అదేవిధముగా, ఈ రోజు మీ సమస్యలన్నిటి నుండి ప్రభువు మిమ్మును కూడా విడిపిస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు మీకు విరోధముగా అపనిందలు మోపబడుచున్నవేమో? ప్రజలు మీకు విరోధముగా కుట్ర చేయుచున్నారేమో? మిమ్మును నశింపజేయడానికి, లేక క్రిందకు త్రోసివేయడాని కొరకు, మీ పేరును పాడు చేయడాని కొరకు, ఇలాగున ఎన్నో చెప్పుకున్నను సరే, మీరు దేవుని యందు నీతివంతమైన జీవితమును గడుపుతూ, మంచికార్యములను జరిగించినప్పుడు, అపవాది ఏమియు మీ మీద ఎటువంటి అపనిందలు మోపలేడు. అయితే, ప్రభువు మీ శ్రమలన్నిటి నుండి విడిపించి మిమ్మును స్వతంత్రులనుగా చేస్తాడు. ఇంకను మీ కోర్టు కేసు నుండి ఈ రోజు మీకు పూర్తిగా విడుదలను ఇస్తాడు. కనుకనే, ఈ రోజు మీరు ప్రభువునకు వందనము చెల్లించి, ఈ దీవెనలను పొందుకొనండి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఈ రోజు మేము ధ్యానించిన ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనము. ప్రియమైన ప్రభువా, మా యొక్క ప్రతి ఆపత్కాలంలో మరియు బాధలో మాకు రక్షకుడిగా ఉన్నందుకు నీకు వందనములు. ప్రభువా, మేము నీతిగల జీవితమును జీవించునట్లుగా మాకు నీ నీతిని మా పట్ల కనుపరచుము. దేవా, మా శ్రమలన్నిటి నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, పైన చెప్పబడిన సహోదరుని జీవితములో గొప్ప కార్యములు చేసినట్లుగానే, నీ వాగ్దానమును చెప్పబడినట్లుగానే, మమ్మును బలపరచుము. దేవా, ఈ రోజు మేము ధ్యానించిన ఈ వాగ్దానము, మమ్మును బలపరచునట్లుగా, ప్రోత్సహించునట్లుగాను, మా శ్రమలన్నిటి నుండి మేము విడిపించబడునట్లుగాను, మా జీవితములో ఈ వాగ్దానము నెరవేర్చబడునట్లుగా చేయుము. ప్రభువా, శత్రువుల మాటలు ఏదియు మమ్మును తాకకుండా, అవన్నియు లయమైపోవునట్లుగా చేయుము. దేవా, మా కోర్టు కేసులలో మాకు అనుకూలముగా తీర్పులు వచ్చునట్లుగాను, తద్వారా, మేము అందరి యెదుట ఘనపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, మా మీద అబద్ధపు ఆరోపణలు, భయం మరియు వ్యతిరేకత తలెత్తినప్పుడు, నిన్ను మేము పూర్తిగా విశ్వసించునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మేము ఒంటరిగా పోరాడలేని ప్రతి పోరాటాన్ని నీవే మా పక్షమున పోరాడి, మాకు విజయమును దయచేయుము. ప్రభువా, మా జీవితాన్ని చుట్టుముట్టిన ప్రతి ఉచ్చు నుండి, ప్రతి దుష్ట ప్రణాళిక నుండి మరియు ప్రతి బాధాకరమైన పరిస్థితి నుండి మమ్మును విడిపించుము. దేవా, నీవు మాతో ఉన్నావనే నీ యొక్క సమాధానము మరియు భరోసాతో మా హృదయాన్ని నింపునట్లుగా చేయుము. ప్రభువా, నీ నీతిన్యాయము ప్రబలి, ప్రతి భారం మరియు ఆరోపణ నుండి మమ్మును పూర్తిగా విడిపించునట్లుగా చేయుము. దేవా, మా జీవితం నీ విశ్వసనీయతకు మరియు విమోచనకు సాక్ష్యంగా మారునట్లుగా చేయుమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


