నా ప్రియ స్నేహితులారా, నేడు మన ప్రభువు కుటుంబముల దేవుడు అనే మాటతో మిమ్మును ప్రోత్సహించవలెనని కోరుచున్నాను. ఒక తరమును ప్రభువును వెంబడించడము ప్రారంభించినప్పుడు, ఆ తర్వాతి తరములను కూడా ప్రభువు ప్రేమించుచూ, దీవిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:3వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మిమ్మును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ఈ రోజు మీరు, 'నేను ఒంటరిగా ఉన్నానని భావించుచున్నారా?, నన్ను ప్రేమించువారు ఎవ్వరు కూడా లేరు అని మీరు భావించుచున్నారా? నా చుట్టు ఉన్నవారిని నేను ప్రేమించినప్పటికిని, ఎవ్వరు కూడా నన్ను ప్రేమించడము లేదు అని అంటున్నారా? ' అయితే, అటువంటి మిమ్మును చూచి, యేసు ప్రభువు ఇలాగున అంటున్నాడు, " శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, మీ యెడల విడువక కృప చూపుచున్నాను.'' అవును, నా ప్రియులారా, మనము ఏపాటివారమని ప్రభువు మనలను ప్రేమించడానికి ఎన్నుకున్నాడు కదా! అందుకే బైబిల్ నుండి యిర్మీయా 31వ అధ్యాయములో చూచినట్లయితే, 'వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును, నేను వారి కుటుంబములను ప్రేమించుచున్నాను' అని ప్రభువు అంటున్నాడు.

నేడు దినకరన్‌గారి కుటుంబములో కూడా అదే మనము చూస్తున్నాము కదా! మా యొక్క ప్రియమైన తాతగారు యేసయ్యను వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు, 'ప్రభువా, నీ కొరకు అన్నిటిని చేస్తాను కానీ, నీవు నాతో కూడా ఎల్లప్పుడు ఉండాలని' అడిగారు. కనుకనే, ప్రభువు ఆయనను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ తరతరములు కొనసాగుతూ వచ్చి, ఇప్పుడు జేడెన్ మరియు బేతనీ వరకు కొనసాగుతూ వచ్చియున్నది. అవును నా ప్రియ స్నేహితులారా, మీరు మీ జీవితమును యేసయ్యకు సమర్పించుకున్నప్పుడు, శాశ్వతమైన ప్రేమచేత ప్రేమించుచూ, ప్రభువు మిమ్మును విడువక కాపాడుతాడు. అంతమాత్రమే కాదు, ఆయన విడువక మీ యెడల కృప చూపుతాడు. తరతరములు కూడా అది మీ పట్ల కొనసాగుతూ ఉంటుంది.

నా ప్రియులారా, అంతమాత్రమే కాదు, మీ కుటుంబములు దేవుని చేత దీవించబడతాయి. ఇంకను ప్రభువు చేత మీ కుటుంబములు కాపాడబడతాయి. ప్రభువు అన్నిటిని ఎంతో జాగ్రత్తగా చూచుకుంటాడు. కనుకనే, మీరు దేనిని గురించి చింతించనవసరములేదు. మా కుటుంబము అందుకు గొప్ప ఉదాహరణగా ఉంటున్నది. ఈ రోజు మీరు ఒంటరిగా ఉంటూ, సమస్తమును కోల్పోయినట్లుగా భావించుచున్నట్లయితే, నాతో కలిసి మీరు కూడా మీ జీవితములను ప్రభువు సమర్పించుకున్నట్లయితే, 'శాశ్వతమైన ప్రేమచేత నేను మిమ్మును ప్రేమించుచున్నాను' అని ప్రభువు అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఆయన శాశ్వతమైన ప్రేమను మీకు చూపుతాడు. తన ప్రేమతో మిమ్మును నింపుచున్నాడు. అందును బట్టి మీ కుటుంబములు కాపాడబతాయి. ఆయన తన శాశ్వతమైన ప్రేమతో మిమ్మును కప్పుతాడు. కాబట్టి, నేటి వాగ్దానమును బట్టి, దేవుడు నిత్యమైన ప్రేమచేత మిమ్మును ప్రేమించుచూ, విడువక మీ యెడల కృప చూపుచూ, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దయగల మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క శాశ్వతమైన, నిరంతర ప్రేమతో మమ్మును ప్రేమించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీవు మమ్మును ప్రేమిస్తావని చేసిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. దేవా, మా పట్ల నీ యొక్క శాశ్వతమైన ప్రేమను కనుపరచుము. యేసయ్యా, విరిగినలిగియున్న హృదయముతో ఉన్న మమ్మును, మా జీవితములో ఆఖరి దినముగా ఉన్న మమ్మును నీవు జ్ఞాపకము చేసుకొనుము. దేవా, మమ్మును ప్రేమించువారు ఎవ్వరు కూడా లేరు, కానీ, నీ యొక్క శాశ్వతమైన ప్రేమను మా మీద కుమ్మరించుము. ప్రభువా, మేము దారి తప్పి ఒంటరిగా ఉన్నట్లుగా భావించినప్పుడు కూడా, మేము నీకు చెందినవారమని మాకు గుర్తు చేయుము. దేవా, ఈ రోజు మా జీవితమును సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, నీ దయ మరియు కృపతో మమ్మును మీకు మరింత సమీపముగా తీసుకు రండి. దేవా, నీ ప్రేమ మా ద్వారా మా కుటుంబంలోనికి మరియు భవిష్యత్ తరములలోనికి ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబంలోని ప్రతి సభ్యులను ఆశీర్వదించి, కాపాడండి. దేవా, మా జీవితములు నీ విశ్వసనీయతకు సాక్ష్యముగా ఉండునట్లుగా చేయుమని యేసు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ ఆమేన్.