నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన పిల్లలైన మీకు ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 6:38వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ఆయన, "...ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు...'' అని యేసు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నిండు కొలతతో మీ మీ ఒడిలో కొలుస్తాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. ఇది దేవుని యొక్క హృదయమై యున్నది. ఎక్కడ ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వాలి? అని మనము చూచినట్లయితే, మొట్టమొదట, 'మీ హృదయమును నాకిమ్ము' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 23:26వ వచనములో చూచినట్లయితే, " నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము'' ప్రకారం మీ హృదయములో పాపమును మోసుకొనుచూ ఉండకండి. మీ హృదయములో భయమును మోయకండి. మీ హృదయములో భారములు కలిగి ఉండండి. ద్వేషమును, గాయమును మీ హృదయములో ఉండనివ్వకండి. అందుకు బదులుగా, ఆయన, ' మీ హృదయమును నాకిమ్ము, నేను మీ హృదయములోనికి ప్రవేశించగోరుచున్నాను ' అని అంటున్నాడు. కనుకనే, బైబిల్ నుండి ప్రకటన 3:20 వచనమును చూచినట్లయితే, " ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము'' అని చెప్పబడిన ప్రకారం, ' మీ హృదయమును నాకిచ్చినట్లయితే, నేనే స్వయంగా మీ హృదయములోనికి వచ్చెదను. నేను ఎక్కడికి వెళ్లతానో, అక్కడ సంపూర్ణమైన శాంతి సమాధానము మరియు ఆశీర్వాదములు ఉండును ' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, కేవలం ఇప్పుడే మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా ఆయన మీ హృదయములోనికి వచ్చి, మిమ్మును దీవిస్తాడు.
రెండవదిగా, మీ కానుకలు మరియు అర్పణలు దేవునికి ఇవ్వండి. అందుకే బైబిల్ నుండి మలాకీ 3:10-11వ వచనములలో చూచినట్లయితే, "నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' ప్రకారం మీరు సంపాదించియున్న భాగము పదియవ భాగము అనగా దశమ భాగము దేవుని సేవకు సమర్పించండి. మీలో కొంతమంది మొదటి నెల వేతనమును ప్రభువుకు సమర్పిస్తుంటారు. మీరు మీ యొక్క స్థలమును అమ్మకము చేసియున్నప్పుడు, అందులో పదియ భాగము దేవునికి సమర్పిస్తుంటారు. అది దేవుని హృదయమై యున్నది. ప్రతి నెల మీరు ఆలాగున చేయుచుండగా, మీరు పట్టజాలని ఆశీర్వాదములు ఆకాశపు వాకిండ్లు విప్పి, మీకు కుమ్మరించెదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అపవాదిని గద్దించి, మీ ఆశీర్వాదములను మ్రింగివేయవలదని వానికి ఆజ్ఞాపించెదను అని సెలవిచ్చుచున్నాడు. ఇంకను మన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబాలను కాపాడుతూ, ఆయన మ్రింగివేయువానిని కూడా గద్దిస్తాడు. అవును, నా ప్రియులారా, మన కానుకలను మనము దేవుని పరిచర్యకు సమర్పించెదము. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమచేత లక్షలాది మంది దీవించబడుచున్న చోట, మనము ఫలవంతమైన చోట నాటుచూ ఉండగా, దేవుడు అత్యంత సమృద్ధితో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు.
మూడవదిగా, మనము బీదలకు ఇచ్చువారుగా ఉన్నప్పుడు, దేవుడు మనలను వర్థిల్లింపజేస్తాడు. బైబిల్ నుండి యెషయా 58:7,8వ వచనములను చూచినట్లయితే, "నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును'' ప్రకారం మీరు ఆకలిగొన్న వారితో మీ ఆహారమును పంచుకున్నప్పుడు, నిరాశ్రయులను మీ యింటికి తీసుకొని వచ్చి, వారి పట్ల జాగ్రత్త వహించినప్పుడు, వస్త్రహీనునికి వస్త్రములను ఇచ్చినప్పుడు, విడిచిపెట్టబడినవారి కోసమై మీరు జాగ్రత్త వహించినప్పుడు, ప్రభువు మీ జీవితములోనికి వెలుగువచ్చువారినిగా చేయుచున్నాడు. ఆయన మిమ్మును స్వస్థపరచును. ఆయన మీ నీతి మీ ముందర నడిచి వెళ్లునట్లుగాను, ఆయన మిమ్మును పరిశుద్ధమైనవారినిగా ఉంచుతాడు. ఆయన మహిమ మిమ్మును భద్రపరచును. మనము బీదలకు ఇచ్చినప్పుడు ఆలాగున జరుగుతుంది. చివరిగా, నా ప్రియులారా, మీరు దేవుని సేవకులకు ఇవ్వండి. బైబిల్ నుండి 1 రాజులు 17:12-16వ వచనములో చూచినట్లయితే, సారెపతు విధవరాలు తనకు కలిగియున్న కొంచెము పిండిలోనే, ఆఖరి రొట్టెను తిని చనిపోదాము అనుకున్న పరిస్థితులలో కూడా దేవుని సేవకుడైన ప్రవక్తకు ఆ యొక్క రొట్టెను అందించినప్పుడు దేవుడు ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అదేవిధముగా, బైబిల్‌లో కీర్తనలు 16:2-3వ వచనములో చూచినట్లయితే, "నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు '' ప్రకారము మీరు ప్రేమించే దేవుని పిల్లలైన పరిశుద్ధులకు ఆలాగున ఇవ్వండి. వారు మీ నిమిత్తమై ప్రార్థించినవారు గనుకనే, వారికి ఇవ్వండి. నా ప్రియులారా, ఆలాగున మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదించి, మిమ్మును వర్థిల్లింపజేయును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ పరిచర్యకు మేము ఇచ్చువారలముగా మమ్మును మార్చుము. ఇచ్చుచున్న మమ్మును ఆశీర్వదించుము. యేసయ్యా, మేము నీకు మా హృదయాన్ని సమర్పించుకొనుటకు కృపను దయచేయుము. తండ్రి, మమ్మును ఆశీర్వదించే నీ హృదయానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఈ రోజు మేము మా హృదయాన్ని పూర్తిగా నీకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, మాలో ఉన్న పాపం, భయం మరియు భారాల నుండి మా నుండి తొలగించి, మమ్మును కడిగి పరిశుద్ధపరచుము. దేవా, నీ యొక్క సమాధానము మరియు ఆనందంతో మమ్మును నింపుము. ప్రభువా, మేము నీ పరిచర్యకు ఇచ్చున్నట్లుగా మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా ఆశీర్వాదములను మ్రింగివేయు అపవాదిని గద్దించి, మా ఆశీర్వాదాలను కాపాడుము. ప్రభువా, మేము పేదలను గుర్తుంచుకోవడానికి మరియు వారి పట్ల శ్రద్ధ వహించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నీ యొక్క సేవకులకు ఇచ్చునట్లుగాను మరియు వారిని ఘనపరచునట్లుగాను మమ్మును దీవించుము. ప్రభువా, తద్వారా మా జీవితంలో సమృద్ధి పొంగిపొర్లునట్లుగాను మరియు మాకు స్వస్థత శీఘ్రముగా లభించునట్లుగా చేయుమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.