క్రీస్తునందు నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 2:9వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తుగా ఉన్నారు. అందుకే బైబిల్ నుండి యోహాను 15:16వ వచనములో చూచినట్లయితే, "మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని'' అని అంటున్నాడు. కాబట్టి నా ప్రియులారా, మీరు ప్రభువునందు ఆనందించండి మరియు విశ్వాసంతో ఇలాగున ప్రకటించండి: "దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి యున్నాడు. నేను ఆయన బిడ్డను, నాకు ఎటువంటి కొదువ ఉండదు. ఆయన నా పట్ల మంచి కార్యములను జరిగించి, నన్ను ఆశీర్వదిస్తాడు'' అని చెప్పండి. నా ప్రియులారా, ఈ వాగ్దానమును గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగండి!
ఒక ప్రేమగల తండ్రి తన ప్రియమైన బిడ్డను ఎత్తుకుని, కౌగిలించుకుని, దీవించినట్లుగానే, యేసు మిమ్మును తన యొద్దకు ఆకర్షించుకొని, హత్తుకొని, ఆయన మీ మీద దీవెనలను కుమ్మరిస్తాడు. ఆయన దృష్టిలో మీరు ఎంతో విలువైనవారుగా ఉన్నారు. ఆయన మిమ్మును ఒక రాజులైన యాజక సమూహముగా ఉండుటకు పిలిచియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 2:5వ వచనమును చూచినట్లయితే, "యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు'' అని మనకు గుర్తుచేయుచున్నట్లుగా, మనము యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారయోగ్యమైన ఆత్మీయ బలులను అర్పించే పరిశుద్ధ యాజకులముగా ఉన్నాము. ఎందుకనగా, మనము ఆయనకు పరిచర్య చేయుటకును మరియు ఆయన చిత్తము నెరవేర్చుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకొనియున్నాడు. కనుకనే, మీరు ఆయనతో కూడా విశ్వాసముగా నడుచుకొనుచున్నప్పుడు, ఆయన కృప మీ జీవితములో నిలిచియుండును గాక. అవును, దేవుడు మిమ్మును కూడా ఆయన పరిశుద్ధ జనములో ఒక సమూహముగా ఉండుట కొరకు ఆయన పిలిచియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 1:14-16వ వచనములలో చూచినట్లయితే, "నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి'' అని లేఖనము మనలను ప్రోత్సహించుచున్నది. గనుకనే, ఆయన పరిశుద్ధుడైయున్నట్లుగానే, మీరు కూడా మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులుగా ఉండండి; మిమ్మును పిలిచిన ఆయన పరిశుద్ధుడు గనుక, మీ అనుదిన జీవితములో ఆ పరిశుద్ధతను ప్రతిబింబించమని ఆయన మిమ్మును పిలుచుచున్నాడు. మీరు ఇదివరకే పరిశుద్ధతలో నడుచుకొనుచున్నట్లయితే, మీరు మరి ఎక్కువగా పరిశుద్ధతలో వర్థిల్లండి. దేవుని తన ప్రజల ద్వారా ఆయన వెలుగు, పరిశుద్ధతను ప్రకాశించి, దేశమును మార్చవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు.
నా ప్రియులారా, నేడు సమాజములో అవినీతి, ద్రోహము, లంచగొండితనం, అన్యాయము వంటి ఎన్నో లోపములను మనము చూడగలము. బలహీనులు తరచుగా దోపిడీకి గురవుతున్నారు. ధనవంతులు, పేదవారు అనే వ్యత్యాసము లేకుండా అందరిని సమానముగా చూడటము లేదు. అయితే, అధికారంలో ఉన్నవారిని కేవలం నిందించడానికి బదులుగా, మనము మన హృదయములను కూడా ఒక్కసారి పరిశీలించుకొని, నిజాయితీతో కూడిన నిష్కళంకమైన పరిశుద్ధ జీవితమును జీవించడానికి నిర్ణయించుకుందాము. మనము దేవుని ఘనపరచి, పరిశుద్ధమైన చేతులతో ఇతరులకు సేవాపరిచర్య చేసినప్పుడు, ఆయన పరిశుద్ధత మన ద్వారా బయల్పరచబడుతుంది. మనము ప్రేమతో, ఐక్యతతో కలిసి జీవించినప్పుడు, ఆ పరివర్తన మన దేశమంతటా విస్తరించును. అందుకే బైబిల్ నుండి యెషయా 60:22వ వచనములో చూచినట్లయితే, "వారిలో ఒంటరియైనవాడు వేయి మందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' అని వాగ్దానము చేసినట్లుగానే, మీలో అల్పులైన వారు గొప్ప జనముగా మార్చబడతారు.
అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 19:5వ వచనములో చూచినట్లయితే, "కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు'' అని దేవుడు సెలవిచ్చిన ప్రకారముగానే, మీరు ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడు, సమస్త జనములలో కూడా మీరు ఆయనకు సొత్తుగా ఉంటారు. ఎందుకనగా, మీరు యేసుక్రీస్తుకు చెందినవారు. ఆయన తన ప్రత్యేకమైన కృపను మీపై సమృద్ధిగా కుమ్మరించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈ విశేషమైన కృపలో నడవడానికి కీలకమైన మార్గం ఎంతో సులభం: అది, దేవుని మాటకు శ్రద్ధగా విధేయత చూపించడమే. కాబట్టి, నా ప్రియులారా, ఈరోజే ఒక స్థిరమైన నిర్ణయమును తీసుకొనండి, " నేను దేవునికి విధేయత చూపిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. పరిశుద్ధతను వెంబడిస్తూ, ఎన్నడూ ఆయనను విడిచిపెట్టను. క్లిష్టతరమైన పరిస్థితులలో కూడా, నా జీవితములో సమస్తమును ఆయనే చక్కపరుస్తాడనే నమ్మకంతో ఆనందంగా ఉంటాను. ఆయనను ఘనపరుస్తూ, పరలోకంతో సన్నిహిత సహవాసంలో నడుస్తాను'' అని చెప్పండి. నా ప్రియులారా, మనము ఈ విధంగా జీవించినప్పుడు, దేవుని అమూల్యమైన సొత్తుగా ఉండడము అంటే ఏమిటో నిజంగా అనుభవించగలము. అప్పుడు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారని గుర్తించగలుగుతారు. కనుకనే, ధైర్యముగా ఉండండి మరియు మిమ్మును ఏర్పరచుకున్నందుకై మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన వాగ్దానములను గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన వాక్యము మీ హృదయములో నాటబడునట్లుగా ఉండండి మరియు ఆయన ప్రేమ, బలముతో నింపబడిన జీవితమును జీవించండి. మీరు ఆయనకు నమ్మకంగా జీవించినంత కాలం, ఆయన మిమ్మును కీడు నుండి కాపాడి, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మమ్మును ఏర్పరచుకొని, నీ ప్రియమైన బిడ్డలనుగాను రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగా మమ్మును చేసినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము ఈ లోకములో పరిశుద్ధమైన జీవితమును గడుపుటకు మరియు ప్రతి విషయంలో నీ వాక్యమునకు మేము విధేయత చూపుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా దేశము నుండి మరియు మా జీవితము నుండి ప్రతి విధమైన అవినీతి, అన్యాయం, విభజన, మరియు వివక్షను తొలగించుము. యేసయ్యా, నీవు పరిశుద్ధడవు గనుకనే, మేము కూడా పరిశుద్ధంగా జీవించుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయములను నీ పరిశుద్ధతను, ప్రేమ, మరియు ఐక్యతతో నింపుము. ప్రభువా, మమ్మును నీ అమూల్యమైన సొత్తుగా మార్చి, యథార్థంగా జీవించుటకును మరియు ఇతరులకు సేవ చేయడానికి మరియు నీ దైవీకమైన చిత్తమును జరిగించుటకు మమ్మును నీ సొత్తుగా వాడుకొనుము. దేవా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా, మేము నీ యందు నమ్మకముంచునట్లుగాను, విశ్వాసంగాను మరియు ఆనందముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, సమస్త కీడు నుండి మమ్మును తప్పించి, నీ కృపలో మమ్మును భద్రపరచుము. దేవా, మేము నీ మాటను శ్రద్ధగా విని, నీ యొక్క నిబంధన ననుసరించి నడుచుకొనునట్లుగాను, సమస్త దేశ జనులలో మేము నీకు స్వకీయ సంపాద్యమగునట్లుగా చేసి, ఆశీర్వాదములు మా జీవితములో పొంగిపొర్లునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


